Bible Language

Deuteronomy 15 (ERVTE) Easy to Read Version - Telugu

1 “ప్రతి ఏడు సంవత్సరాల అంతంలో, మీరు అప్పులన్నీ రద్దుచేయాలి.
2 మీరు మీ అప్పులను రద్దు చేయాల్సిన పద్ధతి యిది; మరో ఇశ్రాయేలు మనిషికి అప్పు యిచ్చిన ప్రతి ఇశ్రాయేలు వ్యక్తీ తన అప్పును రద్దుచేయాలి. ఆతడు ఒక సోదరుణ్ణి(ఇశ్రాయేలీయుని) అప్పు తిరిగి చెల్లించమని అడగ కూడదు. ఎందుకంటే సంవత్సంరలో అప్పులన్నీ రద్దు అయిపొయాయని యెహోవా ప్రకటించాడు గనుక.
3 ఒక విదేశీయుడ్ని మీరు తిరిగి చెల్లించమని అడగవచ్చు. కానీ మరో ఇశ్రాయేలు మనిషి చెల్లించాల్సిన బాకీనైనా మీరు రద్దుచేయాలి.
4 ఆయితే మీ మధ్య బీద ప్రజలు ఎవరూ ఉండరు. ఎందుకంటే మీరు నివసించుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో యెహోవా మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు.
5 మీరు మీ దేవుడైన యెహోవాకు పూర్తిగా విధేయులైతేనే ఇది జరుగుతుంది. వేళ నేను మీకు చెప్పిన ప్రతి ఆజ్ఞకూ మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి.
6 మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానం ప్రకారం ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరియు మీరు అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీకు ఉంటుంది. కాని మీరు మాత్రం ఇతరుల దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు అనేక రాజ్యలను పాలిస్తారు. కానీ రాజ్యాల్లో ఏదీ మిమ్మల్ని పాలించదు.
7 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు నివసించేటప్పుడు మీ ప్రజల మధ్య ఎవరైనా పేదవారు ఒకరు ఉండవచ్చును. మీరు స్వార్థపరులుగా ఉండకూడదు. పేద మనిషికి సహాయం చేసేందుకు మీరు నిరాకరించకూడదు.
8 మీరు అతనికి భాగం పంచిపెట్టేందుకు యిష్టపడాలి. వ్యక్తికి అవసరమైనవి అన్నీ అతనికి అప్పుగా ఇచ్చేందుకు మీరు ఇష్టపడాలి.
9 “ఏడవ సంవత్సరం అంటే అప్పులు రద్దుచేసే సంవత్సరం దగ్గర్లో ఉందని చెప్పి ఎవరికైనా అప్పు ఇచ్చేందుకు ఎన్నడూ తిరస్కరించవద్దు. అలాంటి చెడుతలంపు మీ మనసులో కలుగనియ్యవద్దు. సహాయం కావాల్సిన వ్యక్తిని గూర్చి నీవు ఎన్నడూ చెడుగా తలంచవద్దు. నీవు అతనికి సహాయం చేసేందుకు నిరాకరించకూడదు. పేదవానికి నీవు ఏమీ ఇవ్వకపోతే అతడు నీ మీద యెహోవాకు ఆరోపణ చేస్తాడు. మరియు యెహోవా నిన్ను పాపం చేసిన నేరస్థునిగా చూస్తాడు.
10 “పేదవానికి నీవు ఇవ్వగలిగినదంతా ఇవ్వు. అతనికి యిచ్చే విషయంలో చెడుగా భావించకు. ఎందుకంటే మంచి పని చేసినందుకు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కార్యాలన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ, నిన్ను ఆశీర్వాదిస్తాడు.
11 దేశంలో పేద ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. అందుకే మీ ప్రజలకు మీ దేశంలో అక్కరలో ఉండే పేద ప్రజలకు ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండాలని నేను మీకు ఆజ్ఞ యిస్తున్నాను.
12 “మీ ప్రజల్లో ఒకరు - ఒక హెబ్రీ పురుషుడు లేక స్త్రీ మీకు అమ్మబడితే అప్పుడు వ్యక్తి ఆరు సంవత్సరాలు మీ సేవ చేయాలి. అప్పుడు ఏడవ, సంవత్సరం వ్యక్తిని నీ దగ్గర్నుండి నీవు స్వేచ్ఛగా పోనివ్వాలి.
13 అయితే నీవు నీ బానిసను స్వేచ్ఛగా పోనిచ్చినప్పుడు, ఏమీ లేకుండానే వ్యక్తిని పోనివ్వ కూడదు.
14 మీ మందలోనుండి, మీ ధాన్యపుకళ్లములోనుండి, మీ ద్రాక్ష గానుగలోనుండి వ్యక్తికి మీరు పెద్ద వాటా ఇవ్వాలి. మీ దేవుడైన యెహోవా మీకు మంచివాటిని సమృద్ధిగా యిచ్చి ఆశీర్వదించాడు. అదే విధంగా మీరు కూడా మీ బానిసకు సమృద్ధిగా ఇవ్వాలి.
15 మీరు ఈజిప్టులో బానిసకు అని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించాడు. అందుచేత మీరు ఇలా చేయాలని నేడు నేను మీతో చెబుతున్నాను.
16 “అయితే మీ బానిసల్లో ఒకరు, ‘నిన్ను నేను విడువను’ అంటారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అతడు ప్రేమించటం చేత, మీ దగ్గర అతడు బాగా బ్రతికినందుచేత అతడుయిలా చెప్పవచ్చును.
17 సేవకుడు మీ తలుపుకు అతని చెవి ఆనించునట్లు ఉంచి, ఒక కదురును ఉపయోగించి అతని చెవిలో రంధ్రం చేయాలి. అప్పుడు అతడు శాశ్వతంగా మీకు బానిస అవుతాడు. మీ దగ్గరే ఉండిపోవాలి అనుకొనే బానిస స్త్రీలకు కూడ యిలాగే చేయాలి.
18 “మీరు మీ బానిసలను స్వేచ్ఛగా వెళ్లిపోనిచ్చినప్పుడు అది చెడ్ఢ పని అని మీరు తలంచకూడదు. ఒక జీతగానికి నీవు చెల్లించేదానిలో సగం డబ్బుకే అతడు ఆరు సంవత్స రాలు నీ దగ్గర పనిచేసాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు చేసే ప్రతిదానిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
19 “నీ గోవులలోగాని, గొర్రెలలోగాని మొదట పుట్టిన మగవాటన్నింటినీ నీవు యెహోవాకు ప్రతిష్ఠించాలి. జంతువుల్లో దేనినీ నీ పనికి ఉపయోగించవద్దు. గొర్రెల్లో దేనినుండీ ఉన్ని కత్తిరించవద్దు.
20 ప్రతి సంవత్సరం నీ గోవుల్లో, గొర్రెల్లో మొట్ట మొదట పుట్టిన జంతువును తీసుకొని, మీ దేవుడైన యెహోవా ఏర్పరచే స్థలంలో దానిని తినండి. యెహోవా మీతో ఉండే స్థలంలో మీరూ మీ కుటుంబం దానిని తినాలి.
21 “అయితే జంతువు కుంటిదిగాని, గుడ్డిదిగాని, లేక ఇంకేదైనా దోషంగాని ఉన్నదైతే, జంతువును మీ దేవుడైన యెహోవాకు మీరు బలిగా అర్పించకూడదు.
22 అయితే మీరు నివసించే స్థలంలో మీరు దాని మాంసం తినవచ్చును. పవిత్రమైన వాళ్లు, అపవిత్రమైన వాళ్లు ఎవరైనాసరే దానిని తినవచ్చును. దీనిని గూర్చిన నియమాలు దుప్పి, జింక మాంసం గూర్చిన లాంటివే.
23 కానీ జంతువు రక్తం మాత్రం మీరు తాగకూడదు. రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పోయాలి.”