Bible Language

Deuteronomy 21 (ERVTE) Easy to Read Version - Telugu

1 “మీరు నివసించేందుకు, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఒక పొలంలో హత్య చేయబడిన వాడు ఒకడు కనబడవచ్చును. కానీ ఆతణ్ణి చంపింది ఎవరో ఎవరికీ తెలియదు.
2 అప్పుడు మీ నాయకులు, న్యాయమూర్తులు బయటకు వచ్చి, చంపబడిన మనిషి చుట్టూ ఉన్న పట్టణాల దూరాన్ని కొలత వేయాలి.
3 చచ్చిన వానికి అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏదో తెలిసినప్పుడు, పట్టణం పెద్దల వారి మందలో నుండి ఒక ఆవును తీసుకొని రావాలి. అది పెయ్యగా ఉండాలి. అది ఎన్నడూ పనికీ వినియోగించబడనిది కావాలి.
4 అప్పుడు పట్టణపు నాయకుడు, నీరు ప్రవహిస్తున్న ఒక లోయలోనికి ఆవును తీసుకొని రావాలి. లోయ ఇదివరకు ఎన్నడూ దున్ననిది, మొక్కలు నాటనిదిగా ఉండాలి. అప్పుడు నాయకులు లోయలో ఆవు మెడను విరుగగొట్టాలి.
5 లేవీ సంతతివారు యాజకులుకూడ అక్కడికి వెళ్లాలి. (యెహోవాను సేవించేందుకు, ఆయన పేరిట ప్రజలను దీవించేందుకు మీ దేవుడైన యెహోవా యాజకులను ఏర్పాటు చేసుకొన్నాడు. వివాదానికి సంబంధించిన ప్రతి విషయంలో న్యాయం ఎవరిదో యాజకులే నిర్ణయిస్తారు.)
6 శవానికి అతి సమీపంగా ఉన్న పట్టణపు నాయకులంతా, లోయలో మెడ విరుగగొట్టబడిన ఆవుమీద వారి చేతులు కడుగుకోవాలి.
7 నాయకులు ఇలా చెప్పాలి, ‘ఈ మనిషిని మేము చంపలేదు. అది జరగటం మేము చూడలేదు.
8 యెహోవా, నీవు విమోచించిన నీ ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజల్లో నిర్దోషిని ఎవరినీ నిందించబడనీయకు.’ అప్పుడు హత్య నిమిత్తం వారు నిందించబడరు.
9 అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయటమే మీకు సరి. అలా చేయటం ద్వారా నిర్దోషులు ఎవరి హత్యనుగూర్చీ నిందించబడరు.
10 “మీరు మీ శత్రువులతో యుద్ధం చేస్తారు, మీరు వారిని ఓడించేటట్టు మీ దేవుడైన యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు మీ శత్రువులను బందీలుగా కొని పోతారు.
11 బందీలలో అందమైన ఒక స్త్రీని నీవు చూడవచ్చు. నీవు ఆమెను వాంఛించి, నీ భార్యగా చేసుకోవాలని తలంచవచ్చు.
12 అప్పుడు నీవు ఆమెను నీ ఇంటికి తీసుకొని రావాలి. ఆమె తన తల గొరిగించుకొని, గోళ్లు కత్తిరించుకోవాలి.
13 ఆమె ధరించి ఉన్న బట్టలు తీసివేయాలి. ఆమె నీ ఇంటనే ఉండి తన తల్లిదండ్రుల కోసం నెల రోజులు విలపించాలి, తర్వాత నీవు ఆమె దగ్గరికి పోవచ్చును. ఆమెకు భర్తవు కావచ్చును. ఆమె నీకు భార్య అవుతుంది.
14 కాని ఆమె వలన నీకు సంతృప్తి కలుగకపోతే, తనకు ఇష్టంవచ్చిన చోటికి నీవు ఆమెను పోనివ్వాలి. ఆయితే నీవు ఆమెను అమ్మకూడదు. నీవు ఆమెను బానిసగా చూడరాదు. ఎందుకంటే నీ వలన ఆమెకు అవమానము కలిగింది గనుక.
15 “ఒక పురుషునికి ఇద్దరు భార్యలు ఉండి, వారిలో ఒకదానికంటె మరొక దానిని అతడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉండవచ్చును. ఇద్దరు భార్యలూ ఆతనికి పిల్లలను కనవచ్చును. ఆతడు ప్రేమించని భార్యకు పుట్టిన బిడ్డ మొదటి బిడ్డ కావచ్చును.
16 ఆతడు తన ఆస్తిని తన పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు జ్యేష్ఠునికి చెందిన ప్రత్యేకమైన ని, తాను ప్రేమించే భార్య కుమారునికి ఆతడు ఇచ్చివేయకూడదు.
17 తన ప్రేమకు పాత్రము కాని మొదటి భార్య బిడ్డను ఆతడు స్వీకరించాలి. ఆతడు అన్నించిలో రెండంతల భాగం మొదటి కుమారునికి ఇవ్వాలి. ఎందుకంటే, బిడ్డ ఆతని మొదటి బిడ్డ గనుక. ప్రథమ సంతానం హక్కు బిడ్డకే చెందుతుంది.
18 “ఒకని కుమారుడు మొండివాడు, లోబడడు. కుమారుడు తండ్రికి గాని తల్లికి గాని విధేయుడు కాడు. తల్లిదండ్రులు కుమారుని శిక్షిస్తారు. ఆయినప్పటికీ వారి మాట ఆతడు నిరాకరిస్తాడు.
19 అప్పుడు పట్టణ సమావేశ స్థలం దగ్గర ఉండే పట్టణ నాయకుల దగ్గరకు తల్లిదండ్రులు వానిని తీసుకొని వెళ్లాలి.
20 పట్టణ నాయకులతో వారు ఇలా చెప్పాలి: ‘మా కుమారడు మొండివాడు, లోబడటం లేదు. మేము చెప్పిన పనీ అతడు చేయడు. వాడు విపరీతంగా తిని తాగుతున్నాడు.’
21 అప్పుడు పట్టణంలోని మనుష్యులు కుమారుని రాళ్లతో కొట్టి చంపాలి. ఇలా చేయటం ద్వారా చెడుతనాన్ని మీ నుండి తొలగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలంతా దీనిగూర్చి విని భయపడతారు.
22 “ఒక వ్యక్తి మరణ శిక్షకు యోగ్యమైన పాపం చేసి నేరస్థుడు కావచ్చును. అతణ్ణి చంపేసిన తర్వాత ఆతని శవాన్ని ఒక చెట్టుకు వేలాడదీయాలి.
23 అలా జరిగినప్పుడు ఆతని శవం రాత్రి అంతా చెట్టుకు ఉండకూడదు. మనిషిని మీరు రోజే తప్పక సమాధి చేయాలి. ఎందుకంటే, చెట్టుమీద వేలాడే మనిషి దేవుని చేత శపించబడ్డాడు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మీరు పాడు చేయకూడదు.