Bible Language

Genesis 50 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఇశ్రాయేలు మరణించినప్పుడు యోసేపు చాలా విచారించాడు. అతడు తన తండ్రిని కౌగలించుకొని, అతని మీద పడి ఏడ్చి, అతనిని ముద్దు పెట్టుకొన్నాడు.
2 తన తండ్రి దేహమును సిద్ధం చేయుమని అతడు తన సేవకులకు ఆజ్ఞాపించాడు (ఆ సేవకులు వైద్యులు). యాకోబు శరీరాన్ని సమాధి చేసేందుకు వైద్యులు సిద్ధం చేసారు. ఈజిప్టువారి ప్రత్యేక పద్ధతిలో శరీరాన్ని వారు సిద్ధం చేసారు.
3 ఈజిప్టు వారు పద్ధతిలో శరీరాన్ని సిద్ధం చేయాలంటే, శరీరాన్ని సమాధి చేసేందుకు ముందు 40 రోజులు వారికి అవసరం. తర్వాత ఈజిప్టువాళ్లు యాకోబు కోసం దుఃఖించటానికి ప్రత్యేక సమయం తీసుకొన్నారు. సమయం 70 రోజులు.
4 డెబ్భైరోజుల తర్వాత దఃఖసమయం ముగిసింది. కనుక ఫరో అధికారలతో యోసేపు మాట్లాడాడు. “దయచేసి ఫరోతో ఇది చెప్పండి
5 నా తండ్రి మరణ ఘడియల్లో నేను ఆయనకు ఒక వాగ్దానం చేసాను. కనాను దేశంలోని ఒక గుహలో నేను ఆయనను సమాధి చేస్తానని నేను వాగ్దానం చేసాను. ఇది ఆయన తనకోసం సిద్ధం చేసుకొన్న గుహ. కనుక దయచేసి వెళ్లి, నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి. అప్పుడు నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను” అన్నాడు యోసేపు.
6 “నీ మాట నిలబెట్టకో, వెళ్లి నీ తండ్రిని సమాధి చేయి” అని ఫరో జవాబిచ్చాడు.
7 కనుక యోసేపు తన తండ్రిని సమాధి చేసేందుకు వెళ్లాడు. ఫరో అధికారులంతా ఫరో పెద్దలు (నాయకులు) యోసేపుతో కూడ వెళ్లారు. ఫరో నాయకులు, ఈజిప్టులోని పెద్దలందరూ యోసేపుతో వెళ్లారు.
8 యోసేపు కుటుంబంలోని వాళ్లందరూ, అతనితో వెళ్లారు. మరియు తన తండ్రి కుటుంబం అంతా యోసేపుతో వెళ్లారు. పిల్లలు, పశువులు మాత్రమే గోషెను దేశంలో విడువబడటం జరిగింది
9 యోసేపుతో వెళ్లటానికి అందరూ రథాలమీద, గుర్రాలమీద వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు అయింది.
10 యోర్దాను నదికి తూర్పున గోరెన్ ఆఠదు కళ్లం దగ్గరకు వారు వెళ్లారు. స్థలంలో వారు ఇశ్రాయేలు నిమిత్తం భూస్థాపన క్రమాలు దీర్ఘంగా జరిగించారు. భూస్థాపన క్రమం ఏడు రోజులపాటు కొనసాగింది.
11 గోరెన్ ఆఠదులో జరిగిన భూస్థాపన క్రమాన్ని కనానులో నివసిస్తున్న ప్రజలు చూశారు. వారు “ఆ ఈజిప్టు వాళ్లు ఎంతగా దుఃఖిస్తున్నారో అని చెప్పుకొన్నారు” కనుక స్థలం ఇప్పుడు ఆబేల్ మిస్రాయిము అని పిలువబడుతుంది.
12 కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం చేసారు.
13 వారు అతని శరీరాన్ని కనానుకు తీసుకొని వెళ్లి, మక్ఫేలా గుహలో దానిని పాతిపెట్టారు. హిత్తీయుడగు ఎఫ్రోను దగ్గర అబ్రహాము కొన్న పొలంలోని మమ్రే సమీపాన ఉన్న గుహ ఇది. సమాధిస్థలంగా ఉపయోగించేందుకు అబ్రహాము గుహను కొన్నాడు.
14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత, అతనూ, అతనితో గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి ఈజిప్టు వెళ్లిపోయారు.
15 యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోదరులు దిగులుపడిపోయారు. చాలాకాలం క్రిందట వారు చేసినదాన్ని బట్టి యోసేపు ఇంకా వారిమీద కోపంగా ఉంటాడని వారు భయపడ్డారు. మనము చేసినదాని విషయంలో “బహుశాః యోసేపు మనల్ని ఇంకా ద్వేషించవచ్చు. మరియు మనం అతనికి చేసిన కీడంతటికి తిరిగి పగ తీర్చుకోవచ్చు” అని తమలో తాము అనుకొన్నారు.
16 కనుక సోదరులు యోసేపుకు సందేశం పంపించారు నీ తండ్రి చనిపోక ముందు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
17 ‘యోసేపుకు వారు చేసిన కీడును దయతో క్షమించమని నేను అతణ్ణి బ్రతిమాలుతున్నానని యోసేపుతో చెప్పండి’ అని అతడు చెప్పాడు. కనుక యోసేపూ, మేము చేసిన తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు. మేము నీ తండ్రి దేవుని దాసులం. యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి, అతడు ఏడ్చేసాడు.
18 యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్లి అతని ఎదుట సాగిలపడ్డారు. వారు “మేము నీకు దాసులం” అని చెప్పారు.
19 అప్పుడు యోపేసు, “భయపడకండి, నేనేం దేవుణ్ణి కాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు.
20 మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు.
21 కనుక భయపడవద్దు. నేను మీ కోసం, మీ పిల్లలకోసం జాగ్రత్త పుచ్చుకుంటాను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో దయగా మాట్లాడాడు. సోదరులకు యిది నెమ్మది కలిగించింది.
22 యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా ఈజిప్టులోనే జీవించటం కొనసాగించాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు.
23 యోసేపు జీవించి ఉన్నప్పుడు, ఎఫ్రాయిముకు పిల్లలు, పిల్లల పిల్లలు పుట్టారు. మరియు అతని కుమారుడు మనష్షేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు. మాకీరు పిల్లలను చూచేంతవరకు యోసేపు జీవించాడు.
24 యోసేపు మరణం దగ్గరపడినప్పుడు, అతడు, “నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని దేశంనుండి బయటకు తీసుకొని వెళ్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబలకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు” అని తన సోదరులతో చెప్పాడు.
25 అప్పుడు యోసేపు తన వాళ్లందర్నీ ఒక వాగ్దానం చెయ్యమని అడిగాడు. “దేవుడు మిమ్మల్ని నూతన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి” అన్నాడు యోసేపు.
26 యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈజిప్టులో మరణించాడు. వైద్యులు అతని శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధంచేసి, ఈజిప్టులో సమాధి పెట్టెలో శరీరాన్ని ఉంచారు.