Bible Language

Joshua 16 (ERVTE) Easy to Read Version - Telugu

1 యోసేపు కుటుంబానికి లభించిన దేశం ఇది. దేశం యెరికో సమీపాన యోర్దాను నది దగ్గర ప్రారంభమై యెరికో జలాల వరకు కొనసాగింది. (ఇది యెరికోకు సరిగ్గా తూర్పున ఉంది) సరిహద్దు యెరికోనుండి పైకి, బేతేలు కొండ ప్రాంతంవరకు వ్యాపించింది.
2 తర్వాత సరిహద్దు బేతేలు (లూజు)నుండి అతరోత్ వద్ద సరిహద్దువరకు కొనసాగింది.
3 తర్వాత సరిహద్దు అర్కీయ పశ్చిమాన యాఫ్లెతీయ ప్రజల సరిహద్దువైపు పోయింది. దిగువ బెత్‌హరను వరకూ సరిహద్దు కొనసాగింది. తర్వాత సరిహద్దు గెజెరుకు పోయి, సముద్రం వరకు వ్యాపించింది.
4 కనుక మనష్షే, ఎఫ్రాయిం ప్రజలకు వారి భూమి లభించింది. (మనష్షే, ఎఫ్రాయిము యోసేపు కుమారులు)
5 ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన భూమి ఇది: తూర్పున ఎగువ బేత్‌హోరోను సమీపంలో అతారోతు అద్దారు వద్ద వారి సరిహద్దు మొదలయింది.
6 మరియు పశ్చిమ సరిహద్దు మిస్మెతతు వద్ద మొదలయింది. సరిహద్దు తూర్పున తానతు షిలోహుకు మళ్లి, యానోయకు విస్తరించింది.
7 అప్పుడు సరిహద్దు యానోయనుండి క్రిందికి అతారోతు మరియు నారాకు వెళ్ళింది. సరిహద్దు యెరికోను తాకి, యోర్దాను నది దగ్గర నిలిచిపోయేంతవరకు కొనసాగింది.
8 సరిహద్దు తప్పూయ మొదలుకొని కానా ఏటివరకు పశ్చిమంగా వ్యాపించి, సముద్రం దగ్గర అంతమయింది. అది మొత్తం ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన దేశం. వంశంలోని ఒక్కో కుటుంబానికి దేశంలో కొంత భాగం దొరికింది.
9 ఎఫ్రాయిము వారి సరిహద్దు పట్టణాలు అనేకం నిజానికి మనష్షే వారి సరిహద్దుల్లోనే ఉన్నాయి. కానీ పట్టణాలు, పొలాలు ఎఫ్రాయిము వారికే వచ్చాయి.
10 అయితే గెజరు పట్టణంనుండి కనానీ ప్రజలను ఎఫ్రాయిము ప్రజలు వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ ఎఫ్రాయిము ప్రజల మధ్య కనానీ ప్రజలు నివసిస్తున్నారు. కానీ కనానీ ప్రజలు ఎఫ్రాయిము ప్రజలకు బానిసలుగా అయ్యారు.