Bible Language

Leviticus 3 (ERVTE) Easy to Read Version - Telugu

1 “ఒక వేళ ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ సమాధాన బలి అయితే, మగ లేక ఆడ జంతువును తన పశువుల మందలోనుండి అతడు యెహోవాకు ఇస్తే పశువులో ఎలాంటి దోషం ఉండకూడదు.
2 వ్యక్తి పశువు తలమీద తన చేతులు ఉంచాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర పశువును అతడు వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
3 వ్యక్తి సమాధాన బలిలోనుంచి యెహోవాకు హోమం చేయాలి. అంత్రములకు, లోపలి అవయవాలకు ఉండే కొవ్వు అంతటినీ అతడు అర్పించాలి.
4 మూత్రపిండాలను రెండింటి మీద కొవ్వును, నడుం దగ్గర కొవ్వును అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జమును కప్పి ఉండే కొవ్వును అతడు తీయాలి.
5 అప్పుడు కొవ్వును అహరోను కుమారులు బలిపీఠం మీద దహించాలి. దీనిని వారు అగ్నిలో కట్టెలమీద ఉన్న దహనబలి వేస్తారు. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనను యిచ్చే హోమం.
6 “ఒకవేళ వ్యక్తి, యెహోవాకు సమాధాన అర్పణగా ఒక జంతువును మందలోనుండి తెస్తే, అది ఆడదిగాని, మగదిగాని దోషం లేనిదిగా ఉండాలి.
7 అతడు ఒక గొర్రెపిల్లను తన అర్పణగా తెస్తే, అతడు దానిని యెహోవా ఎదుటికి తేవాలి.
8 సన్నిధి గుడారం ఎదుట అతడు దాని తలమీద చేయి పెట్టి, దానిని వధించాలి. దాని రక్తాన్ని అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ చిలకరిస్తారు.
9 అప్పుడు అతడు సమాధాన బలిలో నుంచి కొంత యెహోవాకు హోమం చేయాలి. కొవ్వు, కొవ్విన తోకమొత్తం, దాని లోపలి అవయవాల మీద చుట్టూ ఉండే కొవ్వు అతడు తీసుకొని రావాలి (వెన్నుపూస నుండి ఉండే తోకను అతడు కోసి వేయాలి).
10 రెండు మూత్రపిండాలను, వాటిని కప్పి ఉండే కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు అర్పించాలి. కార్జానికి ఉండే కొవ్వుకూడా అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి.
11 అప్పుడు యాజకుడు జంతువును బలిపీఠం మీద దహిస్తాడు. అది యెహోవాకు ప్రజలు అగ్నితో అర్పించిన ఆహారం అవుతుంది.
12 “ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ మేక అయితే, అతడు దానిని యెహోవా ఎదుట అర్పించాలి.
13 సన్నిధి గుడార ద్వారం దగ్గర అతడు దాని తల మీద చేయి పెట్టి దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు మేక రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
14 తర్వాత మేకలోని కొంతభాగాన్ని అతడు యెహోవాకు హోమం చేయాలి. లోపలి భాగాల్లోను, వాటి మీదను ఉండే కొవ్వును అతడు అర్పించాలి.
15 రెండు మూతగ్రంథుల్ని, వాటి మీద ఉండే కొవ్వును, మేక నడుం దగ్గరి కొవ్వును అతడు అర్పణ చేయాలి. కార్జాన్ని కప్పి ఉండే కొవ్వును అతడు అర్పణ చేయాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి.
16 మేక అవయవాలను యాజకుడు దహనం చేయాలి. అది అగ్నితో అర్పించబడ్డ ఆహారం అవుతుంది. అది ఇష్టమైన సువాసనగా ఉంటుంది. కొవ్వు మొత్తం యెహోవాకు చెందుతుంది.
17 మీ తరాలన్నింటికీ శాశ్వతంగా నియమం కొనసాగుతుంది. మీరు ఎక్కడ నివసించినా కొవ్వునుగాని రక్తాన్నిగాని మీరు తినకూడదు.”