Bible Language

Ruth 3 (ERVTE) Easy to Read Version - Telugu

1 రూతు అత్త నయోమి, “చూడు బిడ్డా, ఒకవేళ నీ కోసం నేనొక మంచి భర్తను చూస్తే బాగుంటుందేమో, అది నీకు క్షేమం.
2 (ఒక వేళ బోయజే తగినవాడేమో) బోయజు మనకు చాలా దగ్గర బంధువు. అతని దగ్గర పనిచేసే స్త్రీలతో నీవూ పని చేసావు. రోజు రాత్రి అతడు కళ్లము దగ్గర పని చేస్తాడు.
3 నీవు పోయి స్నానం ెచేసి బట్టలు కట్టుకో, మంచి బట్టలు కట్టుకొని కళ్లము దగ్గరకు వెళ్లు, అయితే, బోయజు భోజనము చెయ్యటము అయ్యేంత వరకు అతనికి కనబడకు.
4 అతడు భోజనము చేసిన తర్వాత పండుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అతను ఎక్కడ పండుకుంటాడో గమనిస్తూ ఉండు. అక్కడికి వెళ్లి, అతని కాళ్లమీదున్న దుప్పటి తొలగించి, అక్కడే అతని దగ్గరే పండుకో. అప్పుడు నీవేమి చేయాలో (పెళ్లి గూర్చి) అతనే నీకు చెప్తాడు.”
5 “నీవు చెప్పినట్టే చేస్తా” అని జవాబిచ్చింది రూతు.
6 రూతు కళ్లము దగ్గరకు వెళ్లింది. ఏమి చేయుమని అత్త చెప్పిందో అదంతా చేసింది రూతు.
7 తిని తాగడం అయినతర్వాత బోయజు బాగా తృప్తిగా ఉన్నాడు. ధాన్యంకుప్ప దగ్గర పండుకునేందుకు వెళ్లాడు బోయజు. అప్పుడు రూతు మెల్లమెల్లగా వెళ్లి అతని కాళ్లమీద దుప్పటి తొలగించింది. అతని పాదాల దగ్గరే ఆమె పండుకొంది.
8 సుమారు మధ్యరాత్రి బోయజు పక్కకు దొర్లాడు ( నిద్రలోనుంచి మేల్కొన్నాడు) అతను చాలా ఆశ్చర్య పోయాడు. తన పాదాల దగ్గర ఒక స్త్రీ పండుకొనివుంది.
9 “ఎవరు నీవు” అన్నాడు బోయజు. “నీ సేవకురాలనైన రూతును. నన్ను కాపాడాల్సింది నీవే. నీ దుప్పటి నా మీద కప్పు” అన్నది రూతు.
10 అందుకు బోయజు, “నా కుమారీ! యెహోవా నిన్ను దీవించునుగాక! నాపై నీవు చాలా దయ చూపెట్టావు. ెమొదట్లో నీవు నయోమి మీద చూపెట్టిన దయకంటె, ఇప్పుడు నామీద చూపెట్టిన దయ చాలా ఎక్కువ. నీవు పెళ్లి చేసుకొనేందుకు ధనవంతుడో, పేదవాడో మరో యువకుడిని చూసుకుని ఉండాల్సింది, కాని నీవు అలా చేయలేదు.
11 కనుక చూడు బిడ్డా! నీవేమి భయపడకు. నీవు అడిగింది నేను చేస్తా. నీవు చాలా మంచిదానివని మన ఊళ్లో అందరికీ తెలుసు.
12 నేను నీకు చాలా దగ్గర బంధువును అనడం కూడ సత్యమే. అయితే, నాకంటే నీకు మరింత దగ్గర బంధువు ఒకాయన ఉన్నాడు.
13 రాత్రికి నీవు ఇక్కడ ఉండు. ఆయన నీకేమైనా సహాయము చేస్తాడేమో ఉదయాన్నే తెలుసు కుందాము. నీకు సహాయము చేయటానికి ఆయన నిర్ణయం తీసుకొంటే మంచిదే. సహాయం చేయటానికి ఆయన నిరాకరిస్తే మాత్రం దేవుడు సజీవుడు గనుక నేనే నిన్ను పెళ్లాడి ఎలీమెలెకు భూమిని నీ కోసము మళ్లీ కొనియిస్తాను. ఇది నా వాగ్దానం. కనుక తెల్లారే వరకు ఇక్కడే పడుకో.”
14 అందుచేత తెల్లారేవరకు అతని కాళ్ల దగ్గరే పడుకొనింది రూతు. తెల్లవారుఝామునే ఒకరినొకరు గుర్తించే పాటి వెలగు రాకముందే ఆమె లేచివెళ్లి పోయింది. “రాత్రి నీవు నా దగ్గరకు ఇక్కడికి వచ్చిన సంగతి రహస్యముగానే ఉంచుదాము” అన్నాడు బోయజు ఆమెతో.
15 “నీ దుప్పటి నా దగ్గరకు తీసుకురా, దాన్ని తెరచి పట్టుకో” అన్నాడు బోయజు. అందుచేత రూతు తన దుప్పటి తెరచి పట్టుకుంది. ఆమె అత్తగారైన నయోమికి కానుకగా ఒక తూమెడు యవలు కోలిచి ఇచ్చాడు బోయజు. దుప్పటిని మూట కట్టి ఆమె భుజంమీద పెట్టి, బోయజు ఊళ్లోకి వెళ్లిపోయాడు.
16 రూతు తన ఆత్త నయోమి ఇంటికి వెళ్లిపోయింది. నయోమి (గుమ్మం దగ్గరకు వెళ్లి) “ఎవరది” అని అడిగింది. (రూతు ఇంట్లోకి వెళ్లి) తనకోసము బోయజు చేసిందంతా చెప్పింది.
17 “నీకు కానుకగా ఇమ్మని బోయజు యవలు నాకు ఇచ్చాడు. నీ కోసము కానుక తీసుకుపోకుండా నేను ఇంటికి వెళ్లకూడదన్నాడు బోయజు” అని చెప్పింది రూతు.
18 “నా కుమారీ, ఏమి జరుగుతుందో తెలిసేంతవరకు నెమ్మదిగా ఉండు. బోయజు మాత్రం ఏమిచేయాలో అది చేసేంతవరకు ఊరుకోడు. ఏమి జరిగేదీ ఈరోజు గడవక ముందే మనము వింటాము.” అన్నది నయోమి.