Bible Language

Psalms 143 (ERVTE) Easy to Read Version - Telugu

1 యెహోవా, నా ప్రార్థన వినుము. నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబుయిమ్ము. నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
2 నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు. నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
3 కానీ నా శత్రువులు నన్ను తరుముతున్నారు. వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు. శాశ్వత చీకటి సమాధిలోనికి నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
4 నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది. నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
5 కానీ చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను. నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను. యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
6 యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను. ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.
7 యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము! నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను. నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము. సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
8 యెహోవా, ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము నేను నిన్ను నమ్ముకొన్నాను. సరియైన మార్గాన్ని నాకు చూపించుము. నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
9 యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము. నీవు నా దేవుడవు.
11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు నన్ను జీవించనిమ్ము. నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి, నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము. ఎందుకంటే నేను నీ సేవకుడను.