Bible Versions
Bible Books

Ezra 7 (TEV) Telegu Old BSI Version

1 సంగతులు జరిగినపిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడైయుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు
2 హిల్కీయా షల్లూము కుమారుడు షల్లూము సాదోకు కుమారుడు సాదోకు అహీటూబు కుమారుడు
3 అహీటూబు అమర్యా కుమారుడు అమర్యా అజర్యా కుమారుడు అజర్యా మెరా యోతు కుమారుడు
4 మరాయోతు జెరహ్యా కుమారుడు జెరహ్యా ఉజ్జీ కుమారుడు ఉజ్జీ బుక్కీ కుమారుడు
5 బుక్కీ అబీషూవ కుమారుడు అబీషూవ ఫీనెహాసు కుమా రుడు ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధానయాజకుడైన అహరోను కుమారుడు.
6 ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషేయొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రిమరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు మనవి చేసినను రాజు అనుగ్రహించును.
7 మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు ఏడవ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వార పాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి.
8 రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను.
9 మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను.
10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను.
11 యెహోవా ఆజ్ఞల వాక్యములయందును, ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త యిచ్చిన తాకీదు నకలు
12 రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను
13 చేతనున్న నీ దేవుని ధర్మ శాస్త్రమును బట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శచేయుటకు నీవు రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయ మేమనగా,
14 మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్లుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరు నీతోకూడ వెళ్లవచ్చును.
15 మరియు యెరూషలేములో నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతనియొక్క మంత్రులును స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసికొని పోవలెను.
16 మరియు బబులోను ప్రదేశమందంతట నీకు దొరకు వెండి బంగా రములంతయును, జనులును యాజకులును యెరూష లేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసికొని పోవలెను.
17 తడవు చేయక నీవు ద్రవ్యముచేత ఎడ్లను పొట్లేళ్లను గొఱ్ఱ పిల్లలను, వాటితోకూడ ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలనుకొని, యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము.
18 మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచినదానిని చేయవచ్చును.
19 మరియు నీ దేవుని మందిరపు సేవకొరకు నీకియ్య బడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని యెదుట అప్పగింపవలెను.
20 నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన యెడల అది రాజుయొక్క ఖజానాలోనుండి నీకియ్యబడును.
21 మరియురాజునైన అర్తహషస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ యేదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైన అడిగిన యెడల ఆలస్యముకాకుండ మీరు దాని చేయవలెను.
22 వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను.
23 ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింప వలసినది. రాజుయొక్క రాజ్యముమీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను?
24 మరియు యాజ కులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.
25 మరియు ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానముచొప్పున నీవు నీ దేవునియొక్క ధర్మశాస్త్రవిధులను తెలిసికొనినవారిలో కొందరిని అధి కారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను, ధర్మశాస్త్రవిషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను.
26 నీ దేవుని ధర్మశాస్త్రముగాని, రాజుయొక్క చట్టము గాని, గైకొననివాడెవడో త్వరగా విచారణచేసి, మరణ శిక్షయైనను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను.
27 యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను,రాజును అతని మంత్రులును రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.
28 నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతోకూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×