Bible Versions
Bible Books

Proverbs 17 (TEV) Telegu Old BSI Version

1 రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.
2 బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచు కొనును.
3 వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.
4 చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధి కుడు చెవియొగ్గును.
5 బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించు వాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచ బడడు.
6 కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము.
7 అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.
8 లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవ ర్తించును.
9 ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.
10 బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.
11 తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును.
12 పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు
13 మేలుకు ప్రతిగా కీడు చేయువాని యింటనుండి కీడు తొలగిపోదు.
14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు
15 నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు.
16 బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా?
17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
18 తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.
19 కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.
20 కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును.
21 బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు.
22 సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
23 న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును.
24 జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది బుద్ధిహీనువి కన్నులు భూదిగంతములలో ఉండును.
25 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును
26 నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే.
27 మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.
28 ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×