Bible Versions
Bible Books

Proverbs 21 (TEV) Telegu Old BSI Version

1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.
2 ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.
3 నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలుల నర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
4 అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.
5 శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును
6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.
7 భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును.
8 దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.
9 గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.
10 భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.
11 అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
12 నీతిమంతుడైన వాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కని పెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.
13 దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.
14 చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతి పరచును.
15 న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము.
16 వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును.
17 సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వ ర్యము కలుగదు.
18 నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలు దురు
19 ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.
20 విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
21 నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.
22 జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.
23 నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
24 అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.
25 సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.
26 దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.
27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయ ములు.
28 కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
29 భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.
30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
31 యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×