Bible Language

Hosea 5 (ERVTE) Easy to Read Version - Telugu

1 “యాజకులారా, ఇశ్రాయేలు రాజ్యమా, రాజవంశ ప్రజలారా తీర్పు మీకోసమే ఉంది. నా మాట వినండి. “మిస్పాలో మీరు ఒక ఉచ్చువలే ఉన్నారు. తాబోరులో నేలమీద పరచిన ఒక వలవలె మీరు ఉన్నారు.
2 మీరు ఎన్నెన్నో చెడ్డ పనులు చేశారు. కనుక మిమ్మల్నందర్నీ నేను శిక్షిస్తాను!
3 ఎఫ్రాయిము నాకు తెలుసు. ఇశ్రాయేలు చేసినవి నాకు తెలుసు ఎఫ్రాయిమూ, ఇప్పటికిప్పుడు ఒక వేశ్యలాగ నీవు ప్రవర్తిస్తావు. ఇశ్రాయేలు తన పాపాలతో అశుద్ధమయింది.
4 ఇశ్రాయేలు ప్రజలు చెడ్డపనులు అనేకం చేశారు. వారు తిరిగి వారి దేవుని దగ్గరకు రాకుండా చెడ్డ పనులే వారిని అడ్డగిస్తాయి. ఇతర దేవతలనువెంటాడే మార్గాలను గూర్చి వారు ఎల్లప్పుడూ తలుస్తున్నారు. వారు యెహోవాను ఎరుగరు.
5 ఇశ్రాయేలీయుల గర్వమే వారికి విరోధంగా ఒక సాక్ష్యం అవుతుంది. కనుక ఇశ్రాయేలు, ఎఫ్రాయిము వారి పాపంలో కాలు జారిపడతారు. కాని యూదా కూడ వారితోపాటేకాలు తప్పిపడిపోతుంది.
6 “ప్రజా నాయకులు యెహోవా కోసం వెదకుటకు వెళ్లారు. వారు, వారి ‘గొర్రెలను’ మరియు ‘ఆవులను’ వారితో కూడ తీసుకొని వెళ్లారు. కాని యెహోవాను వారు కనుగొనలేదు. ఎందుచేతనంటే ఆయన వారిని విడచిపెట్టాడు.
7 వారు యెహోవాకు విశ్వాస పాత్రులుగా ఉండలేదు. వారి పిల్లలు పరాయి వాని పిల్లలుగా పుట్టిరి. కాని ఇప్పుడు వారు, వారి పొలాలతో బాటు అమావాస్యనాటికి నాశన మవుతారు.”
8 “గిబియాలో కొమ్ము ఊదండి. రామాలో బాకా ఊదండి. బేతావెను వద్ద హెచ్చరిక చేయండి. బెన్యామీనూ, శత్రువు నీ వెనుక ఉన్నాడు.
9 శిక్షా సమయంలో ఎఫ్రాయిము పాడై పోతాడు. విషయాలు తప్పక జరుగుతాయి అని నేను (దేవుడు) ఇశ్రాయేలు గోత్రాల వారిని హెచ్చరిస్తున్నాను.
10 యూదా నాయుకులు మరొక మనిషి ఆస్తిని దొంగిలించుటకు ప్రయత్నించే దొంగల్లాగ తయారయ్యారు. కనుక నేను (దేవుడు) వారి మీద నా కోపాన్ని నీళ్లలాగ పోస్తాను.
11 ఎఫ్రాయిము శిక్షించబడతాడు. అతడు ద్రాక్షా పళ్లలాగ చితుకగొట్టబడి అణగదొక్కబడతాడు. ఎందుచేతనంటే, అతడు దుష్టత్వాన్ని చెయ్యాలని కోరుకున్నాడు.
12 చిమ్మెట బట్టను పాడుచేసినట్టు ఎఫ్రాయిమును నేను నాశనం చేస్తాను. చెక్కముక్కను చెదలపురుగు పాడుచేసినట్టు నేను యూదాను పాడుచేస్తాను.
13 ఎఫ్రాయిము తన రోగాన్ని చూశాడు, యూదా తన గాయాన్ని చూశాడు. కనుక వారు సహాయంకోసం ఆష్షూరు వెళ్లారు. తమ సమస్యలను గూర్చి తాము మహారాజుతో చెప్పారు. కాని రాజు మిమ్మల్ని స్వస్థపరచలేడు. అతడు మీ గాయాన్ని బాగుచేయలేడు.
14 ఎఫ్రాయిముకు నేను ఒక సింహంవలె ఉంటాను. యూదా రాజ్యానికి నేను ఒక కొదమ సింహంలాగ ఉంటాను. గనుక నేను, అవును యెహోవానైన నేనే వారిని ముక్కలుగా చీల్చివేస్తాను. నేను వారిని తీసుకొని వెళ్ళిపోతాను. నానుండి వారిని ఎవ్వరూ రక్షించలేరు.
15 ప్రజలు తాము దోషులమని ఒప్పుకొనేంత వరకు నాకోసం వారు వెదకుతూ వచ్చేంత వరకు నేను నా స్థలానికి వెళ్లిపోతాను. అవును తమ కష్టంలో నన్ను కనుక్కొనేందుకు వారు కష్టపడి ప్రయత్నిస్తారు.”