Bible Versions
Bible Books

Hosea 6 (ERVTE) Easy to Read Version - Telugu

1 “రండి, మనం తరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం. ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు. ఆయన మనలను గయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు.
2 తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు. మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు. అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం.
3 మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము. ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. సూర్యోదయం వస్తుందని మనకు తెలిసినట్లే ఆయన వస్తున్నాడని మనకు తెలుసు. యెహోవా వర్షంలాగ మన దగ్గరకు వస్తాడు. నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ ఆయన వస్తాడు.”
4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి? యూదా, నిన్ను నేను ఏమి చేయాలి? నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది. వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ నమ్మకత్వం ఉంది.
5 నేను ప్రవక్తలను ఉపయోగించి ప్రజల కోసం న్యాయచట్టం చేశాను. నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు. కానీ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి.
6 ఎందుచేతనంటే నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే. అంతేగాని బలిఅర్పణకాదు. ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు.
7 అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు. వారి దేశంలో వారు నాకు అపనమ్మకంగా ఉన్నారు.
8 గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం. ప్రజలు ఇతరులను ఉపాయం చేసి చంపేశారు.
9 బందిపోటు దొంగలు దాగుకొని, ఎవరిమీదనైనా పడేందుకు వేచిఉంటారు. అదే విధంగా యాజకులు షెకెము వెళ్లే మార్గంలో పొంచి ఉండి, మార్గంలో వేళ్లేవారిని వారు చంపుతారు. వారు దుర్మార్గపు పనులు చేశారు.
10 ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను. ఎఫ్రాయిము దేవునకి అపనమ్మకస్తుడు. ఇశ్రాయేలు తన పాపంతో అశుద్ధమయింది.
11 యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది. బానిసత్వం నుండి నా ప్రజలను నేను వెనుకకు తీసుకొని వచ్చునప్పుడు అది సంభవిస్తుంది.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×