Bible Versions
Bible Books

Genesis 11 (TEV) Telegu Old BSI Version

1 భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
2 వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి
3 మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.
4 మరియు వారుమనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
5 యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
6 అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండద
7 గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
8 ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు పట్టణమును కట్టుట మానిరి.
9 దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.
10 షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.
11 షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
12 అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
13 అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
14 షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
15 షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
16 ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
17 ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
18 పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.
19 పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
20 రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.
21 రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
22 సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.
23 సెరూగు నాహోరును కనినతరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
24 నాహోరు ఇరువది తొమి్మది యేండ్లు బ్రదికి తెరహును కనెను.
25 నాహోరు తెరహును కనినతరు వాత నూటపం దొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
26 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహో రును హారానును కనెను.
27 తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహో రును హారానును కనెను. హారాను లోతును కనెను.
28 హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణ ములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.
29 అబ్రామును నాహోరును వివాహము చేసి కొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
30 శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.
31 తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
32 తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×