Bible Versions
Bible Books

Nehemiah 2 (TEV) Telegu Old BSI Version

1 అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుట విచారముగా ఉండలేదు.
2 కాగా రాజునీకు వ్యాధిలేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయదుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా
3 నేను మిగుల భయపడిరాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.
4 అప్పుడు రాజుఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి
5 రాజుతోనీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.
6 అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగానీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను.
7 ఇదియు గాక రాజుతో నే నిట్లంటిని రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతల నున్న అధికారులకు తాకీదులను,
8 పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.
9 తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను.
10 హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.
11 అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి
12 రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచననునేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండ లేదు.
13 నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకా రములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.
14 తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.
15 నేను రాత్రి యందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచినమీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.
16 అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైనవారికే గాని నేను సంగతి చెప్పి యుండలేదు.
17 అయితే వారితో నేనిట్లంటినిమనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.
18 ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారుమనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.
19 అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మో నీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయు డైన గెషెమును మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించిమీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.
20 అందుకు నేనుఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×