Bible Versions
Bible Books

Nehemiah 3 (TEV) Telegu Old BSI Version

1 ప్రధానయాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులును లేచి గొఱ్ఱల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయా గోపురము వరకును హన న్యేలు గోపురమువరకును ప్రాకారమునుకట్టి ప్రతిష్ఠించిరి.
2 అతని ఆనుకొని యెరికో పట్టణపువారు కట్టిరి; వారిని ఆనుకొని ఇమీ కుమారుడైన జక్కూరు కట్టెను;
3 మత్స్యపు గుమ్మమును హస్సెనాయా వంశస్థులుకట్టిరి; మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను ఆమర్చిరి.
4 వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనాకుమారుడైన సాదోకును,
5 వారిని ఆనుకొని తెకోవీయులును బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనక పోయిరి.
6 పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పానెయ కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లా మును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.
7 వారిని ఆనుకొని గిబియో నీయులును మిస్పావారును గిబియోనీయుడైన మెలట్యా యును మేరోనోతీయుడైన యాదోనును ఏటి యివతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలమువరకు బాగు చేసిరి.
8 వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధియైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడై యుండెను. అతని ఆనుకొని ఔషధజ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేముయొక్క వెడల్పు గోడవరకు దాని నుండనిచ్చిరి.
9 వారిని ఆనుకొని యెరూషలేములో సగముభాగమునకు అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను.
10 వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా హరూమపు కమారుడైన యెదాయా బాగుచేసెను, అతని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై యుండెను.
11 రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.
12 వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతియైన హల్లోహెషు కుమారుడైన షల్లూ మును ఆతని కుమార్తెలును బాగుచేసిరి.
13 లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారుకట్టిరి.
14 బేత్‌హక్కెరెము ప్రదేశమునకు అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మ మును బాగు చేసెను, ఆతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను
15 అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతియైన కొల్హోజె కుమారు డైన షల్లూము ధారయొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణమునుండి క్రిందకు పోవు మెట్లవరకు రాజు తోటయొద్దనున్న సిలోయము మడుగుయొక్క గోడను అతడు కట్టెను.
16 అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలములవరకును కట్టబడిన కోనేటివరకును పరాక్రమశాలుల యిండ్ల స్థలమువరకును కట్టెను.
17 అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను; అతని ఆనుకొని తన భాగములో కెయిలాయొక్క సగముభాగమునకు అధిపతియైన హషబ్యా బాగుచేయువాడాయెను.
18 అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను.
19 అతని ఆనుకొని మిస్పాకు అధి పతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగు చేసెను.
20 అతని ఆనుకొని గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటిద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.
21 అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారమునుండి యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను.
22 అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి.
23 వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.
24 అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను.
25 అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురమువరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయు వాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.
26 ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి.
27 వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి.
28 గుఱ్ఱపు గుమ్మమునకు పైగా యాజకులందరు తమ యిండ్ల కెదురుగా బాగుచేసిరి.
29 వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆను కొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.
30 అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయు వారైరి; వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను.
31 అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలముయొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను.
32 మరియు మూలకును గొఱ్ఱల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులును బాగుచేసిరి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×