Bible Versions
Bible Books

2 Kings 19 (TEV) Telegu Old BSI Version

1 హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి
2 గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజ కులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయాయొద్దకు పంపెను.
3 వీరు గోనెపట్ట కట్టుకొని అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరిహిజ్కియా సెల విచ్చునదేమనగాఈ దినము శ్రమయు శిక్షయు దూష ణయు గల దినము;పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.
4 జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.
5 రాజైన హిజ్కియా సేవకులు యెషయాయొద్దకు రాగా
6 యెషయా వారితో ఇట్లనెనుమీ యజమానునికి మాట తెలియజేయుడియెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరురాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.
7 అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.
8 అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.
9 అంతట కూషురాజైన తిర్హాకా తనమీదయుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడి నప్పుడు, అతడు ఇంకొకసారి హిజ్కియాయొద్దకు దూత లను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.
10 యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడియెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని యున్న నీ దేవునిచేత మోసపోకుము.
11 ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవుమాత్రము తప్పించుకొందువా?
12 నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారాను వారు గాని, రెజెపులు గాని, తెలశ్శారులో నుండిన ఏదె నీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించు కొనిరా?
13 హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వియీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి?
14 హిజ్కియా దూతలచేతిలోనుండి ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి
15 యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెనుయెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యా కాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోక మందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.
16 యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము.
17 యెహోవా, అష్షూరురాజులు జనములను వారి దేశములను పాడుచేసి
18 వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి.
19 యెహోవా మా దేవా; లోక మందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడ వైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.
20 అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వర్తమానము పంపెనుఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చు నదేమనగా అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థననేను అంగీకరించియున్నాను.
21 అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగాసీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయు చున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది.
22 నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి?
23 ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా.నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకునులెబానోను పార్శ్వములకును ఎక్కియున్నానుఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసి యున్నానువాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికినికర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి యున్నాను.
24 నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపో జేసియున్నాను.
25 నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది.
26 కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
27 నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
28 నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
29 మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీ కిదే సూచనయగును. సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.
30 యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.
31 శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు;తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యముల కధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.
32 కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.
33 పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.
34 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను పట్టణమును కాపాడి రక్షించుదును.
35 రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.
36 అష్షూరురాజైన సన్హెరీబు తిరిగి పోయి నీనెవె పట్టణమునకు
37 వచ్చి నివసించిన తరువాతఒఅతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరా రాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×