Bible Versions
Bible Books

Proverbs 10 (TEV) Telegu Old BSI Version

1 జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.
2 భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును.
3 యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగముచేయును.
4 బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
5 వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమా రుడు.
6 నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.
7 నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును
8 జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును.
9 యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవ ర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును.
10 కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదరుబోతు నశించును.
11 నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.
12 పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.
13 వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.
14 జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును.
15 ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము.
16 నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును.
17 ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.
18 అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.
19 విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
20 నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.
21 నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.
22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత యాశీర్వాదము ఎక్కువ కాదు.
23 చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.
24 భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.
25 సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.
26 సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.
27 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.
28 నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.
29 యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయదుర్గము పాపముచేయువారికి అది నాశనకరము.
30 నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు.
31 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.
32 నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×