Bible Versions
Bible Books

Proverbs 11 (TEV) Telegu Old BSI Version

1 దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
2 అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.
3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.
4 ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.
5 యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.
6 యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.
7 భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.
8 నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును
9 భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.
10 నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
11 యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.
12 తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.
13 కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.
14 నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.
15 ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.
16 నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.
17 దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును
18 భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.
19 యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును
20 మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.
21 నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.
22 వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.
23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.
24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.
25 ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును
26 ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.
27 మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.
28 ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు
29 తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతం త్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.
30 నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు
31 నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×