Bible Versions
Bible Books

Proverbs 30 (TEV) Telegu Old BSI Version

1 దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు.ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట.
2 నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు.
3 నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు.
4 ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?
5 దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
6 ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.
7 దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము;
8 వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.
9 ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో.
10 దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు.
11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.
12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు.
13 కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి!
14 దేశములో ఉండకుండ వారు దరిద్రులను మింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లును గల వారి తరము కలదు.
15 జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవుచాలును అని పలుకనివి నాలుగు కలవు.
16 అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని.
17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.
18 నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,
19 బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ.
20 జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను దోషము ఎరుగననును.
21 భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు.
22 అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,
23 కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి.
24 భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి.
25 చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.
26 చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.
27 మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.
28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.
29 డంబముగా నడుచునవి మూడు కలవు ఠీవితో నడుచునవి నాలుగు కలవు
30 అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము
31 శోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు.
32 నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము.
33 పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×