Bible Versions
Bible Books

1 Samuel 5 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎబెనెజరు నుంచి అష్డోదుకి తీసుకుని వెళ్లారు.
2 దేవుని పవిత్ర పెట్టెను వారు దాగోను దేవాలయంలోనికి తీసుకుని పోయి దాగోను విగ్రహం పక్కన వుంచారు.
3 అష్డోదు ప్రజలు మరునాడు తెల్లవారుఝామునే లేచి దాగోను విగ్రహం బోర్లపడి వుండటం చూశారు. యోహోవా దేవుని పవిత్ర పెట్టె ముందు దాగోను విగ్రహం పడిపోయి ఉంది. అష్డోదు ప్రజలు దాగోను విగ్రహాన్ని తిరిగి యధాస్థానంలో వుంచారు.
4 కాని మరునాటి ఉదయం అష్డోదు ప్రజలు వచ్చి చూడగా దాగోను విగ్రహం మళ్లీ పడిపోయివుంది. దాగోను దేవుని పవిత్ర పెట్టెముందు పడిపోయివున్నాడు. ఈసారి దాగోను తల, చేతులు విరిగిపోయ ఆలయ గుమ్మం మీద పడి ఉన్నాయి. దాగోను మొండెం మాత్రం ఒక్క ముక్కగా మిగిలింది.
5 అందువల్ల నాటికీ దాగోను యాజకులు గాని, ఇతరులుగాని అష్డోదులో దాగోను ఆలయం గడప తొక్కేందుకు నిరాకరిస్తారు.
6 అష్డోదు ప్రజలకు, వారి ఇరుగు పొరుగు గ్రామాల వారికి యెహోవా తీవ్రంగా శిక్ష విధించాడు. బహు కష్టాలపాలు చేశాడు. వారంతా శరీరం నిండా గడ్డలు కలిగి బాధపడ్డారు. వారి మీదికి ఎలుకల దండును పంపించాడు. వాళ్ల ఓడలలోను, పంట పొలాల్లోను ఎలుకలు విపరీతంగా తిరగటం ప్రారంభించాయి. నగర వాసులంతా భయభ్రాంతులయ్యారు.
7 ష్డోదు ప్రజలు అక్కడ జరుగుతున్నదంతా బాగా గమనించారు. “మనల్ని, మన దైవం దాగోనును బాగా శిక్షిస్తూవుంది గనుక, ఇశ్రాయేలు దేవుని పవత్ర పెట్టె ఇక ఏమాత్రం మనతో వుండరాదు.” అని అనుకున్నారు.
8 అష్డోదు ప్రజలు ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురినీ ఒక్కచోటికి పిలువనంపారు. “ఇశ్రాయేలీయుల దేవుని పవిత్ర పెట్టె విషయంలో తాము ఏమి చేయాలని వారిని అడిగారు.” అది విన్న పాలకులు, “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించమనగా” వారలా చేశారు.
9 అలా ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించిన పిమ్మట, యెహోవా నగరాన్ని కూడా శిక్షించాడు. ప్రజలు భయభ్రాంతులయ్యారు. గాతులో చిన్న, పెద్ద అందరినీ కలవరపెట్టాడు. వారికి కూడ శరీరం నిండా కంతులు, గడ్డలు లేచేలా చేశాడు.
10 కనుక ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎక్రోనుకు పంపించారు. కానీ దేవుని పవిత్ర పెట్టె ఎక్రోనుకు చేరగానే అక్కడి ప్రజలు, “ఇశ్రాయేలు ప్రజల దేవుని పవిత్ర పెట్టెను మా ఎక్రోను నగరానికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? మమ్ములనందరినీ మీరు చంపదలిచారా?” అంటూ అరవటం మొదలు పెట్టారు.
11 వారు ఫిలిష్తీయుల పాలకులనందరినీ ఒక్క చోటికి పిలిపించి “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టె మమ్మల్నీ, ప్రజలందరినీ చంపకముందే దానిని యధాస్థానానికి పంపించి వేయమన్నారు.” ఎక్రోనీయులు మిక్కిలి భీతి చెందియున్నారు. అక్కడ దేవుని దండన చాలా భయంకరంగా ఉంది.
12 చావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధపడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు నట్లుగా ఉండెను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×