Bible Versions
Bible Books

Job 24 (ERVTE) Easy to Read Version - Telugu

1 “సర్వశక్తిమంతుడైన దేవుడు న్యాయవిచారణ కోసం ఒక సమయాన్ని ఎందుకు నిర్ణయించడు? దేవునికి విధేయులయ్యే మనుష్యులు న్యాయవిచారణ నమయం కోసం అనవసరంగా ఎందుకు వేచి ఉండాలి?”
2 “మనుష్యలు తమ పొరుగు వారి భూమిని ఆక్ర మించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు. మనుష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయళ్లకు వాటిని తోలుకొని పోతారు.
3 అనాధల గాడిదను వారు దొంగాలిస్తారు. ఒక విధవవారి బాకీ తీర్చేంత వరకు ఆమె యొక్క ఆవును వారు తోలుకొని పొతారు.
4 ఇల్లు లేకుండా ఒక చోటు నుండి మరో చోటికి సంచారం చేసేటట్టు ప్రజలను వారు బలవంతం చేస్తారు. పేద ప్రజలంతా దుర్మార్గుల బారినుండి దాగుకొనేలా బలవంతం చేయబడుతారు.
5 “అరణ్యంలో ఆహారం కోసం వెదకులాడే అడవి గాడిదలా ఉన్నారు పేద ప్రజలు. పేద ప్రజలకూ వారి పిల్లలకూ ఎడారి ఆహారమును ఇస్తుంది.
6 పేద ప్రజలు ఇంకెంత వరకు వారి స్వంతం కాని పోలాలలో గడ్డి, గడ్డిపరకలు కూర్చుకోవాలి? దుర్మార్గుల ద్రాక్షాతోటల నుండి వారు పండ్లు ఏరుకొంటారు.
7 పేద ప్రజలు బట్టలు లేకుండానే రాత్రిపూట వెళ్లబుచ్చాలి. చలిలో వారు కప్పుకొనేందుకు వారికి ఏమీ లేదు.
8 కొండల్లోని వర్షానికి వారు తడిసిపోయారు. వాతా వరణం నుండి వారిని వారు కాపాడుకొనేందుకు వారికి ఏమీ లేదు కనుక వారు పెద్ద బండలకు దగ్గరలో ఉండాలి.
9 దుర్మార్గులు తండ్రిలేని బిడ్డను తల్లి దగ్గర నుండి లాగివేసుకొంటారు. పేద మనిషియొక్క బిడ్డను వారు తీసివేసుకొంటారు. పేద మనిషి బాకీపడి ఉన్న దానిని చెల్లించటం కోసం దుర్మార్గులు చిన్న బిడ్డను బానిసగా చేస్తారు.
10 పేద ప్రజలకు బట్టలు లేవు, కనుక వారు దిగంబరులుగా పని చేస్తారు. దుర్మార్గుల కోసం వారు పనలు మోస్తారు. కానీ పేద ప్రజలు ఇంకా ఆకలి తోనే ఉంటారు.
11 పేద ప్రజలు ఒలీవ నూనె పిండుతారు. వారు ద్రాక్షాగానుగను తిప్పుతారు. కానీ వారు ఇంకా దాహంతోనే ఉంటారు.
12 మరణిస్తున్న మనుష్యులు చేస్తున్న విచారకరమైన శబ్దాలు పట్టణంలో వినిపిస్తున్నాయి. బాధించబడిన మనుష్యులు సహాయం కోసం అరుస్తున్నారు. కానీ దేవుడు వినటం లేదు.
13 వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు ఉన్నారు .వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు. వారు దేవుని మార్గంలో నడవరు.
14 సరహంతకుడు ఉదయాన్నే లేచి పేద ప్రజలను, అక్కరలో ఉన్న ప్రజలను చంపుతాడు. రాత్రివేళ అతడు దొంగగా మారిపోతాడు.
15 వ్యభిచారం చేసే వాడు రాత్రి కోసం వేచి ఉంటాడు. ‘నన్ను ఎవ్వరూ చూడడం లేదు’ అని అతడు అనుకొంటాడు. కనుక అతడు తన ముఖం కప్పు కొంటాడు.
16 రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో చొరబడతారు. కానీ పగటివేళ వారు వారి స్వంత ఇళ్లలో దాగుకొంటారు. వెలుగును వారు తప్పించు కొంటారు.
17 దుర్మార్గులకు చీకటి ఉదయంలా ఉంటుంది. చీకటి దారుణాలకు వారు స్నేహితులు.
18 కాని వరద నీటిపైనున్న నురగవలె దుర్మార్గులు తీసుకొని పోబడతారు. వారి స్వంత భూమి శపించబడింది. కనుక ద్రాక్షా తోటలలో ద్రాక్షాపండ్లు కోసే పనికి వారు వెళ్లరు.
19 వేడిగా, పొడిగా ఉండే గాలి శీతాకాలపు మంచు నీళ్లను తొలగించి వేస్తుంది. అదే విధంగా దుర్మార్గులు కూడా తీసుకొని పోబడతారు.
20 దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి సహితం వానిని మరిచిపోతుంది. దుర్మార్గుని శరిరాన్ని పురుగులు తినివేస్తాయి. అతడు ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేనికోబడడు. దుర్మార్గులు పడి పోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు.
21 దుర్మార్గులు గొడ్రాలికి అక్రమాలు చేస్తారు. పిల్లలు లేని స్త్రీని వారు బాధిస్తారు. వారు విధవరాలికి దయ చూపెట్టరు.
22 కానీ బలంగల మనుష్యులను నాశనం చేసేందుకు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు. బలంగల మనుష్యులు శక్తిమంతులవుతారు. కాని వారి స్వంత జీవితాలను గూర్చిన నమ్మకం వారికి లేదు.
23 ఒకవేళ దేవుడు శక్తిగల మనుష్యులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో కాని దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు.
24 కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధిస్తారు. తరువాత వారు అంతమై పోతారు. మనుష్యులందరిలాగే వారూ ఒక చోట చేర్చబడతారు. తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్లా మరణిస్తారు.
25 విషయాలు సత్యం కాకపోతే, నేను అబద్ధం చెప్పానని ఎవరు రుజువు చేయగలరు?” నా మాటలు వట్టివి అని ఎవరు చెప్పగలరు?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×