Bible Versions
Bible Books

1 Samuel 11 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఒకనెల గడిచంది. తరువాత అమ్మోనీయుడైన నాహాషు తన సైన్యంతో వచ్చి యాబేష్గిలాదు నగరాన్ని ముట్టడించాడు. “నీవు మాతో ఒడంబడిక చేసుకొంటే మేము నీ సేవ చేస్తాము” అని యాబేషు ప్రజలు నాహాషుతో చెప్పారు.
2 “మీలోని ప్రతి ఒక్కని కుడి కంటినీ తోడివేయనిస్తే మీతో సంధికి ఒప్పుకుంటానన్నాడు నాహాషు.” అలా చేస్తే నేను ఇశ్రాయేలునంతటినీ అవమాన పర్చి నట్లువుతుందన్నాడు.
3 అది విన్న యాబేషు ప్రజల నాయకులు “ఏడు రోజులు గడువు ఇవ్వమని అడిగారు. ఇశ్రాయేలు నలుమూలలకు దూతలను పంపుతామనీ, ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రాకపోతే లొంగిపోతామనీ” వారు నాహాషుతో అన్నారు.
4 వార్తాహరులు సౌలు నివసిస్తున్న గిబియాకు వెళ్లారు. అక్కడి ప్రజలకు వార్త అందజేశారు. ప్రజలు ఘోరంగా విలపించారు.
5 సౌలు అప్పుడే తన పొలములోని తన పశువుల దగ్గరనుండి ఇంటికి వస్తూనే ప్రజల రోదన విన్నాడు. “ప్రజలకేమయ్యింది? వారెందుకు విలపిస్తున్నారు?” అని అడిగాడు. అప్పుడు ప్రజలు యాబేషునుండి వచ్చిన దూతలు చెప్పినదంతా వినిపించారు.
6 అది వినగానే సౌలు మీదకు దేవుని ఆత్మ శక్తివంతంగా వచ్చి ఆవరించింది. అతనికి పట్టరాని కోపం వచ్చింది.
7 సౌలు ఒక జత కాడి ఎద్దులను తీసుకుని వాటిని నరికి ముక్కలు చేసి, వాటని వచ్చిన దూతలకు ఇచ్చి వాటిని ఇశ్రాయేలునలు మూలలకూ తీసుకొని వెళ్లమన్నాడు. “వార్తహరులు ఎడ్ల మాంస ఖండాలను వాడ వాడలా తిప్పుతూ సౌలును, సమూయేలును వెంబడించని వారి ఎడ్లన్నిటికీ ఇదే గతి పడుతుందని చాటి చెప్పారు.” యెహోవా భయం ప్రజలందరికీ ముంచు కొచ్చింది. వారంతా ఒక్కటై బయటికి వచ్చారు.
8 సౌలు బెజెకు వద్ద వారిని సమావేశపరచినప్పుడు అక్కడ మూడులక్షల మంది ఇశ్రాయేలీయులు, ముప్పదివేలమంది యూదా వారు ఉన్నారు.
9 “గిలాదులో ఉన్న యాబేషుకు వెళ్లండి. ప్రజలు రేపు మధ్యాహ్నంలోగా రక్షించబడుతారని ప్రజలతో చెప్పండి” అని సౌలు, అతని సైనికులు యాబేషునుండి వచ్చిన మనుష్యులకు చెప్పారు. సౌలు సమాచారాన్ని యాబేషు ప్రజలకు దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా ఆనందపడ్డారు.
10 యాబేషు ప్రజలు, “రేపు లొంగిపోతామనీ, అప్పుడు వారిని తనకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చనీ” అమ్మోనీయుడైన నాహాషుకు తెలియజేశారు.
11 మరునాటి ఉదయం సౌలు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. సూర్యోదయానికి సౌలు సైన్యం అమ్మోనీయుల శిబిరాన్ని చేరింది. అమ్మోనీయుల గస్తీ తిరిగే జట్టు మారుతున్నప్పుడు సౌలు వారిమీద దాడి చేసాడు. సౌలు, అతని సైనికులు అమ్మోనీయులను ఓడించారు. చావగా మిగిలిన అమ్మో నీయులు చెల్లాచెదురై పోయారు. ఇద్దరూ కూడ కలిసి ఉండే అవకాశం వారికి లేకుండా పోయింది.
12 “సౌలు రాజుగా ఉండటానకి అంగీరకించని వాళ్లెవరు? వారిని ఇక్కడకి తీసుకొని రండి. వారిని చంపేస్తాము” అని ప్రజలు సమూయేలుతో అన్నారు.
13 “వద్దు. వేళ ఇశ్రాయేలీయులను రక్షించినవాడు యెహోవా. అందుచేత వేళ ఒక్కరూ చంపబడకూడదు” అని సౌలు చెప్పాడు.
14 “గిల్గాలుకు వెళదాం రండి. అక్కడ సౌలు రాజరికాన్ని తిరిగి కొనసాగేలా చేద్దాము” అన్నాడు సమూయేలు ప్రజలతో.
15 జనమంతా గిల్గాలుకు వెళ్లారు. అక్కడ యెహోవా ఎదుట వారు సౌలును మళ్లీ రాజుగా ఎన్నుకున్నారు. వారు యెహోవాకు సమాధాన బలులు కూడ అర్పించారు. సౌలు, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సంబరం జరుపుకొన్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×