Bible Versions
Bible Books

1 Samuel 29 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఆఫెకు వద్ద ఫిలిష్తీయులు తమ సైన్యాన్ని సమకూర్చారు. యెజ్రెయేలులో ఊట బావి వద్ద ఇశ్రాయేలు సైనికులు గుడారాలు వేసుకున్నారు.
2 ఫిలిష్తీయుల పాలకులు నూరుమంది దళాలతో, వేయిమంది దళాలతో ముందడుగు వేస్తున్నారు. దావీదు, అతని మనుష్యులు ఆకీషు వెనుక నడుస్తూఉన్నారు.
3 ఫిలిష్తీయుల దళాధిపతులు, “ఈ హెబ్రీవాళ్లు ఇక్కడ ఏమి చేస్తున్నారు” అని అడిగారు. అప్పుడు ఆకీషు ఫిలిష్తీయుల దళాధిపతులతో, “ఇతడు దావీదు. ఇతడు సౌలు అధికారుల్లో ఒకడు. దావీదు చాలా కాలంగా నాతో ఉంటున్నాడు. దావీదు సౌలును విడిచిపెట్టి వచ్చి నా దగ్గర ఉంటున్నప్పటి నుండి ఇతనిలో నాకు తప్పూ కనబడలేదు,” అని చెప్పాడు.
4 కానీ ఆకీషు మీద ఫిలిష్తీ దళాధిపతులకు చాలా కోపం వచ్చింది. “దావీదును వెనుకకు పంపించు! నీవు ఇతనికిచ్చిన ఊరికి ఇతను తిరిగి వెళ్లిపోవాలి. యుద్ధంలోకి ఇతడు మనతో రావటానికి వీల్లేదు. ఇతను ఇక్కడ ఉన్నాడంటే మన మధ్యలో శత్రువును పెట్టుకున్నట్టే అవుతుంది. ఇతను మన మనుష్యులను చంపితన రాజు సౌలును సంతోష పెడతాడు.
5 దావీదును గూర్చే ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ ‘సౌలు వేల కొలదిగా హతము చేసెననియు, దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు.’ అని పాట పాడారు” అని చెప్పారు దళాధిపతులు.
6 అందుచేత ఆకీషు దావీదును పిలిచాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా, నీవు నాకు నమ్మకంగా ఉన్నావు. నీవు నా సైన్యంలో పని చేయటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీవు వచ్చిన రోజునుండి నీలో తప్పూ నాకు కనబడలేదు. ఫిలిష్తీయుల పాలకులు కూడ నీవు మంచివాడివని తలస్తున్నారు.
7 శాంతితో వెనుకకు వెళ్లిపో. ఫిలిష్తీయుల పాలకులకు విరోధంగా ఏమీ చెయ్యకు,” అని ఆకీషు చెప్పాడు.
8 దావీదు, “నేను ఏమి తప్పుచేసాను? నేను నీ దగ్గరకు వచ్చిన రోజునుండి రోజు వరకు నీవు నాలో ఏమి తప్పు కనుగొన్నావు? నా యజమానివైన రాజు యొక్క శత్రువులతో నన్నెందుకు పోరాడనివ్వవు?” అని దావీదు అడిగాడు.
9 అందుకు ఆకీషు, “నీవు మంచివాడవని నాకు తెలుసు. నీవు దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతలా ఉన్నావు. కానీ ఫిలిష్తీయుల దళాధిపతి మాత్రం, ‘దావీదు మాతో కలిసి యుద్ధానికి రాకూడదు’ అంటూనే ఉన్నాడు.
10 తెల్లవారు ఝామునే లేచి నీవూ, నీ మనుష్యులూ వెనక్కు వెళ్లిపోవాలి. నేను మీకిచ్చిన నగరానికి తిరిగి వెళ్లండి. నిన్ను గురించి దళాధిపతి చెప్పిన చెడ్డ మాటలను లెక్క చెయకు. నీవు మంచివాడివి. కనుక సూర్యోదయం కాగానే వెళ్లిపోవాలి” అన్నాడు.
11 అంతుచేత దావీదు, అతని మనుష్యులు తెల్లవారుఝామునే లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లిపోయారు. ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు సాగిపోయారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×