Bible Versions
Bible Books

Job 5 (ERVTE) Easy to Read Version - Telugu

1 “యోబు, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు! నీవు దేవదూతల తట్టూ తిరుగలేవు!
2 తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే చంపివేస్తుంది. బుద్ధిహీనుని అసూయ వానినే చంపివేస్తుంది.
3 బాగా వేరూనుకొని, వృద్ధిపొందుతున్న ఒక బుద్ధి హీనుణ్ణి చూశాను. (అతను బలంగా, క్షేమంగా ఉన్నా ననుకొన్నాడు). అయితే అకస్మాత్తుగా వాని ఇల్లు శపించబడింది.
4 బుద్ధిహీనుని పిల్లలు క్షేమంగా లేరు. (న్యాయ స్థానంలో) వారిని ఆదుకొనేందుకు నగరద్వారం వద్ద ఎవ్వరూలేరు.
5 బుద్ధిహీనుని పంటలను ఆకలిగొన్న ప్రజలు తీసుకొంటారు. ఆకలిగొన్న మనుష్యలు ముండ్లలో పెరుగుతున్న ధాన్యపు గింజలను కూడా తీసుకొంటారు. ఆశగలవారు అతని ఐశ్వర్యాన్ని తీసుకొంటారు.
6 చెడ్డ కాలాలు మట్టిలోనుండి రావు. కష్టం నేలలో నుండి పెరగదు.
7 నిప్పులో నుండి రవ్వలు పైకి లేచినంత నిశ్చయంగా మనిషి కష్టం కోసమే పుట్టాడు.
8 “కాని యోబూ, నేనే గనుక నీవైతే నేను దేవుని తట్టు తిరిగి నా సమస్య ఆయనతో చెబుతాను.
9 దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు. దేవుడు చేసే అద్భుతాలకు అంతం లేదు.
10 దేవుడు భూమి మీద వర్షం కురిపిస్తాడు. ఆయన పొలాలకు నీళ్లు పంపిస్తాడు.
11 దీనుడైన మనిషిని దేవుడు లేవనెత్తుతాడు. దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఆయన చాలా సంతోష పరుస్తాడు.
12 తెలివిగల దుర్మార్గులకు విజయం కలుగకుండా దేవుడు వారి పథకాలను వివారిస్తాడు.
13 దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి పథకాల్లోనే పట్టేస్తాడు. అందుచేత తెలివిగల మనిషి యొక్క పథకాలు విజయవంతం కావు.
14 పగటివేళ సైతం తెలివిగల మనుష్యులు చీక టిలో వలె తడబడుతారు. మధ్యాహ్నపు వేళల్లో సైతం రాత్రిపూటలా తడువులాడుతారు.
15 దేవుడు పేద ప్రజలను మరణం నుండి రక్షిస్తాడు. బలవంతుల హస్తాలనుండి పేదలను ఆయనే రక్షిస్తాడు.
16 కనుక పేద ప్రజలకు నిరీక్షణ ఉంది. న్యాయంగా లేని దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు.
17 “దేవుడు సరిదిద్దే మనిషి సంతోషంగా ఉంటాడు. కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను శిక్షించి నప్పుడు, దానిని తోసిపుచ్చకు.
18 దేవుడు చేసిన గాయాలకు ఆయన కట్లు కడతాడు. ఆయనే గాయపరుస్తాడు, కాని ఆయన చేతులే తిరిగి స్వస్థపరుస్తాయి.
19 ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు; అవును, ఏడు కష్టాల్లో కూడా నీవు బాధించబడవు.
20 కరువు వచ్చినప్పుడు దేవుడు నిన్ను మరణంనుండి రక్షిస్తాడు. యుద్ధంలో దేవుడు నిన్ను మరణం నుండి కాపాడుతాడు.
21 మనుష్యులు వాడిగల తమ నాలుకలతో నిన్ను గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను రక్షాస్తాడు. నాశనం వచ్చినప్పుడు నీవు భయ పడాల్సిన పనిలేదు.
22 నాశనం, కరువును చూసి నీవు నవ్వుతావు. అడవి జంతువులను చూసి నీవు భయపడాల్సిన అవసరం లేదు.
23 నీ ఒడంబడిక దేవునితో ఉంది కనుక నీవు దున్నే పొలాల్లో బండలు ఉండవు. మరియు అడవి మృగాలు ఎన్నటికీ నీ మీద పడవు.
24 నీ గుడారం క్షేమంగా ఉంది గనుక నీవు శాంతంగా జీవిస్తావు. నీవు నీ ఆస్తి లెక్కించగా ఏదీ పోయి ఉండదు.
25 నీకు చాలామంది పిల్లలు ఉంటారు. నేలమీద గడ్డి పరకల్లా నీ పిల్లలు చాలామంది ఉంటారు.
26 కోతకాలం వరకు సరిగ్గా పెరిగే గోధుమలా నీవు ఉంటావు. అవును, నీవు పక్వమయిన వృద్ధాప్యం వరకు జీవిస్తావు.
27 “యోబూ, విషయాలు మేము పరిశీలించాం. అవి సత్యమైనవని మాకు తెలుసు. అందుచేత యోబూ, మేము చెప్పు సంగతులను విని, నీ మట్టుకు నీవే వాటిని తెలుసుకో.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×