Bible Versions
Bible Books

Jeremiah 6 (ERVTE) Easy to Read Version - Telugu

1 బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి! యెరూషలేము నగరం నుండి పారిపోండి! తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి. బేత్‌హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి! ఉత్తర దిశ నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి. మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!
2 సీయోను కుమారీ, నీవెంతో అందమైన దానివి, సుకుమారివి .
3 కాపరులు తమ గొర్రెల మందలను తోలుకొని యెరూషలేముకు వస్తారు. వారు నగరం చుట్టూతమ గుడారాలు నిర్మించుకుంటారు. ప్రతి గొర్రెల కాపరీ తన మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకుంటాడు.
4 వారిలా అంటారు: “యెరూషలేము నగరాన్ని ముట్టడించటానికి తగిన సన్నాహాలు చేయండి. లేవండి! మధ్యాహ్నం నగరంపై దండెత్తుదాం! ఇప్పటికే ఆలస్యమైంది. సాయంకాలపు నీడలు సాగుతున్నాయి.
5 కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!”
6 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యెరూషలేము చుట్టూ ఉన్న వృక్షాలను పడగొట్టండి. కర్రలతో, మట్టితో నగర గోడకు దిబ్బలు నిర్మించి గోడ ఎక్కటానికి వీలు కల్పించండి. నగరం శిక్షించబడాలి. నగరంలో అక్రమం తప్ప మరేమీ లేదు.
7 బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది. అలాగే, యోరూషలేము తన దుర్మార్గాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. నగరంలో దౌర్జన్యం, విధ్వంసం గూర్చి ఎప్పుడూ వింటున్నాను. యెరూషలేములో అస్వస్థత, గాయాలు నిత్యం నేను చూస్తూనే ఉన్నాను.
8 యెరూషలేమూ, హెచ్చరికను ఆలకించు. మీరు వినకపోతే, మీనుండి నేను వెనుదిరిగి పోతాను. మీ దేశాన్ని ఒక పనికిరాని ఎడారిగా మార్చివేస్తాను. అక్కడ ఎవ్వరూ నివసించలేరు!”
9 సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు: “ఈ రాజ్యంలో మిగిలిన వారినందరినీ ప్రోగుచేయుము . నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే ద్రాక్షా కాయల్లా కూడదీయుము. ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా నీవు ప్రతి తీగను వెదకుము.”
10 నేనెవరితో మాట్లాడగలను?ఎవరిని హెచ్చరించగలను? నా మాట ఎవరు వింటారు? ఇశ్రాయేలు ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా తమ చెవులు మూసుకున్నారు. యెహోవా ఉపదేశములు వారికిష్టము లేదు. కావున నా హెచ్చరికలు వారు వినలేరు. యెహోవా యొక్క బోధనలను ప్రజలు సహించరు. యెహోవా మాటలను వినుటకు వారు ఇష్టపడరు.
11 కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉండి! దానిని నేను లోపల ఇముడ్చుకో లేక పోతున్నాను! అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను, గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు. భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.
12 వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి. వారి పొలాలు, వారి భార్యలు ఇతరులకివ్వబడతారు. నా చెయ్యెత్తి యూదా రాజ్య ప్రజలను శిక్షిస్తాను.” వాక్కు యెహోవా నుండివచ్చినది.
13 “ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు. కింది వర్గాలనుండి పై తరగతి వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి ఉంటారు! ప్రవక్తలు, యాజకులు అంతా కపటజీవనం సాగిస్తారు.
14 ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను మాన్పజూస్తారు. అవేవో స్వల్ఫ గాయాలుగా. భావిస్తారు. ‘ఏమీ పరవాలేదు, ఏమీ పరవాలేదు’ అని అంటారు. కాని, నిజానికి ప్రమాదం చాలా ఉంది.
15 ప్రవక్తలు. యాజకులు వారు చేయు చెడుకార్యాలకు సిగ్గుపడాలి! కాని వారికి సిగ్గనేది లేదు. వారి పాపానికి తగిన కలవరపాటు వారెరుగరు. అందువల్ల ఇతరులందరితో పాటు వారుకూడా శిక్షించబడతారు. నేను వారిని శిక్షించేటప్పుడు వారు నేల కరచేలా కిందికి తోయబడతారు.” ఇది యెహోవా వాక్కు.
16 యెహోవా విషయాలు చెప్పినాడు: “నాలుగు మార్గాల కూడలి స్థలంలో నిలబడిచూడుము. పాతబాట ఏదో అడిగి తోలిసికో. ఏది మంచి మార్గమో అడిగి తెలుసుకో. అప్పుడు మార్గంపై పయనించుము. అప్పుడు మీరు మీకొరకు విశ్రాంతిని కనుగొంటారు. కాని మీరేమన్నారో తెలుసా? ‘మేము మంచి మార్గంపై పయనించ’మన్నారు.
17 నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారులను ఎన్నుకొన్నాను. నేను వారితో చెప్పాను. ‘యుద్ధ బూర ధ్వని వినండి’ అని. కాని వారన్నారు: ‘మేము వినము.’
18 కావున, సర్వదేశవాసులారా వినండి! ఆయా దేశాల ప్రజలారా, ధ్యానముంచండి . నేను యూదా ప్రజలకు చేయబోయే విషయాలను వినండి!
19 భూలోకవాసులారా, ఇది వినండి: యూదా ప్రజలకు నేను ఘోర విపత్తు తెస్తున్నాను. ఎందుకంటే? ప్రజలు పన్నిన చెడు పనులన్నిటి కారణంగానే. వారు నా వర్తమానాలను లెక్కచేయనందుకు ఫలితంగా ఇది జరుగుతుంది. నా న్యాయ మార్గాన్ని అనుసరించటానికి వారు నిరాకరించారు.”
20 యెహోవా ఇలా అన్నాడు: “మీరు షేబ దేశంనుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు తెస్తున్నారు? దూరదేశాలనుండి సువాసనగల చెరుకును నాకు నైవేద్యంగా ఎందుకు తెస్తున్నారు? మీ దహనబలులు నన్ను సంతోషపర్చవు! మీ బలులు నన్ను సంతృప్తి పర్చజాలవు”
21 అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు:”యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను. ప్రజల ఎదుట అడ్డబండలు నేను వేస్తాను. రాళ్లవలె అవి వుంటాయి. తండ్రులు, కొడుకులు వాటిపై తూలిపోతారు. స్నేహితులు, పొరుగువారు చనిపోతారు.”
22 యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది. భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.
23 సైనికులు విల్లంబలు, టెలు పట్టుకొనివస్తారు. వారు బహు క్రూరులు. వారికి దయా, దాక్షిణ్యం ఉండవు. వారు మిక్కిలి శక్తిమంతులు! వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది. సైన్యం సర్వ సన్నద్ధమై యుద్ధానికి వస్తుంది. సీయోను కుమారీ, సైన్యం నిన్నెదిరించటానికి వస్తూ ఉంది.”
24 సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము. భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము. కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము. స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.
25 మీరు పొలాల్లోకి వెళ్లవద్దు! మీరు బాట వెంబడి వెళ్లవద్దు. ఎందువల్లనంటే శత్రువువద్ద కత్తులున్నాయి. పైగా ఎటు చూచినా ప్రమాదమేవుంది.
26 నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి. బూడిదలో పొర్లండి . చనిపోయినవారి కొరకు బాగా దుఃఖించండి! మీకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినట్లు విచారించండి. ఇవన్నీ మీరు చేయండి; కారణమేమంటే శత్రువు శరవేగంతో మనపైకి వస్తాడు!
27 “యిర్మీయా, నేను (యెహోవా) నిన్నొక లోహపరీక్షకునిగా నియమించినాను. నీవు నా ప్రజల నడవడిని పరీక్షించు, వారిని గమనిస్తూ ఉండుము.
28 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు; వారు చాలా మొండివారు. వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు. వారు తుప్పుతో కప్పబడియున్న కంచు, ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.
29 నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు. కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది. కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది! శుద్ద వెండిని చేయాలను కోవటం వృధా ప్రయాస. వృధా కాలయాపన. అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.
30 ‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు. యెహోవా వారిని ఆమోదించలేదు గనుక వారికాపేరు పెట్టబడింది.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×