Bible Versions
Bible Books

2 Chronicles 3 (ERVTE) Easy to Read Version - Telugu

1 యెరూషలేములో మోరీయా పర్వతం మీద సొలొమోను ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. మోరీయా పర్వతం మీదే సొలొమోను తండ్రియైన దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దావీదు సిద్ధపర్చిన స్థలంలోనే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. స్థలం ఒర్నానుకు చెందిన నూర్పిడి కళ్లంవద్ద వుంది. ఒర్నాను యెబూసీయుడు.
2 తన పాలన ఇశ్రాయేలులో నాల్గవ సంవత్సరం రెండవ నెల జరుగుతూ వుండగా సొలొమోను ఆలయ నిర్మాణం చేపట్టాడు.
3 ఆలయ నిర్మాణ విషయంలో సొలొమోనుకు కొలతలు యివ్వబడ్డాయి: దాని పునాది తొంబై అడుగుల (అరవై మూరలు) పొడవు: ముప్పై అడుగుల (ఇరవై మూరలు) వెడల్పు. ఆలయ కొలతలు తీసుకొన్నుప్పుడు. సొలొమోను పాత మూర కొలతనే అనుసరించాడు.
4 ఆలయ మండపం పొడవు ముప్పై అడుగులు; ఎత్తు ముప్పై అడుగులు. అతడు మండపము యొక్క లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు.
5 పెద్దగది గోడల మీద తమాల వృక్షముల (ఖర్జూరపు చెట్లు) చెక్కలు అమర్చాడు. తమాల వృక్షపు చెక్కలమీద మేలిమి బంగారపు రేకులు తాపించాడు. బంగారపు రేకుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు చెక్కించి గొలుసుల నగిషీ పని చేయించాడు.
6 ఆలయంలో అందం ఇనుమడించే విధంగా విలువైన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి తెచ్చిన బంగారాన్ని పనికి వినియోగించాడు. (అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు).
7 ఆలయపు లోపలి భాగాన్నంతా బంగారు రేకులతో కప్పించాడు. పై కప్పు దూలాలకు దర్వాజాలకు, గోడలకు, తలుపులకు సొలొమోను బంగారు పూత వేయించాడు. గోడల మీద దేవదూతల (కెరూబులు) చిత్రాలు చెక్కించాడు.
8 తరువాత సొలొమోను అతి పవిత్ర స్థలం ఏర్పాటు చేశాడు. అవి పవిత్ర స్థలం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు ముప్పై అడుగులు. ఆలయం వెడల్పంత వెడల్పు దీనికి కూడ వుంది. అతి పవిత్ర స్థలం గోడల నిండా మేలిమి బంగారు రేకులు వేయించాడు. బంగారపు బరువు ఇరవై మూడు టన్నులు (ఆరువందల తలాంతులు).
9 బంగారపు మేకుల తూకము ఏబై తులాలు. (ఇంచుమించు ఒకటింపావు పౌనులు). పై గదులకు బంగారు పూత వేయించాడు.
10 రెండు కెరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించటానికి చేయించాడు. పనివారు కెరూబుల బొమ్మలకు బంగారు తొడుగు వేశారు.
11 కెరూబుల ప్రతిదాని రెక్క పొడవు ఏడున్నర అడుగులు ఉంది. రెండు కెరూబుల నాలుగు రెక్కల పొడవు ముప్పై అడుగులు. మొదటి కెరూబు ఒక రెక్క ఒక పక్క గోడకు ఆనుకొని వుంటుంది. రెండవ రెక్క రెండవ కెరూబు రెక్కకు తగులుతూ వుంటుంది.
12 రెండవ కెరూబు ఒక రెక్క గది గోడకు రెండవ వైపున ఆనుతుంది.
13 రెండు కెరూబుల రెక్కలు మొత్తం ముప్పై అడగులు దూరం వ్యాపించి వుంటాయి. దేవదూతల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలోకి చూస్తున్నట్లు నిలబడి వుంటాయి.
14 నీలం, ఊదా, ఎరుపు పదార్థలతోను, ఖరీదైన పట్టుతోను సొలొమోను తెరలు చేయించాడు. తెరల మీద కూడ కెరూబుల చిత్రాలు చిత్రించాడు.
15 ఆలయం ముందు రెండు స్తంభాలను ఏర్పాటు చేయించాడు. ఒక్కొక్క స్తంభం ఏబై రెండున్నర అడుగుల (ముప్పైయైదు మూరలు) ఎత్తు వుంటుంది. ఒక్కొక్క స్తంభం యొక్క శిఖరంమీది పీట యెత్తు ఏడున్నర అడుగులు.
16 కంఠాహారం లాంటి గొలుసులను సొలొమోను చేయించాడు. గొలుసులను స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలించాడు.
17 ఇలా అలంకరించిన స్తంభాలను సొలొమోను ఆలయం ముందు నిలిపాడు. ఒక స్తంభం కుడి పక్క, రెండవ స్తంభం ఎడమ పక్కన నిలిపారు. సొలొమోను కుడి పక్క స్తంభానికి “యాకీను” అని పేరు పెట్టాడు. ఎడమ ప్రక్క స్తంభానికి “బోయజు” అని పేరు పెట్టాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×