Bible Versions
Bible Books

2 Chronicles 14 (ERVTE) Easy to Read Version - Telugu

1 అబీయా తన పూర్వీకులతో నిద్రంచాడు. దావీదు నగరంలో ప్రజలు అతనిని సమాధి చేశారు. పిమ్మట అబీయా కుమారుడు ఆసా అతని స్థానంలో కొత్తగా రాజయ్యాడు. ఆసా పరిపాలనా కాలంలో పది సంవత్సరాలపాటు దేశంలో శాంతి నెలకొన్నది.
2 తన దేవుడైన యెహోవా దృష్టకి మంచివైన, న్యాయమైన పనులు ఆసా చేశాడు.
3 విగ్రహాలను ఆరాధించటానికి వినియోగించిన వింత బలిపీఠాలను ఆసా తొలగించాడు. ఆసా ఉన్నత స్థలాలను తీసివేసి, స్మారక శిలలను పగులగొట్టాడు. అషేరా దేవతా స్తంభాలను కూడా ఆసా విరుగగొట్టాడు.
4 యూదా ప్రజలను దేవుడైన యెహోవాను అనుసరించమని ఆసా ఆదేశించాడు. ఆయన వారి పూర్వీకులు ఆరాధించిన దైవం. అందుచే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించమని ఆసా వారికి ఆదేశించాడు.
5 యూదా పట్టణాలన్నిటి నుండి ఆసా ఉన్నత స్థలాలను, ధూప పీఠాలను తీసివేశాడు. ఆసా రాజుగా వున్న కాలంలో రాజ్యంలో శాంతి నెలకొన్నది.
6 యూదాలో శాంతి విలసిల్లిన కాలంలోనే ఆసా బలమైన నగరాలు నిర్మించాడు. యెహోవా శాంతియుత వాతావరణం కల్పించటంతో ఆసాకు కాలంలో యుద్ధాలు లేవు.
7 ఆసా యూదా ప్రజలతో యీలా చెప్పాడు: “మనమీ పట్టణాలను నిర్మించి, వాటిచుట్టూ ప్రాకారాలు కట్టిద్దాము. మనం బురుజులను, ద్వారాలను, ద్వారాలకు కడ్డీలను ఏర్పాటు చేద్దాము. దేశంలో ఇంకను నివసిస్తూండగానే మనమీ పనులు చేద్దాము. దేశం మనది. ఎందువల్లననగా మన ప్రభువైన దేవుని మనం అనుసరించాము. మనచుట్టూ ఆయన మనకు శాంతియుత వాతావరణం కల్పించాడు.” పిమ్మట వారు నగర నిర్మాణాలు చేపట్టి విజయం సాధించారు.
8 ఆసాకు మూడు లక్షలమంది యూదా వంశాల వారున్న సైన్యం; రెండు లక్షల ఎనబై వేలమంది బెన్యామీను కుటుంబాలకు చెందిన వారు సైన్యం వున్నాయి. యూదా సైనికులు పెద్ద పెద్ద డాళ్లను, ఈటెలను ధరించారు. బెన్యామీను సైనికులు చిన్న డాళ్లను ధరించి, ధనుస్సులతో బాణాలు వేయగల నేర్పరులు. వారంతా బలమైన, ధైర్యంగల సైనికులు.
9 పిమ్మట జెరహు అనేవాడు ఆసా మీదికి దండెత్తాడు. జెరహు ఇథియోపియావాడు . జెరహు సైన్యంలో పదిలక్షలమంది సైనికులు, మూడు వందల రథాలు వున్నాయి. జెరహు సైన్యం మారేషా వరకు చొచ్చుకు వచ్చింది.
10 జెరహును ఎదుర్కోవటానికి ఆసా బయలుదేరి వెళ్లాడు. మారేషా వద్ద జెపాతా లోయలో ఆసా సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యింది.
11 ఆసా తన దేవుడైన యెహోవాకు యిలా ప్రార్థన చేశాడు ప్రభూ, బలవంతుల నుండి బలహీనులను రక్షించేవాడవు నీ వొక్కడివే! ప్రభూ, మా దైవమా మాకు సహాయం చేయుము! మేము నీమీద ఆధారపడి యున్నాము. మహా సైన్యాన్ని నీ పేరుతో మేము ఎదిరించబోతున్నాము. యెహోవా, నీవు మా దేవుడవు. నీమీద విజయాన్ని ఎవ్వరికీ చేకూర నీయకుము!”
12 పిమ్మట యెహోవా ఆసా వద్దవున్న యూదా సైన్యాన్ని ఇథియోపియా (కూషు) సైన్యాన్ని ఓడించటానికి వినియోగించాడు. ఇథియోపియా సైన్యం పారిపోయింది.
13 ఆసా సైన్యం ఇథియోపియా సైన్యాన్ని గెరారు పట్టణం వరకు తరుముకుంటూ పోయింది. ఇథియోపియా సైనికులు అనేకమంది చనిపోవటంతో యుద్ధం చేయటానికి మళ్లీ వారు ఒక సైన్యంగా కూడ గట్టుకోలేకపోయారు. యెహోవా చేత, ఆయన సైన్యం చేత వారు అణచివేయబడ్డారు. శత్రుసైన్యం నుండి ఆసా, మరియు అతని సైనికులు అనేక విలువైన వస్తువులను దోచుకన్నారు.
14 సా మరియు అతని సైన్యం గెరారు దగ్గరలో వున్న అన్ని పట్టణాలను ఓడించారు. పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు యెహోవాకు భయపడిపోయారు. పట్టణాలలో విలువైన వస్తు సామగ్రి విస్తారంగా వుంది. విలువైన వస్తువులన్నిటినీ ఆసా సైన్యం దోచుకుంది.
15 ఆసా సైన్యం గొర్రెల కాపరులు నివసించే ప్రాంతాల మీద కూడా దాడి చేసింది. వారు చాలా గొర్రెలను, ఒంటెలను పట్టుకుపోయారు. తరువాత ఆసా సైన్యం యెరూషలేముకు వెళ్లిపోయింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×