Bible Versions
Bible Books

2 Chronicles 19 (ERVTE) Easy to Read Version - Telugu

1 యూదా రాజైన యెహోషాపాతు యెరూషలేములోని తన యింటికి క్షేమంగా తిరిగి వచ్చాడు.
2 దీర్ఘదర్శియగు యెహూ ఎదురేగి యెహోషాపాతును కలిశాడు. యెహూ తండ్రి పేరు హనానీ. యెహోషాపాతుతో యెహో విధంగా చెప్పాడు: “నీవు దుష్టులకు ఎందుకు సహాయపడ్డావు? యెహోవాను అసహ్యించుకునే వారిని నీ వెందుకు ప్రేమిస్తున్నావు? అందువల్లనే యెహోవా నీపట్ల కోపంగా వున్నాడు.
3 కాని నీ జీవితంలో నీవు కొన్ని మంచి పనులు చేశావు. నీవు అషేరా దేవతా స్తంభాలను దేశం నుండి తొలగించావు. దేవుని అనుసరించాలని నీ హృదయంలో నిశ్చయించుకున్నావు.”
4 యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. మళ్లీ అతడు ప్రజలను కలియటానికి బెయేర్షెబా పట్టణం నుండి కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము వరకు సంచారం చేశాడు. యెహోషాపాతు ప్రజలమధ్య తిరిగి మళ్లీ వారిని తమ పూర్వీకులు ఆరాధించిన యెహోవా వైపుకు తిప్పాడు.
5 యెహోషాపాతు యూదాలో న్యాయాధిపతులను నియమించాడు. యూదాలో కోటలుగల పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను నియమించాడు.
6 యెహోషాపాతు న్యాయాధిపతులతో యిలా చెప్పాడు: “మీరు చేసే పనిలో మీరు మిక్కిలి మెళకువతో మెలగండి. ఎందువల్లనంటే మీరు తీర్పు తీర్చేది ప్రజల తరుపున కాదు. యెహోవా తరుపున మీరొక నిర్ణయం తీసుకొనేటప్పుడు యెహోవా మీతో వుంటాడు.
7 కావున మీలో ప్రతి ఒక్కడూ యెహోవాకు భయ పడాలి. మీ పనిలో మీరు జాగ్రత్త వహించండి. ఎందు వల్లనంటే మన దేవుడైన యెహోవా పక్షపాతం లేనివాడు. న్యాయశీలి. యెహోవా ఎన్నడూ కొందరిని మరికొందరికంటె ముఖ్యులుగా చూడక సమంగా చూస్తాడు. తన తీర్పును మార్చటానికి యెహోవా ధనం ఆశించడు.”
8 యెరూషలేములో కొంతమంది లేవీయులను, యాజకులను, మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను న్యాయాధిపతులుగా యెహోషాపాతు ఎంపిక చేశాడు. యెరూషలేములో వున్న ప్రజల సమస్యలను పరిష్కరించటానికి వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తారు.
9 యెహోషాపాతు యిలా కొన్ని ఆజ్ఞలను యిచ్చాడు. యెహోషాపాతు యిలా చెప్పాడు: “మీ నిండు హృదయంతో మీరు విశ్వాసపాత్రంగా సేవ చేయాలి. మీరు యెహోవాకు భయపడాలి.
10 హత్యావిషయాలు, చట్టపరమైన, ఆజ్ఞాపరమైన నియమ నిబంధనలకు సంబంధించిన నేరాలు అనేకం మీ దృష్టికి తేబడతాయి. నగరాలలో నివసించే మీ సోదరుల వద్ద నుండి విషయాలు మీ తీర్పుకు వస్తాయి. మీ వద్దకు వచ్చిన నేరస్తులను, వాదాలాడే వారిని అందరినీ యెహోవాపట్ల పాపం చేయవద్దని మీరు హెచ్చరించాలి. మీరు నమ్మకంగా పనిచేయని ఎడల మీ మీదికి, మీ సోదరుల మీదికి యెహోవా కోపాన్ని రప్పించిన వారవుతారు. నేను చెప్పినట్లు చేయండి. అప్పుడు తప్పు చేశామనే భావన మీకు వుండదు.
11 అమర్యా ప్రముఖ యాజకుడు. యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలలో అతడు మీమీద ఆధిపత్యం వహిస్తాడు. రాజుకు సంబంధించిన విషయాలలో మీకు మార్గదర్శకుడుగా జెబద్యావున్నాడు. జెబద్యా తండ్రి పేరు ఇష్మాయేలు. యూదా వంశంలో జెబద్యా ఒక పెద్ద. ఇంకను లేవీయులు మీకు లేఖకులుగా పని చేస్తారు. మీరు ప్రతి పనీ ధైర్యంగా చేయండి. న్యాయమార్గాన నడిచే ప్రజలకు యెహోవా అండగా వుండుగాక!”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×