Bible Versions
Bible Books

2 Samuel 10 (ERVTE) Easy to Read Version - Telugu

1 తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు. అతని తరువాత అతని కుమారుడు హానూను రాజయ్యాడు.
2 మరణవార్త విన్న దావీదు “నాహాషు నాపట్ల చాలా దయగలిగియుండెను. కాబట్టి అతని కుమారుడు హానూను పట్లకూడ నేను దయగలిగి ఉంటాను,” అని అన్నాడు. ప్రకారం దావీదు తన అధికారులను తండ్రి మరణంతో విచారంలో ఉన్న హానూనును పలకరించి ఓదార్చే నిమిత్తం పంపాడు. దావీదు అధికారులు అమ్మోనీయుల దేశానికి వెళ్లారు.
3 కాని అమ్మోనీయుల నాయకులు వారి రాజైన హానూనును కలిసి, “నీ తండ్రి మరణ సందర్భంగా నిన్ను ఓదార్చటానికి తన మనుష్యులను పంపి నీ తండ్రిని గౌరవించటానికి ప్రయత్నిస్తున్నాడని నీవు అనుకుంటున్నావా? కాదు! దావీదు తన మనుష్యులను నీ నగరాన్ని పరిశీలించి రహస్యాలను తెలసికొనే నిమిత్తం గూఢచారులుగా పంపాడు. వారు నీ మీదకు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు!” అని చెప్పారు.
4 కాబట్టి హానూను దావీదు పంపిన అధికారులను పట్టుకొని, వారి గడ్డాలలో సగభాగం గొరిగించాడు. వారి దుస్తులను కూడ సగంనుంచి తొడలవరకు కత్తిరించి వేశాడు. తరువాత వారిని పంపివేశాడు.
5 అధికారులు చాలా అవమానం పొందారని విన్న దావీదు కొందరు దూతలను తన అధికారులను కలవటానికి పంపాడు. దూతల ద్వారా, “మీ గడ్డాలు బాగా పెరిగేవరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత యెరూషలేమునకు తిరిగిరండి,” అని కబురు పంపాడు దావీదు రాజు.
6 అమ్మోనీయులు దావీదు రాజుతో శతృత్వం తెచ్చి పెట్టుకున్నామని తెలుసుకున్నారు. దానితో వారు సైన్యాన్ని సమకూర్చుకొనే ప్రయత్నంలో బేత్రెహోబు, సోబాలలోవున్న సిరియనులను జీతానికి పిలిపించుకొన్నారు. సిరియను కాల్బలము ఇరువది వేల వరకు వుంది. ఒక వెయ్యిమంది సైనికులతో సహా మయకా రాజును, టోబునుండి పన్నెండు వేలమందిని జీతానికి పిలిపించుకొన్నారు.
7 విషయం దావీదు విన్నాడు. అతడు యోవాబును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు.
8 అమ్మోనీయులు బయటికి వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు నగర ద్వారం దగ్గర మోహరించారు. సోబానుండి రెహోబు నుండి వచ్చిన సిరియనులు, టోబనుండి, మయకానుండి వచ్చిన మనుష్యులందరూ అమ్మోనీయులతో కలిసి రంగంలో నిలబడలేదు.
9 అమ్మోనీయులు తనకు ముందు, వెనుక కూడ నిలబడి వున్నారని యోవాబు గమనించాడు. అందువల్ల తనతో వచ్చిన ఇశ్రాయేలీయులలో కొందరు నేర్పరులైన వారిని ఎన్నుకుని వారిని సిరియనులతో యుద్ధానికి సిద్ధం చేశాడు.
10 మిగిలిన సైన్యాన్ని అమ్మోనీయుల మీదికి పోవటానికి యోవాబు తన సోదరుడైన అబీషైకి ఇచ్చాడు.
11 యోవాబు అబీషైకి ఇలా చెప్పాడు: “సిరియనులు గనుక బలం పుంజుకొని నన్ను ఓడించేలా వుంటే నీవు వచ్చి నాకు సహాయం చేయము. అమ్మోనీయులు గనుక నీకంటె ఆధిక్యతలో వుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను.
12 ధైర్యంగా ఉండు. మన ప్రజలకోసం, మన దేవుని నగరాలకోసం మనమంతా వీరోచితంగా పోరాడదాం! యెహోవా దృష్టికి ఏది మంచిదనిపించుతుందో అది ఆయన చేస్తాడు.”
13 తరువాత యోవాబు, అతని మనుష్యులు సిరియనులను ఎదుర్కొన్నారు. యోవాబు యొక్క, అతని సైన్యం యొక్క ధాటికి తట్టుకోలేక సిరియనులు పారి పోయారు.
14 సిరియనులు పారిపోతున్నట్లు అమ్మోనీయులు చూశారు. దానితో వారుకూడ అబీషైకి భయపడి పారిపోయారు. వారు వారి నగరానికి పోయారు. యోవాబు అమ్మోనీయులతో యుద్ధానంతరం తిరిగి వచ్చి యెరూషలేముకు వెళ్లాడు.
15 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని సిరియనులు గుర్తించారు. వారంతా మళ్లీ సమకూడి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చారు.
16 హదదెజరు తనదూతలను యూఫ్రటీసు నది అవతల నివసిస్తూ ఉన్న సిరియనులనందరినీ తీసుకొని రావలసినదిగా పంపాడు. సిరియనులంతా హేలాముకు వచ్చారు. వారి నాయకుడు షోబకు. ఇతడు హదదెజరు సైన్యాధిపతి.
17 దావీదు ఇదంతా విని ఇశ్రాయేలీయులనందరనీ కూడ దీశాడు. వారు యోర్దాను నదిని దాటి హేలాముకు వెళ్లారు. అక్కడ సిరియనులు యుద్ధానికి సిద్ధమై వారిని ఎదిరించారు.
18 కాని దావీదు సిరియనులను ఓడించాడు. సిరియనులు ఇశ్రాయేలీయులకు భయపడి పారిపోయారు. దావీదు సిరియను సైన్యంలో ఏడు వందల మంది రథసారధులను, నలుబది వేల మంది గుర్రపు దళం వారిని చంపివేశాడు. అంతేగాదు సిరియను సైన్యాధిపతియైన షోబకును కూడ దావీదు చంపివేశాడు.
19 హదదెజరు సామంత రాజులంతా వారి సైన్యాలను ఇశ్రాయేలీయులు ఓడించినట్లు చూశారు. కావున వారు ఇశ్రాయేలీయులతో సంధి చేసికొని వారిని సేవిస్తూవచ్చారు. మళ్లీ అమ్మోనీయులకు సహాయం చేయటానికి సిరియనులు భయపడి పోయారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×