Bible Versions
Bible Books

Ecclesiastes 1 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు అయిన ప్రసంగి చెప్పిన ప్రవచనాలు.
2 అన్నీ పరమ అర్థరహితాలు. ‘సమస్తం వృధా కాలయాపన!’ అంటాడు ప్రసంగి.
3 జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా ? (లేదు!)
4 ఒక తరం మారి మరొకతరం వస్తుంది.కాని, భూమి శాశ్వతంగా ఉంటుంది.
5 సూర్యుడు ఉదయించును మరియు అస్తమించును. మరల ఉదయించే చోటుకు త్వరగా వెళతాడు.
6 గాలి దక్షిణ దిశకి వీస్తుంది, తి రిగి ఉత్తర దిశకి వీస్తుంది. గాలి చుట్టూ తిరిగి తిరిగి చివరకు తాను బయల్దేరిన చోటుకే రివ్వున వస్తుంది.
7 నదులన్నీ మరల మరల ఒక్క చోటుకే ప్రవహిస్తాయి. అవన్నీ సముద్రంలోకే పోయి పడినా సముద్రం నిండదు.
8 ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించలేవు . అయితేనేమి, మనుష్యులు మాట్లాడు తూనే వుంటారు . మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడుతునే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. అయినా మనకి తనివి తీరదు.
9 అన్నీ ఆదినుంచి ఉన్నట్లే కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ జరుగుతాయి. జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు.
10 ఎవరైనా, “చూడండి, ఇదిగో ఇది కొత్తది” అని చెప్పవచ్చుగాక. కాని, అది ఎప్పుడూ ఇక్కడ ఉన్నదే. మనం పుట్టక ముందు అది ఇక్కడ ఉన్నదే!
11 పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలు మనుష్యులకి గుర్తుండవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జనానికి గుర్తుండవు. దానికి తర్వాత, అప్పటివాళ్లకి, తమ పూర్వపు వాళ్లు చేసిన పనులు గుర్తుండవు.
12 ప్రసంగి అనే ఉపదేశకుడినైన నేను యెరూషలేములోని ఇశ్రాయేలు రాజును.
13 నేను విద్యను అభ్యసించి, దానివల్ల లభ్యమైన జ్ఞానాన్ని జీవితంలో జరిగే అన్ని విషయాలనూ అవగాహన చేసుకొనేందుకు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. క్రమంలో, ఇది దేవుడు మనకి అప్పగించిన చాలా కఠినమైన పని అని నేను గ్రహించాను.
14 భూమి మీద జరిగేవాటన్నింటినీ నేను పరిశీలనగా చూశాను. అవన్నీ వ్యర్థమని గ్రహించాను. అది గాలిని మూటగట్ట ప్రయత్నించడం వంటిది.
15 (వీటిని వేటినీ మనం మార్చలేము.) వంకరగా వున్నదాన్ని అది తిన్నగా వుందని మనం చెప్పలేము. ఏదైనా ఒకటి అక్కడ లేనప్పుడు అది అక్కడ వుందని మనం చెప్పలేము.
16 “నేను చాలా తెలివైనవాడిని. నాకంటె ముందు యెరూషలేమును పాలించిన రాజులందరికంటె నేను వివేకవంతుడిని. వివేకం, జ్ఞానం వీటి గూర్చి నాకు తెలుసు!” అని నాలో నేను అనుకున్నాను.
17 వివేకం, జ్ఞానం వెర్రితనం మరియు బుద్ధి తక్కువ ఆలోచనలు చెయ్యడంకంటె ఎలా మెరుగైనవో తెలుసుకోవాలని తీర్మానించుకున్నాను. కాని, క్రమంలో వివేకం సంపాదించ ప్రయత్నించడం గాలిని పోగుచేసి, మూటగట్ట ప్రయత్నించడం వంటిదేనని నేను గ్రహించాను.
18 వివేకం పెరిగే కొద్ది మనిషికి నిరాశా నిస్పృహలు పెరుగుతాయి. వివేకం పెరిగిన మనిషి మరింత దుఃఖాన్ని కూడగట్టుకుంటాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×