Bible Versions
Bible Books

Exodus 5 (ERVTE) Easy to Read Version - Telugu

1 మోషే, అహరోనూ ప్రజలతో మాట్లాడిన తరువాత ఫరో దగ్గరికి వెళ్లారు, ‘“నా కోసం పండుగ జరుపుకొనేందుకు నా ప్రజల్ని అరణ్యంలోకి వెళ్లనివ్వు’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబతున్నాడు,” అని చెప్పారు.
2 అయితే ఫరో, “ఆ యెహోవా ఎవరు? అతనికి నేనెందుకు లోబడాలి? ఇశ్రాయేలీయులను నేనెందుకు వెళ్లనివ్వాలి? యెహోవా అని మీరు చెబతున్న వాడు నాకు తెలియదు. అందుచేత ఇశ్రాయేలీయులను నేను వెళ్లనీయను” అన్నాడు.
3 దానికి మోషే, అహరోనులు, “హీబ్రూ ప్రజల దేవుడు మాతో మాట్లాడాడు. కనుక మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోనికి వెళ్లనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. అక్కడ మా యెహోవా దేవునికి ఒక బలి అర్పిస్తాము. ఇది మేము చేయకపోతే ఆయనకు కోపం వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడేమో. ఒక రోగం ద్వారానో, కత్తి చేతనో మమ్మల్ని చంపేస్తాడేమో” అని అన్నారు.
4 కానీ ఫరో, “మోషే, అహరోనూ, ప్రజలను పని చేయనీయకుండా మీరు చేస్తున్నారు. మళ్లీ పోయి పనిచేసుకోమని బానిసలకు చెప్పండి.
5 పనివాళ్లు చాలా విస్తారంగా ఉన్నారు, మీరేమో వాళ్లను పని చెయ్యనివ్వడం లేదు” అని వాళ్లతో చెప్పాడు.
6 అదేరోజు ఇశ్రాయేలీయుల పని మరింత కష్టతరం చేయమని ఫరో ఆజ్ఞాపించాడు. బానిసలపైనున్న యజమానులతో
7 “ఈ ప్రజలు ఇటుకలు చేసేందుకు గడ్డి ఎప్పుడూ మీరే ఇచ్చారు. కాని ఇప్పుడు ఇటుకలు చేసేందుకు అవసరమైన గడ్డిని వాళ్లే పోయి తెచ్చుకోవాలని వారికి చెప్పండి.
8 అయితే వాళ్లు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే. వాళ్లు బద్ధకస్తులయి పోయారు. అందుకే వాళ్లను పోనివ్వుమని నన్ను అడుగుతున్నారు. వాళ్లు చేసేందుకు సరిపడినంత పనిలేదు. అందుకే తమ దేవునికి బలి ఇవ్వడానికి వెళ్లనిమ్మని నన్ను అడుగుతున్నారు.
9 కనుక వీళ్ల పని మరింత కష్టం అయేటట్టు చేయండి. వాళ్లకు బాగా పని చెప్పండి. అప్పుడు మోషే చెప్పే అబద్ధాలు వినేందుకు వాళ్లకు సమయం ఉండదు” అని చెప్పాడు ఫరో.
10 అందుచేత బానిసల పైనున్న ఈజిప్టు యజమానులు, హీబ్రూ ప్రజల నాయకుల దగ్గరకు వెళ్లి, “మీ ఇటుకల కోసం గడ్డి ఇవ్వకూడదని ఫరో నిర్ణయించాడు.
11 మీకు మీరే పోయి గడ్డి తెచ్చుకోవాలి. కనుక వెళ్లి గడ్డి వెదుక్కోండి. అయితే మీరు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవారో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే” అని వాళ్లతో చెప్పారు.
12 కనుక గడ్డికోసం వెదుక్కొంటూ ప్రజలు ఈజిప్టు దేశ వ్యాప్తంగా వెళ్లిపోయారు.
13 ప్రజలు మరింత కష్టపడి పనిచేసేటట్టు బానిస యజమానులు వాళ్లని బలవంతం చేస్తూనే ఉన్నారు. ప్రజలు అంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో అన్ని చేసేటట్టు వారు వాళ్లను బలవంతపెట్టారు.
14 బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను ఏర్పరచుకొని ప్రజలు చేసే పనికి వీళ్లను బాధ్యులుగా చేసారు, “మీరు ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసారో ఇప్పుడు కూడ అన్ని ఎందుకు చెయ్యడం లేదు? ఇది వరకు చేయగలిగారు అంటే, ఇప్పుడూ చేయగల్గుతారు!” అంటూ బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను కొట్టారు.
15 అప్పుడు హీబ్రూ నాయకులు ఫరో దగ్గరకు వెళ్లారు, “మేము నీ సేవకులము నీవు మమ్మల్ని ఎందుకు ఇలా చూస్తున్నావు?
16 నీవేమో మాకు గడ్డి ఇవ్వవు. కాని మేము మాత్రం ఇదివరకు ఎన్ని ఇటుకలు చేసామో అన్ని చేస్తూనే ఉండాలని ఆజ్ఞాపించావు. పైగా ఇప్పుడు యజమానులు మమ్మల్ని కొడుతున్నారు. ఇలా చేయడం నీ మనుష్యులదే తప్పు” అంటూ వారు ఫిర్యాదు చేసి చెప్పారు.
17 ఫరో జవాబిస్తూ, “మీరు సోమరులు, మీకు పని చేయడం ఇష్టంలేదు. అందుకే మిమ్మల్ని పోనివ్వమని నన్ను అడుగుతున్నారు. అందుకే మీరు ఇక్కడ్నుండి వెళ్లిపోయి యెహోవాకు బలులు అర్పించాలని అంటున్నారు.
18 ఇక వెళ్లి పనిచెయ్యండి. మేము మీకు గడ్డి ఇవ్వము కాని మీరు మాత్రం ఇది వరకు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడ అన్ని చేయాలి” అన్నాడు.
19 చిక్కుల్లో పడ్డట్టు ఇశ్రాయేలు పెద్దలకు అర్థమయింది. వారు ఇంతకు ముందు చేసినన్ని ఇటుకలు ఇప్పుడు చేయలేరని నాయకులకు తెలుసు.
20 వారు ఫరో సమావేశం నుండి వెళ్తూ మోషే, అహరోను ఉన్నచోట ఆగారు. వారికోసం మోషే అహరోనూ వేచియున్నారు.
21 వారు మోషే అహరోనులతో, “మమ్మల్ని వెళ్లనిమ్మని మీరు ఫరోతో చెప్పడం చాల తప్పు. ఫరో, అతని అధికారులు మమ్మల్ని ద్వేషించేటట్టు మీరు చేసారు కనుక యెహోవా మిమ్మల్ని శిక్షించాలి. మమ్మల్ని చంపే అవకాశం మీరే వారికి ఇచ్చారు” అని చెప్పారు.
22 అప్పుడు మోషే యెహోవాను ప్రార్థించి, “ప్రభువా, ఎందుకు ఇలా నీ ప్రజలకు నీవు కీడు చేసావు? నీవు ఇక్కడికి నన్నెందుకు పంపించావు? 23నన్ను చెప్పమని నీవు చెప్పిన సంగుతులన్నీ నేను ఫరో దగ్గరకు వెళ్లి చెప్పాను. కాని అప్పట్నుంచి నీ ప్రజల విషయంలో అతడు చాల నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నీవు వాళ్లు సహాయం కోసం ఏమీ చేయలేదు!” అని చెప్పాడు.
23 This verse may not be a part of this translation
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×