Bible Versions
Bible Books

Genesis 39 (ERVTE) Easy to Read Version - Telugu

1 యోసేపును కొన్న వ్యాపార వేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకు వెళ్లారు. ఫరో సంరక్షకుల అధిపతి పోతీఫరుకు వారు అతన్ని అమ్మేసారు.
2 అయితే యెహోవా యోసేపుకు సహాయం చేసాడు. యోసేపు విజయ సారధి అయ్యాడు. తన యజమాని, ఈజిప్టు వాడైన పోతీఫరు ఇంటిలో యోసేపు నివాసం ఉన్నాడు.
3 యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్టు పోతీఫరు తెలుసుకొన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో యెహోవా అతనికి తోడుగా ఉన్నట్టు పోతీఫరు గ్రహించాడు.
4 అందుచేత యోసేపు విషయంలో పోతీఫరు చాల సంతోషించాడు. పోతీఫరు యోసేపును తనకు సహాయం చేయనిస్తూ, తన ఇంటి వ్యవహారాలన్నీ పర్యవేక్షింపనిచ్చాడు. పోతీఫరుకు ఉన్న సమస్తంమీద యోసేపు అధికారి.
5 ఇంటిమీద యోసేపు అధికారిగా చేయబడిన తర్వాత, యెహోవా ఇంటినీ, పోతీఫరుకు ఉన్న సమస్తాన్నీ ఆశీర్వదించాడు. ఇదంతా యోసేపువల్లనే యెహోవా చేసాడు. పోతీఫరు పొలాల్లో పెరిగే వాటన్నిటినీ యెహోవా ఆశీర్వదించాడు.
6 కనుక పోతీఫరు తన ఇంటిలో అన్ని విషయాల బాధ్యత యోసేపునే తీసుకోనిచ్చాడు. పోతీఫరు తాను భుజించే భోజనం విషయం తప్ప మరి దేనిగూర్చీ చింతించలేదు. యోసేపు చాలా అందగాడు. చూడ చక్కని వాడు.
7 కొన్నాళ్ల తర్వాత యోసేపు యజమాని భార్య యోసేపు మీద మోజుపడసాగింది. ఒకనాడు ఆమె, “నాతో శయనించు” అని అతనితో అంది.
8 కానీ యోసేపు నిరాకరించాడు. అతడు చెప్పాడు: “నా యజమాని తన ఇంటిలో అన్ని విషయాల్లోనూ నన్ను నమ్మాడు. ఇక్కడ ఉన్న ప్రతిదాని గూర్చి అతడు నాకు బాధ్యత పెట్టాడు.
9 నా యజమాని తన ఇంట నన్ను దాదాపుగా అతనికి సమానంగా ఉంచాడు. నేను అతని భార్యతో శయనించకూడదు. అది తప్పు అది దేవునికి వ్యతిరేకంగా పాపం.”
10 ఆమె ప్రతిరోజూ యోసేపుతో మాట్లాడుతున్నప్పటికీ యోసేపు ఆమెతో శయనించేందుకు నిరాకరించాడు.
11 ఒక రోజు యోసేపు తన పని చేసుకొనేందుకని ఇంటిలోనికి వెళ్లాడు. సమయంలో అతను ఒక్కడే ఇంటిలో ఉన్నాడు.
12 అతని యజమాని భార్య అతని అంగీ పట్టి లాగి, “వచ్చి నాతో శయనించు” అంది అతనితో. అయితే యోసేపు ఇంట్లోనుంచి బయటకు పారిపోయాడు. పైగా అతడు తన అంగీని ఆమె చేతిలోనే వదిలేసాడు.
13 యోసేపు అతని అంగీని తన చేతిలోనే విడిచి వెళ్లినట్టు స్త్రీ గమనించింది. జరిగిన దాని విషయమై ఆమె అబద్ధం చెప్పాలని నిర్ణయించుకొంది. బయటకు పరిగెత్తింది.
14 ఆమె తన ఇంటిలో ఉన్న పురుషులను పిలిచింది. ఆమె అంది, “చూడండి, మనలను ఆట పట్టించటానికే హెబ్రీ బానిసను తెచ్చారు. ఇతడు లోనికి వచ్చి నన్ను బలవంతం చేయటానికి ప్రయత్నించాడు. కానీ నేను గట్టిగా కేక పెట్టేసరికి
15 అతను భయపడి పారిపోయాడు. అయితే అతని అంగీ నా దగ్గరే వదిలేసిపోయాడు.”
16 తన భర్త, అంటే యోసేపు యజమాని ఇంటికి వచ్చేంత వరకు ఆమె అంగీని ఉంచింది.
17 ఆమె తన భర్తతో అదే కథ చెప్పింది. ఆమె, “నీవు ఇక్కడికి తీసుకొని వచ్చిన హెబ్రీ బానిస నామీద పడటానికి ప్రయత్నం చేసాడు.
18 అయితే అతడు నా దగ్గరకు రాగానే నేను గట్టిగా కేక వేసాను. అతను పారిపోయాడు గాని అతడు అంగీ విడిచిపెట్టేసాడు” అని చెప్పింది.
19 యోసేపు యజమాని అతని భార్య చెప్పిందంతా విన్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది.
20 రాజ ద్రోహులను బంధించే ఒక చెరసాల ఉంది. కనుక యోసేపును చెరసాలలో వేసాడు పోతీఫరు. యోసేపు అందులోనే ఉన్నాడు.
21 అయితే యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపుకు తన దయనుచూపెడ్తూనే ఉన్నాడు. కొన్నాళ్లయ్యేటప్పటికి చెరసాల కాపలాదారుల నాయకునికి యోసేపు అంటే ఇష్టం కలిగింది.
22 కాపలాదారుల అధిపతి ఖైదీలందరి మీద యోసేపును నాయకునిగా ఉంచాడు. యోసేపు వారికి నాయకుడు, అయినప్పటికీ వారి చేసిన పనులే అతడు కూడా చేసాడు.
23 చెరసాలలో ఉన్న ప్రతిదాని విషయంలోను కాపలాదారుల నాయకుడు యోసేపును నమ్మాడు. యెహోవా యోసేపుతో ఉన్నందుచేత ఇలా జరిగింది. యోసేపు చేసే ప్రతి పనిలో అతనికి కార్యసాధన కలిగేటట్టు యెహోవా యోసేపుకు సహాయం చేసాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×