Bible Versions
Bible Books

Genesis 40 (ERVTE) Easy to Read Version - Telugu

1 తరువాత ఫరో సేవకులు ఇద్దరు ఫరోకు అపకారం చేసారు. సేవకుల్లో ఒకడు రొట్టెలు కాల్చేవాడు. మరొకడు ద్రాక్షా పాత్రలు అందించేవారి పెద్ద.
2 వంటల పెద్ద, ద్రాక్షా పాత్రల, పెద్ద మీద ఫరోకు కోపం వచ్చింది.
3 కనుక వారిని కూడా యోసేపు ఉన్న చెరసాలలోనే వేయించాడు ఫరో రాజు సంరక్షకుల అధికారియైన పోతీఫరు చెరసాల అధికారి.
4 ఇద్దరు ఖైదీలను యోసేపు బాధ్యతకు అప్పగించాడు అధికారి. ఇద్దరు మనుష్యులు కొన్నాళ్ల వరకు అలా జైల్లోనే ఉన్నారు.
5 ఒక రాత్రి ఇద్దరు ఖైదీలకు కలలు వచ్చాయి. (ఆ ఇద్దరు ఖైదీలు ఈజిప్టు రాజు సేవకులు - ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షా పాత్రల పెద్ద). ఒక్కో ఖైదీకి ఒక్కో కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది.
6 మర్నాడు ఉదయం యోసేపు వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఇద్దరు మనుష్యులు ఏదో చింతిస్తున్నట్టు యోసేపు గమనించాడు.
7 “ఏమిటి, వేళ మీరు చాలా చింతిస్తున్నట్టు కనబడుతున్నారు?” అని వారిని అడిగాడు యోసేపు.
8 “రాత్రి మాకు కలలు వచ్చాయి కాని మేము కన్న కల మాకు అర్థం కాలేదు. కలలు ఏమిటో, వాటి భావం ఏమిటో మాకు వివరించే వాళ్లెవరూ లేరు” అని వాళ్లిద్దరు జవాబిచ్చారు. యోసేపు, “కలలను తెలిసికొని, వాటి భావం చెప్పగలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు నాకు చెప్పండి” అని వారితో అన్నాడు.
9 కనుక ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుతో తన కల చెప్పాడు. సేవకుడు ఇలా చెప్పాడు: “నా కలలో ఒక ద్రాక్షావల్లి కనబడింది.
10 ద్రాక్షావల్లికి మూడు తీగెలున్నాయి. నేను చూస్తుండగా తీగెలకు పూలు పూసి, ద్రాక్షాగెలలు అయ్యాయి.
11 నేను ఫరో పాత్ర పట్టుకొని ఉన్నాను. కనుక నేను ద్రాక్షాలను తీసుకొని పాత్రలో వాటి రసం పిండాను. అప్పుడు పాత్ర నేను ఫరోకు ఇచ్చాను.”
12 అప్పుడు యోసేపు అన్నాడు: “ఆ కలను నీకు నేను వివరిస్తాను. మూడు కొమ్మలంటే మూడు రోజులు.
13 మూడు రోజులు గతించక ముందే ఫరో నిన్ను క్షమించి, నిన్ను మళ్లీ నీ పని చేసుకోనిస్తాడు. ఇది వరకు నీవు ఫరో దగ్గర పని చేసిన పని నీవు మళ్లీ చేస్తావు.
14 నీకు విడుదల అయింతర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. నా మీద దయ ఉంచి, నాకు సహాయం చేయి. నాకుగూడ చెరసాలలో నుంచి విముక్తి కలిగేటట్టు నా గురించి ఫరోతో చెప్పు.
15 నన్ను అన్యాయంగా బలవంతంగా నా యింటినుండి నా ప్రజలైన హీబ్రూలనుండి తీసుకొనివచ్చారు. నేనేమి తప్పు చేయలేదు. అందుచేత నేను చెరసాలలో ఉండకూడదు.”
16 మరో సేవకుని కల బాగున్నట్టు రొట్టెలు కాల్చేవాడికి తోచింది. వాడు యోసేపుతో అన్నాడు, “నాకూ ఒక కల వచ్చింది. నా తలమీద రొట్టెల బుట్టలు మూడు ఉన్నట్టు నాకు కనబడింది.
17 పై బుట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలు ఉన్నాయి. భోజనం రాజుగారి కోసం. కాని పక్షులు భోజనాన్ని తినేస్తున్నాయి.”
18 యోసేపు జవాబిచ్చాడు: “ఈ కల అర్థం ఏమిటో నీకు నేను చెబతాను. మూడు బుట్టలు అంటే మూడు రోజులు.
19 మూడు రోజులు గడవక ముందే రాజుగారు నిన్ను చెరసాలలోనుంచి విడుదల చేస్తారు. తర్వాత రాజుగారు నీ తల నరికేస్తాడు, నీ శరీరాన్ని ఒక స్తంభానికి వేలాడదీస్తాడు, పక్షులు నీ శరీరాన్ని తినివేస్తాయి.”
20 మూడు రోజుల తర్వాత రాజుగారి పుట్టిన రోజు వచ్చింది. ఫరో తన సేవకులందరికీ ఒక విందు చేసాడు. విందులో ఫరో తన రొట్టెలు కాల్చేవాడిని, ద్రాక్షా పాత్రల సేవకుణ్ణి చెరసాలలోనుంచి బయటకు రప్పించాడు.
21 ద్రాక్షాపాత్రల సేవకుడ్ని ఫరో విడుదల చేసాడు. అతని ఉద్యోగం మరల ఫరో అతనికి ఇచ్చాడు. ద్రాక్షా పాత్రల సేవకుడు ద్రాక్షారసపు పాత్ర ఒకటి ఫరో చేతికి అందించాడు.
22 కానీ ఫరో రొట్టెలు కాల్చే వాడిని చంపేసాడు. ఎలా జరుగుతుందని యోసేపు చెప్పాడో అంతా అలాగే జరిగింది.
23 అయితే ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుకు సహాయం చెయ్యటం మరచిపోయాడు. యోసేపు విషయం ఫరోతో అతడేమీ చెప్పలేదు. ద్రాక్షాపాత్రల సేవకుడు యోసేపును గూర్చి మర్చిపోయాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×