Bible Versions
Bible Books

Isaiah 43 (ERVTE) Easy to Read Version - Telugu

1 యాకోబూ, యెహోవా నిన్ను సృష్టించాడు. ఇశ్రాయేలు, యెహోవా నిన్ను సృజించాడు. ఇప్పుడు యెహోవా చెబతున్నాడు: “భయపడవద్దు. నేను నిన్ను రక్షించాను. పేరుపెట్టి నిన్ను పిలిచాను. నీవు నా స్వంతం.
2 నీకు కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నదులు దాటి వెళ్లేటప్పుడు, అవి నీమీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యనడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.
3 ఎందుకంటే యెహోవానైన నేను నీకు దేవుడను గనుక, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను మీకు రక్షకుణ్ణి గనుక. మీకు విలువగా చెల్లించేందుకు నేను ఈజిప్టును ఇచ్చాను. నిన్ను నా స్వంతం చేసుకొనేందుకు ఇథి యోపియాను, సెబాను నేను ఇచ్చాను.
4 నీవు నాకు ప్రియుడివి గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు బతుకునట్లు నీకు మనుష్యులనూ, నీకిష్టమైన జనాంగాలను నేను ఇచ్చివేస్తాను.”
5 “కనుక భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీ పిల్లలను సమకూర్చి వారిని నీ దగ్గరకు రప్పిస్తాను. తూర్పునుండి, పడమరనుండి నేను వారిని సమకూరుస్తాను.
6 నా మనుష్యుల్ని నాకు ఇచ్చివేయి అని నేను ఉత్తరానికి చెబతాను. నా మనుష్యుల్ని బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి చెబతాను. దూర దేశాలనుండి నా కుమారులను, కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి.
7 నా ప్రజలందరినీ, నీ నామం పెట్టబడిన మనుష్యులందరినీ నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే సృష్టించుకొన్నాను. వాళ్లను నేనే సృష్టించాను. వాళ్లు నావాళ్లు.”
8 “కళ్లుండి చూడలేని వాళ్లను బయటకు తీసుకొనిరండి. చెవులు ఉండి వినలేని వాళ్లను బయటకు తీసుకొని రండి.
9 ప్రజలందరూ, రాజ్యాలు అన్నీ సమావేశపర్చబడాలి. ఆదిలో జరిగిన దానిని గూర్చి వాళ్ల తప్పుడు దేవుళ్లలో ఎవరైనా వారితో చెప్పాలని కోరుతున్నారేమో, వారు వారి సాక్షులను తీసుకొని రావాలి. సాక్షులు సత్యం చెప్పాలి. వారిదే సరి అని ఇది తెలియజేస్తుంది.”
10 యెహోవా చెబతున్నాడు: “ప్రజలారా, మీరే నా సాక్షులు. నేను ఏర్పాటు చేసికొన్న సేవకులు మీరే. ప్రజలు నన్ను విశ్వసించుటకు వారికి మీరు సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాను. ‘నేనే ఆయనను’ అని, నేనే సత్య దేవుడను అని మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు ముందుగా దేవుడూ లేడు, నా తర్వాత దేవుడూ ఉండడు.
11 నా మట్టుకు నేనే యెహోవాను. నేను ఒక్కడనే రక్షకుడను, మరి ఎవరూలేరు.
12 మీతో మాట్లాడిన వాడను నేనే. నేనే మిమ్మల్ని రక్షించాను. సంగతులు నేనే మీకు చెప్పాను. మీతో ఉన్న ఎవరో కొత్తవాడు కాదు. మీరే నా సాక్షులు, నేనే దేవుడను.” సాక్షాత్తు యెహోవా చెప్పిన మాటలు ఇవి.
13 “నేను ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాను. నేనేదైనా చేశాను అంటే నేను చేసిన దానిని ఎవరూ మార్చలేరు. నా శక్తి నుండి మనుష్యులను ఎవ్వరూ రక్షించలేరు.”
14 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యెహోవా చెబతున్నాడు, “నేను మీ కోసం సైన్యాలను బబలోనుకు పంపిస్తాను. అనేక మంది ప్రజలు బంధించబడతారు. కల్దీయుల ప్రజలు వారి స్వంత పడవల్లోనే తీసుకొనిపోబడతారు. (కల్దీ ప్రజలకు పడవలను గూర్చి చాలా గర్వం)
15 నేను యెహోవాను, మీ పరిశుద్ధుడ్ని. ఇశ్రాయేలును నేను సృష్టించాను. నేను మీ రాజును.
16 యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. కల్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక బాట వేస్తాడు. మరియు యెహోవా చెబతున్నాడు,
17 “రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా యుద్ధం చేసేవారు ఓడించబడుతారు. వాళ్లు మళ్లీ ఎన్నటికీ లేవరు. వారు నాశనం చేయబడుతారు. క్రొవ్వువత్తిమంట ఆర్పినట్టుగా వారు ఆపుజేయబడతారు.
18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం కిందట జరిగిన సంగతులను గూర్చి ఆలోచించవద్దు.
19 ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు కొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యయమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను.
20 అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘన పరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను.
21 వీరే నేను చేసిన మనుష్యులు. ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.
22 “యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేలూ, నీవు నాతో విసిగిపోయావు.
23 ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా దగ్గరకు తీసుకొని రాలేదు. మీరు నన్ను ఘనపర్చలేదు. మీరు నాకు బలులు అర్పించలేదు, మీరు నాకు బలులు ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం వేయమని మిమ్మల్ని నేను బలవంతపెట్టలేదు.
24 కనుక మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ న్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు.
25 “నేను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను.
26 కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సమావేశంగా కలుసుకొని ఏది సరైనదో నిర్ణయించాలి. మీరు చేసిన వాటిని గూర్చి చెప్పి, మీదే సరిగ్గా ఉంది అని చూపించాలి.
27 మీ మొదటి తండ్రి పాపం చేశాడు. మీ న్యాయవాదులు నాకు విరోధమైన వాటిని చేశారు.
28 మీ పవిత్ర పాలకులను పవిత్రులు గాకుండా నేను చేస్తాను. యాకోబు సంపూర్తిగా నావాడయ్యేటట్టు నేను చేస్తాను. ఇశ్రాయేలుకు చెడుగులు సంభవిస్తాయి.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×