Bible Versions
Bible Books

Isaiah 46 (ERVTE) Easy to Read Version - Telugu

1 బేలు, నెబో నా ఎదుట సాగిలపడతారు. తప్పుడు దేవుళ్లు వట్టి విగ్రహాలే. మనుష్యులే విగ్రహాలను జంతువులమీద పెడతారు. మోయాల్సిన బరువులు మాత్రమే విగ్రహాలు. తప్పుడు దేవుళ్లు ప్రజలను విసిగించటం తప్ప ఇంకేం చేయవు.
2 తప్పుడు దేవుళ్లన్నీ సాగిలబడతాయి, అవన్నీ పడిపోతాయి. తప్పుడు దేవుళ్లు తప్పించుకోలేవు. అవన్నీ బందీలవలె తీసుకొనిపోబడుతాయి.
3 “యాకోబు వంశమా, నా మాట విను. ఇంకాబతికే ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా నా మాటవినండి. నేను మిమ్మల్ని మోశాను. మీరు మీ తల్లి ఒడిలో ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను.
4 మీరు పుట్టినప్పుడు నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను, మీరు ముసలి వాళ్లయినప్పుడు నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని సృజించాను. కనుక మీ తల వెండ్రుకలు నెరసిపోయినప్పుడు కూడా నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని మోస్తూనే ఉంటాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను.
5 “మీరు నన్ను ఇంకెవరితోనైనా పోల్చగలరా? లేదు. ఎవ్వరూ నాకు సమానలు కారు. నన్ను గూర్చి మీరు పూర్తిగా గ్రహించలేరు. నావంటిది ఇంకేమీ లేదు.
6 కొంత మంది వెండి, బంగారం ఉండి ఐశ్వర్యవంతులు. వారి చేతి సంచుల్లోంచి బంగారం రాలుతుంది, వారు వారి వెండిని త్రాసులో తూకం వేస్తారు. వారు ఒక కళాకారునికి డబ్బిచ్చి, చెక్కతో ఒక తప్పుడు దేవుణ్ణి చేయించుకొంటారు. అప్పుడు ప్రజలు తప్పుడు దేవునికి సాగిలపడి, దానికి పూజ చేస్తారు.
7 మనుష్యులు తప్పుడు దేవుణ్ణి తమ భుజాల మీద పెట్టుకొని మోస్తారు. తప్పుడు దేవుడు నిష్ప్రయోజనం ప్రజలు వానిని మోయాల్సి ఉంటుంది. ప్రజలు విగ్రహాన్ని నేలమీద పెడ్తారు, తప్పుడు దేవుడు కదల్లేడు. తప్పుడు దేవుడు, వాని స్థానం నుండి ఎన్నడూ నడిచిపోడు. ప్రజలు వానిమీద కేకలు వేయవచ్చు, కాని అది జవాబు ఇవ్వదు. తప్పుడు దేవుడు వట్టి విగ్రహం మాత్రమే. అది ప్రజలను వారి కష్టాల్లోంచి రక్షించజాలదు.
8 “ప్రజలారా, మీరు పాపం చేశారు. సంగతులను గూర్చి మీరు మరల ఆలోచన చేయాలి. సంగతులను జ్ఞాపకం చేసుకొని బలవంతంగా ఉండండి.
9 చాలాకాలం కిందట జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుడను అని జ్ఞాపకం ఉంచుకోండి. నేనే అని జ్ఞాపకం ఉంచుకోండి. మరో దేవుడంటూ లేడు. తప్పుడు దేవుళ్లు నావంటివారు కారు.
10 “అంతంలో జరిగే సంగతులను గూర్చి మొదట్లోనే నేను మీకు చెప్పాను. ఇంకా సంభవించని సంగతులను గూర్చి చాలాకాలం కిందట నేను మీకు చెప్పాను. నేను ఒకటి తలపెట్టాను. అది జరిగి తీరుతుంది. నేను చేయాలనుకొన్నవి చేస్తాను.
11 తూర్పునుండి నేను ఒక మనిషిని పిలుస్తున్నాను. మనిషి గద్దలా ఉంటాడు. అతడు చాలా దూర దేశం నుండి వస్తాడు, నేను చేయాలని నిర్ణయించిన వాటిని అతడు చేస్తాడు. నేను ఇలా చేస్తానని నేను మీతో చెబతున్నాను, నేను తప్పక దీనిని చేస్తాను. నేనే అతన్ని చేశాను. నేనే అతడ్ని తీసుకొని వస్తాను.
12 “మీకు గొప్ప శక్తి ఉందని మీలో కొందరు తలుస్తారు. కానీ మీరు మంచి పనులు చేయరు. నా మాట వినండి!
13 నేను మంచి పనులు చేస్తాను. త్వరలో నేను నా ప్రజలను రక్షిస్తాను. సీయోనుకు, అద్భుతమైన నా ఇశ్రాయేలుకు నేను రక్షణ తీసుకొని వస్తాను.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×