Bible Versions
Bible Books

Jeremiah 1 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఇవి యిర్మీయా వర్తమానాలు. యిర్మీయా తండ్రి పేరు హిల్కీయా. అనాతోతు నగరంలో నివసించే యాజకుల కుటుంబానికి చెందిన వాడు యిర్మీయా. నగరం బెన్యామీను వంశానికి చెందిన వారి ప్రాంతంలో వుంది.
2 యూదా రాజ్యాన్ని యోషీయా పాలిస్తున్న రోజులలో యెహోవా యిర్మీయాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. యోషీయా తండ్రి పేరు ఆమోను. యోషీయా రాజ్యపాలన పదమూడవ సంవత్సరం జరుగుతూ ఉండగా యెహోవా యిర్మీయాతో మాట్లాడటం ప్రారంభించాడు.
3 యెహోయాకీము యూదాకు రాజై యున్న కాలం వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం కొనసాగించాడు. యెహోయాకీము తండ్రి పేరు యోషీయా. సిద్కియా రాజ్యపాలన యూదాపై పదకొండు సంవత్సరాల ఐదు మాసాలు జరిగే వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం సాగించాడు. సిద్కియా కూడ యోషీయా కుమారుడే. సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాలు దాటి ఐదవ నెల జరుగుతూ ఉండగా యెరూషలేములో ఉన్న ప్రజలు బందీలుగా కొనపోబడ్డారు.
4 యెహోవా వాక్కు నాకు చేరింది. వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది.
5 “నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే నిన్ను నేనెరిగియున్నాను. నీవు పుట్టకముందే నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను. దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.”
6 అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడనైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను.
7 కాని యెహోవా ఇలా అన్నాడు: “బాలుడనని అనవద్దు. నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి.
8 ఎవ్వరికీ భయపడకు. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”. వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది.
9 పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో ఉంచుతున్నాను.
10 దేశాలను, సామ్రాజ్యాలను రోజు నీ జవాబు దారిలో ఉంచుతున్నాను. నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు. నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు. నీవు వాటని కట్టి నాటుతావు.”
11 యెహోవా యొక్క సందేశం నాకు చేరింది యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తూ ఉన్నావు?” అప్పుడు యెహోవాకు నేనిలా సమాధాన మిచ్చాను: “బాదపు చెట్టుకొమ్మతో చేయబడిన ఒక కర్రను నేను చూస్తున్నాను.”
12 “నీవు చాలా బాగా కనిపెట్టావు. నేను నీకిచ్చిన సందేశం నిజం కావాలని ఎదురు చూస్తున్నాను” అని యెహోవా అన్నాడు.
13 యెహోవా సందేశం నాకు మళ్లీ వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు?” “నేను ఒక మరుగుతున్న నీళ్ల కుండను చూస్తున్నాను. కుండ ఉత్తర దిశనుండి ఒరిగి ఉంది” అని నేను యెహోవాకు చెప్పాను.
14 నాతో యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర దిశనుండి ఉపద్రవం రాబోతూవుంది. దేశంలో నివసిస్తూ ఉన్న వారందరికీ విపత్తువస్తుంది.
15 అనతి కాలంలోనే ఉత్తర ప్రాంత సామ్రాజ్యాల ప్రజలందరికీ నేను పిలుపు యిస్తాను.” ఇది యెహోవా వాక్కు. “ఆయా రాజ్యాధినేతలు వస్తారు. యెరూషలేము ద్వారాల వద్ద వారు తమ సింహాసనాలను ప్రతిష్ఠించుతారు. యెరూషలేము నగర గోడలమీదికి దండెత్తి వస్తారు. యూదా రాజ్యంలోని అన్ని నగరాలపై వారు దండయాత్రలు చేస్తారు.
16 అప్పుడు నా ప్రజలపై నా తీర్పును ప్రకటిస్తాను. వారు చెడు నడతగల వారగుటచేతను, వారు నాపట్ల విముఖులైనందువల్లను నేనిది చేస్తున్నాను. నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు. ఇతర దేవతలకు వారు బలులు అర్పించారు. వారి చేతితో వారు చేసిన బొమ్మలనే వారు ఆరాధించారు.
17 “యిర్మీయా, నీవు మాత్రం సిద్ధంగా ఉండు. ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలియజేయి. ప్రజలకు నీవు భయపడవద్దు. నీవు ప్రజలకు భయపడితే, వారిముందు నీవు భయపడటానికి తగిన కారణం కల్పిస్తాను.
18 నేను మాత్రం రోజు నిన్నొక బలమైన నగరం మాదిరిగాను, ఒక ఇనుప స్థంభం వలెను, ఒక కంచుగోడ వలెను బలపరుస్తాను. దానివల్ల రాజ్యంలో ప్రతి వాని ఎదుట నీవు ధైర్యంగా నిలువగలవు. యూదా రాజుల ఎదుట, యూదా నాయకుల ఎదుట, యూదా యాజకుల ఎదుట, మరియు యూదా ప్రజల ఎదుట నీవు ధైర్యంగా నిలువగలవు.
19 వారంతా నిన్నెదిరిస్తారు; కాని నిన్ను ఓడించలేరు. ఎందుకంటె నేను నీతో ఉన్నాను; నేను నిన్ను ఆదుకుంటాను.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×