Bible Versions
Bible Books

Proverbs 10 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఇవి సొలొమోను సామెతలు (జ్ఞానముగల మాటలు): జ్ఞానముగల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. కాని బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దు:ఖం కలిగిస్తాడు.
2 ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది.
3 యెహోవా మంచి మనుష్యుల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటాడు. వారికి అవసరమైన భోజనాన్ని ఆయన వారికి ఇస్తాడు. కాని దుర్మార్గులకు అవసరమైన వాటిని యెహోవా తొలగించి వేస్తాడు.
4 బద్ధకస్తుడు వేదవాడుగా ఉంటాడు. కాని కష్టపడి పనిచేసేవాడు ధనికుడు అవుతాడు.
5 తెలివిగల వాడు సకాలంలో పంట కూర్చుకొంటాడు. కాని కోత కాలంలో నిద్రపోయేవాడు అవమానము కలిగించే కుమారుడు.
6 మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు దేవుని అడుగుతారు. మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి.
7 మంచి మనుష్యుల కార్యములను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము. కాని చెడ్డవారి పేరు మరువ బడును.
8 జ్ఞానముగల మనిషితో ఎవరైనా ఏదైనా చేయుమని చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు.
9 నిజాయితీగల ఒక మంచి మనిషి క్షేమంగా ఉంటాడు. కాని మోసం చేసే కపటియైన వ్యక్తి పట్టు బడతాడు.
10 సత్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు. బాహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు.
11 ఒక మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగు పరుస్తాయి. కానీ ఒక దుర్మార్గుని మాటలు అతని అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి.
12 ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కానీ మనుష్యులు చేసే ప్రతి తప్పునూ ప్రేమ క్షమిస్తుంది.
13 జ్ఞానముగల వారు వినదగిన మాటలు చెబుతారు. కానీ బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే శిక్షించబడాలి.
14 జ్ఞానముగల వారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకొంటారు. కానీ బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెచ్చుకొంటారు.
15 ధనికుడ్ని ఐశ్వర్యం కాపాడుతుంది. మరియు పేదవాడ్ని పేదరికం పాడు చేస్తుంది.
16 ఒక మనిషి మంచి చేస్తే, అతనికి బహుమానం ఇవ్వబడుతుంది. అతనికి జీవం యివ్వబడుతుంది.దుర్మార్గత శిక్షను మాత్రమే తెచ్చి పెడుతుంది.
17 తన శిక్ష మూలంగా నేర్చుకొన్నవాడు ఇతరులు జీవించటానికి సహాయం చేయగలుగుతాడు. అయితే నేర్చుకొనేందుకు అంగీకరించని వాడు మనుష్యులను తప్పు త్రోవలో మాత్రమే నడిపించగలడు.
18 తన ద్వేషాన్ని దాచిపెట్టేవాడు అబద్ధం చెబుతూ ఉండవచ్చు. కానీ బుద్ధిహీనుడు తాను మాత్రమే ప్రచారం చేసేందుకు చెప్పేటటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు.
19 అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. జ్ఞానముగలవాడు ఊరక ఉండుట నేర్చుకొంటాడు.
20 మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి. కానీ దుర్మార్గుని తలంపులు పనికి మాలినవిగా ఉంటాయి.
21 ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కానీ బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తాయి.
22 యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.
23 బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. కానీ జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు.
24 దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కానీ మంచివాడు తాను కోరుకొనే వాటిని పోందుతాడు.
25 సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుదురు. కానీ మంచివాళ్లకు శాశ్వతమైన పునాది వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు.
26 బద్ధకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా అతడు నిన్ను చికాకు పెడతాడు.
27 నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం బతుకుతావు. కానీ దుర్మార్గులు వారి జీవితంలోనుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు.
28 మంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చి పెడతాయి.
29 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. కానీ తప్పుచేసే వారిని యెహోవా నాశనం చేస్తాడు.
30 మంచి మనుష్యులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు. కానీ దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి వెళ్లగొట్టబడతారు.
31 మంచి మనుష్యులు జ్ఞానముగల మాటలు చెబుతారు. కానీ కష్టం తెచ్చి పెట్టే వాని మాటలు వినటం మనుష్యులు మానివేస్తారు.
32 మంచి మనుష్యులకు సరైన సంగతులు చెప్పటం తెలుసు. కానీ దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలు చెబుతారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×