Bible Versions
Bible Books

Proverbs 15 (ERVTE) Easy to Read Version - Telugu

1 శాంతియుతమైన జవాబు కోపాన్ని పోగొడ్తుంది. కాని దురుసు జవాబు కోపాన్ని పెంచుతుంది.
2 జ్ఞానముగల మనిషి మాట్లాడినప్పుడు ఇతరులు వినాలని ఆశిస్తారు. కాని బుద్ధిహీనుడు మాట్లాడేది తెలివితక్కువ తనమే అవుతుంది.
3 అన్నిచోట్లా జరిగేవాటన్నింటినీ యెహోవా చూస్తాడు. దుర్మార్గులను, మంచి వాళ్లను యెహోవా గమనిస్తాడు.
4 దయగల మాటలు జీవవృక్షంలా ఉంటాయి. కాని అబద్ధాల మాటలు ఒక మనిషి ఆత్మను అణచివేస్తాయి.
5 తెలివితక్కువ వాడు తన తండ్రి సలహా వినేందుకు నిరాకరిస్తాడు. కాని జ్ఞానముగలవాడు మనుష్యులు అతనికి నేర్పించటానికి ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా వింటాడు.
6 మంచి మనుష్యులు అనేక విషయాలలో ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కాని ఒక దుర్మార్గునికి ఉన్నవి అతనికి కష్టం మాత్రమే కలిగిస్తాయి.
7 జ్ఞానము గలవాడు మాట్లాడినప్పుడు అతడు జ్ఞానముతో మాట్లాడుతాడు. కాని బుద్ధిహీనులు వినదగినది ఏమీ చెప్పరు.
8 దుర్మార్గులు అర్పించే అర్పణలు యెహోవాకు అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు వినటం యెహోవాకు సంతోషం.
9 దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు అసహ్యం. మంచి పనులను చేయాలని ప్రయత్నించే మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
10 ఒక వ్యక్తి అక్రమంగా జీవించటం మొదలు పెడితే అతడు శిక్షించబడుతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని మనిషి నాశనం చేయబడతాడు.
11 మరణస్థానంలో జరిగేదానితో సహా, సమస్తం యెహోవాకు తెలుసు. కనుక మనుష్యుల హృదయాల్లో, మనస్సుల్లో ఏమి జరుగుతుందో యెహోవాకు నిశ్చయంగా తెలుసు.
12 బుద్ధిహీనుడు తప్పు చేసినప్పుడు అది అతనికి చెబితే ఇష్టం ఉండదు. అతడు జ్ఞానముగల వారిని సలహా అడగటానికి నిరాకరిస్తాడు.
13 ఒక వ్వక్తి సంతోషంగా ఉంటే అతని ముఖం ఆనందంగా ఉంటుంది. అయితే ఒక మనిషి హృదయంలో విచారం ఉంటే, అప్పుడు అతని స్వభావంలో దు:ఖం వ్యక్తం అవుతుంది.
14 జ్ఞానముగలవాడు ఇంకా ఎక్కువ తెలివి సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ బుద్ధిహీనునికి ఇంకా ఎక్కువ బుద్ధిహీనత కావాలి.
15 కొంతమంది పేదవాళ్లు ఎంతసేపూ విచారం గానే ఉంటారు. అయితే హృదయాల్లో సంతోషంగల పేదవాళ్లకు జీవితం ఒక పెద్ద విందులా ఉంటుంది.
16 ధనికునిగా అనేక కష్టాలు కలిగి ఉండటంకంటె, దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించటం మేలు.
17 ద్వేషం ఉన్నచోట విస్తారంగా భోజనం చేయటంకంటే, ప్రేమగల చోట కొద్దిగా భోజనం చేయటం మేలు.
18 త్వరగా కోపపడేవారు కష్టాన్ని కలిగిస్తారు. కానీ హనంగల మనిషి శాంతిని కలిగిస్తాడు.
19 బద్ధకస్తునికి అంతటా కష్టమే ఉంటుంది. కానీ నిజాయితీగల మనుష్యులకు జీవితం తేలిగ్గా ఉంటుంది.
20 జ్ఞానముగల కుమారుడు తన తండ్రికి సంతోషం కలిగిస్తాడు. అయితే బుద్ధిహీనుడు తన తల్లికి అవమానం తెస్తాడు.
21 తెలివితక్కువ వానికి తెలివితక్కువ తనమే ఆనందం. కానీ జ్ఞానముగలవాడు సరైన వాటినే చేయటానికి జాగ్రత్తపడతాడు.
22 ఒక వ్యక్తి సరిపడినంత సలహా తీసుకొనకపోతే, అతని తలంపులు విఫలమవుతాయి. అయితే ఒక వ్యక్తి జ్ఞానముగలవారు తనకు చెప్పే విషయాలు వింటే విజయం పొందగలడు.
23 ఒక మనిషి మంచి జవాబు ఇచ్చినప్పుడు సంతోషిస్తాడు. మరియు సరైన సమయంలో సరైన మాట చెప్పటం చాలా మంచిది.
24 జ్ఞానముగల మనిషి చేసే పనులు విజయానికి నడిపిస్తాయి. అతడు మరణ స్థానానికి దిగజారిపోకుండా విషయాలు అతనిని వారిస్తాయి.
25 గర్విష్ఠికి ఉన్న గృహమును యెహోవా నాశనం చేస్తాడు. అయితే విధవరాలి వస్తువులను యెహోవా కాపాడుతాడు.
26 చెడు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కానీ దయగల మాటల విషయంలో యెహోవా సంతోషిస్తాడు.
27 ఒక వ్యక్తి వస్తువులు సంపాదించటం కోసం దురాశపడితే అతడు తన కుటుంబానికి కష్టం తెచ్చి పెడ్తాడు. కానీ లంచగొండితనాన్ని ద్వేషించే నిజాయితీపరుడు బతుకుతాడు.
28 మంచి మనుష్యులు జవాబు చెప్పక ముందు ఆలోచిస్తారు. అయితే దుర్మార్గులు ఆలోచించక ముందే మాట్లాడేస్తారు. అది వారికి కష్ఠం కలిగిస్తుంది.
29 యెహోవా దుర్మార్గులకు చాలా దూరంగా ఉంటాడు. కానీ మంచివాళ్ల ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ వింటాడు.
30 నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోషపెడ్తాడు. శుభవార్త మనుష్యులకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది.
31 ఒక మనిషి తాను తప్పు చేసిననప్పుడు, దానిని సరిదిద్దుటకు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేవాడు చాలా జ్ఞానముగలవాడు.
32 ఒకడు నేర్చుకొనేందుకు నిరాకరిస్తే అతడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. అయితే ఒక మనిషి తాను చేసింది తప్పు అని చెప్పినప్పుడు వినే మనిషి మరీ ఎక్కువగా గ్రహిస్తాడు.
33 యెహోవాను గౌరవించువాడు జ్ఞానము గలిగి ఉండటానికి నేర్చుకొంటున్నాడు. ఒక వ్యక్తి నిజంగా యెహోవాను గౌరవించేముందు, వినమ్రుడవాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×