Bible Versions
Bible Books

Psalms 77 (ERVTE) Easy to Read Version - Telugu

1 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను. దేవా నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
2 నా దేవా నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను. రాత్రి అంతా నీకోసం నా చేయిచాపి ఉన్నాను. నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
3 నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు, నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
4 నీవు నన్ను నిద్రపోనియ్యవు. నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలపరపడి పోయాను.
5 గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను. చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
6 రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను. నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
7 “మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా? ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
8 దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా? ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
9 కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా? ఆయన జాలి కోపంగా మార్పబడిందా” అని నాకు అనిపిస్తుంది.
10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా? అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.
11 యేహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను . దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను. విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం. దేవా, ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు .
14 నీవు ఆద్భుత కార్యాలు చేసిన దేవుడివి . నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు. యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.
16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి. లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి. ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి. అప్పుడు నీ మెరుపు బాణాలు మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి. మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది. భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు. కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు మోషేను, అహరోనును నీవు వాడు కొన్నావు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×