Bible Versions
Bible Books

1 Samuel 3 (ERVTE) Easy to Read Version - Telugu

1 రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడైన సమూయేలు యెహోవా సేవలో ఉన్నాడు.
2 ఏలీ కళ్లు బలిహీనమై ఇంచుమించు గుడ్డివాడైపోయాడు. ఒకరోజు అతడు పడుకుని వున్నాడు.
3 సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది.
4 యెహోవా సమూయేలును పిలిచాడు. “ఇక్కడే వున్నాను” అంటూ
5 (ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ. సమూయేలు పోయి పడుకున్నాడు.
6 దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.
7 సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు .
8 మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?”అని అన్నాడు. యెహోవా బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది.
9 ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే’యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’ అని చెప్పమన్నాడు. తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు.
10 యెహోవా వచ్చి అక్కడ నిలిచాడు. “సమూయేలూ!, సమూయేలూ” అంటూ మునుపటిలా పిలిచాడు. “చెప్పండి, నేను మీ దాసుడను. నేను వింటున్నాను” అన్నాడు సమూయేలు.
11 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యాం నిర్వహించదలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతాడు .
12 నేను ఏలీకి, అతని కుటుంబానికి ఏది చేస్తానని చెప్పివున్నానో అదంతా అప్పుడు చేస్తాను. మొదటినుంచి చివరి వరకు అంతా చేసి తీరుతాను.
13 తన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు ఏలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక పోయాడు.
14 అందువల్ల ఏలీ వంశం ఎన్ని బలులు, ధాన్యార్పణలు సమర్పించినా వారి పాపాన్ని మాపుకో లేరని నిశ్చితంగా చెప్పి ఉన్నాను.”
15 తెల్లవారేవరకూ సమూయేలు పక్కమీదే ఉన్నాడు. తరువాత లేచి దేవాలయ ద్వారం తెరిచాడు. దర్శనం గూర్చి ఏలీతో చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు
16 కాని ఏలీ, “కుమారుడా సమూయేలూ” అని పిలిచాడు. “ఇక్కడే ఉన్నానయ్యా” అన్నాడు సమూయేలు.
17 “యెహోవా నీతో ఏమన్నాడు? నాతో ఏమీ దాచవద్దు. ఆయన నీకు చెప్పిన సమాచారంలో నీవు ఏమి దాచినా దేవుడు నిన్ను బాగా శిక్షిస్తాడు” అని అన్నాడు.
18 దానితో సమూయేలు ఉన్నది వున్నట్లు ఏలీకి ఏమీ దాచకుండా చెప్పాడు. అది విన్న ఏలీ, “ఆయన యెహోవా. ఆయనకు ఏది మంచిదనిపిస్తే అది చేయనీ” అన్నాడు.
19 సమూయేలు పెరుగుతూ వుండగా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా సమూయేలుతో చెప్పిన వర్తమానాలను ఎన్నడూ అబద్ధం కానీయలేదు.
20 అందువల్ల దానునుండి, బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు దేశమంతా సమూయేలును యెహోవా యొక్క నిజమైన ప్రవక్తగా గుర్తించింది.
21 షిలోహులో యెహోవా సమూయేలుకు దర్శనమిస్తూ వచ్చాడు. మాటలోనే సమూయేలుకు యెహోవా ప్రత్యక్షమయ్యేవాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×