Bible Versions
Bible Books

2 Chronicles 12 (ERVTE) Easy to Read Version - Telugu

1 రెహబాము చాలా శక్తివంతుడైన రాజయ్యాడు. అతడు తన రాజ్యాన్ని కూడ చాలా బలపర్చాడు. తరువాత రెహబాము, యూదా వంశంవారు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించుటం మాని వేశారు.
2 రెహబాము రాజయ్యాక ఐదవ సంవత్సరంలో షీషకు యెరూషలేముపై దండెత్తాడు. షీషకు ఈజిప్టుకు రాజు. రెహబాము, యూదా ప్రజలు యెహోవాకు విశ్వాసపాత్రంగా లేకపోవుటచే ఇది జరిగింది.
3 షీషకు వద్ద పన్నెండువేల రథాలు, అరవై వేల మంది గుర్రపు స్వారీ చేయగలవారు, మరియు ఎవ్వరూ లెక్క పెట్టలేనంత మంది సైనికులు వున్నారు. షీషకు యొక్క మహా సైన్యంలో లిబ్యా సైనికులు (లూబీయులు), సుక్కీయులు, ఇథియోఫియనులు (కూషీయులు) వున్నారు.
4 షీషకు యూదాలోని బలమైన నగరాలను ఓడించాడు. పిమ్మట షీషకు తన సైన్యాన్ని యెరూషలేముకు నడిపించాడు.
5 తరువాత ప్రవక్తయగు షెమయా రెహబాము వద్దకు, యూదా నాయకుల వద్దకు వచ్చాడు. యూదా నాయకులంతా షీషకుకి భయపడి యెరూషలేములో సమావేశమయ్యారు. షెమయా రెహబాముతోను, యూదా నాయకుల తోను యీలా చెప్పాడు, “యెహోవా విధంగా తెలియజేస్తున్నాడు: ‘రెహబామూ, నీవు మరియు యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టారు. నా ధర్మశాస్త్రాన్ని పాటించటానికి నిరాకరించారు. ఇప్పుడు మిమ్మల్ని నా సహాయం లేకుండా షీషకును ఎదుర్కోటానికి వదిలి పెడుతున్నాను”‘
6 అది విన్న యూదా నాయకులు, రాజైన రెహబాము విచారించి, తమను తాము తగ్గించుకొని విధేయులయ్యారు. “యెహోవా న్యాయమైనవాడు” అని అన్నారు.
7 రాజు, యూదా పెద్దలు విధేయులైనట్లు యెహోవా గమనించాడు. పిమ్మట షెమయాకు యెహోవా వర్తమానం ఒకటి వినవచ్చింది. యెహోవా షెమయాతో యీలా చెప్పాడు: ‘రాజు, నాయకులు తమను తాము తగ్గించుకున్నారు. కావున వారిని నేను నాశనం చేయను. పైగా వారికి వెంటనే రక్షణ కల్పిస్తాను. యెరూషలేము మీద నా కోపాగ్నిని కురిపించటానికి నేను షీషకును వినియోగించను.
8 కాని యెరూషలేము ప్రజలు మాత్రం షీషకుయొక్క సేవకు లౌతారు. నాకు సేవచేయటం ఇతర దేశాల రాజులను సేవించటంకంటె భిన్నమైనదని వారు తెలిసి కొనేటందుకే ఇది యీలా జరుగుతుంది.”
9 షీషకు యెరూషలేముపై దండెత్తి ఆలయాన్ని కొల్లగొట్టాడు. షీషకు ఈజిప్టు రాజు. అతడింకా రాజభవనంలో వున్న ఖజానాను కూడ కొల్లగొట్టాడు. షీషకు రికిన ప్రతి వస్తువును తీసుకొని, ధనరాశులను పట్టుకుపోయాడు. అతడంకా సొలొమోను చేయించిన బంగారు డాళ్లనుకూడా పట్టుకుపోయాడు.
10 రాజైన రెహబాము బంగారు డాళ్ల స్థానంలో కంచుడాళ్లను చేయించాడు. రాజభవన ప్రధాన ద్వారం వద్ద కాపలా దారుల అధిపతులకు రెహబాము కంచు డాళ్లు యిచ్చాడు.
11 రాజు ఆలయ ప్రవేశం చేసినప్పుడు ద్వారపాలకులు కంచుడాళ్లను వెలికితీసి వాడేవారు. పిమ్మట వారు మళ్ళీ కంచుడాళ్లను ఆయుధాగారంలో వుంచేవారు.
12 రెహబాము తనను తాను తగ్గించుకున్న తరువాత, యెహోవా అతని పట్ల తన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. అందువల్ల యెహోవా రెహబామును పూర్తిగా నాశనం చేయలేదు. యూదాలో ఇంకా కొంత మంచితనం మిగిలివుంది.
13 యెరూషలేములో రెహబాము చాలా శక్తివంతమైన రాజుగా రూపొందాడు. అతడు రాజయ్యేనాటికి నలబై ఒక్క సంవత్సరాలవాడు. రెహబాము రాజుగా యెరూషలేములో పదిహేడు సంవత్సరాలు వున్నాడు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో యెహోవా తనపేరు ప్రతి ష్ఠాపనకు యెరూషలేమునే ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి పేరు నయమా. నయమా అమ్మోను దేశస్తురాలు.
14 దేవుడైన యెహోవాను అనుసరించుటం మాని రెహబాము చెడుకార్యాలకు పాల్పడ్డాడు. ఎందుకంటే అతడు యెహోవాని అనుసరించాలని హృదయమందు తీర్మానించు కొనలేదు.
15 రెహబాము రాజైనప్పటి నుండి అతని పాలన అంతమయ్యేవరకు అతను చేసిన విషయాలన్నీ షెమయా రచనలలోను పొందుపర్చబడ్డాయి. షెమయా ఒక ప్రవక్త. ఇద్దో ఒక దీర్ఘదర్శి వీరిద్దరూ కుటుంబ చరిత్రలు రాశారు. రెహబాము, యరొబాము రాజులిద్దరూ పాలించిన కాలంలో వారిద్దరి మధ్య యుద్ధాలు జరిగాయి,
16 రెహబాము చనిపోగా అతనిని దావీదు నగరంలో సమాధిచేశారు. పిమ్మట రెహబాము కుమారుడు అబీయా కొత్తగా రాజయ్యాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×