Bible Versions
Bible Books

Deuteronomy 6 (ERVTE) Easy to Read Version - Telugu

1 “నేను మీకు ప్రబోధించాలని మీ యెహోవా దేవుడు నాకు చెప్పిన ఆజ్ఞలు, నియమాలు, ఇవి: మీరు నివసించేందుకు ప్రవేశిస్తున్న దేశంలో ఆజ్ఞలకు లోబడండి.
2 మీరూ, మీ సంతతివారు బదికినంత కాలం మీ దేవుడైన యెహోవాను గౌరవించాలి. నేను మీకు యిచ్చే ఆయన నియమాలు, ఆజ్ఞలు అన్నింటికీ మీరు విధేయులు కావాలి. మీరు ఇలా చేస్తే, కొత్త దేశంలో మీరు దీర్ఘకాలం బతుకుతారు.
3 ఇశ్రాయేలు ప్రజలారా, జాగ్రత్తగా వినండి. ఆజ్ఞలకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీకు అంతా శుభం అవుతుంది. మరియు మీరు ఒక గొప్ప రాజ్యం అవుతారు. ఐశ్వర్యవంతమైన మంచి దేశంలొ వీటన్నింటినీ మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసాడు.
4 “ఇశ్రాయేలు ప్రజలారా వినండి: యెహోవా ఒక్కడు మాత్రమే మన దేవుడు.
5 మరియు మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను, మీ నిండు బలంతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
6 ఈవేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలను ఎల్ల ప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి.
7 వాటిని మీ పిల్లలకు నేర్పించేందుకు జాగ్రత్త వహించండి. మీరు మీ యింట్లో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఉండండి. మీరు పడుకొనేప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతు ఉండండి.
8 నా ప్రబోధాలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు సహాయకరంగా ఆజ్ఞలను మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరించండి.
9 మీ ఇండ్ల ద్వార బంధాలమీద, గవునుల మీద వాటిని వ్రాయండి.”
10 “మీకు యిస్తానని చెప్పి మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు, యాకోబులకు ఆయన వాగ్దానం చేసిన దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొనివస్తాడు. అప్పుడు మీరు నిర్మించని గొప్ప, ధనిక పట్టణాలను ఆయన మీకు ఇస్తాడు.
11 మీరు సమకూర్చని మంచి వస్తువుల తో నిండిపోయిన గృహాలను ఆయన మీకు ఇస్తాడు. మీరు త్రవ్వని బావులను యెహోవా మీకు ఇస్తాడు. మీరు నాటని ద్రాక్షాతోటలను, ఒలీవ చెట్లను యెహోవా మీకు ఇస్తాడు. భోజనానికి మీకు సమృద్ధిగా ఉంటుంది.
12 “కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన యెహోవాను మరచిపోకండి.
13 మీ దేవుడైన యెహోవాను గౌరవించి ఆయనను మాత్రమే సేవించండి. ఆయన పేరు మీద మాత్రమే ప్రమాణాలు చేయాలి. (బూటకపు దేవుళ్ల పేర్లు ఉపయోగించవద్దు).
14 మీరు యితర దేవుళ్లను అనుసరించకూడదు. మీ చుట్టూ నివసించే ప్రజల దేవుళ్లను మీరు అనుసరించకూడదు.
15 మీ దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో ఉన్నాడు. మరియు మీరు ఇతర దేవుళ్లను వెంబడిస్తే, యెహోవాకు మీ మీద చాలా కొపం వస్తుంది. మిమ్మల్ని భూమి మీద ఉండకుండా ఆయన నాశనం చేస్తాడు. ఆయన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించటం యెహోవా ద్వేషిస్తాడు.
16 “మస్సాలో మీరు ఆయనను పరీక్షించినట్టుగా మీ దేవుడైన యెహోవాను మీరు పరీక్షించకూడదు.
17 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు తప్పనిసరిగా విధేయులు కావాలి. ఆయన మీకు ఇచ్చిన ప్రబోధాలు, ఆజ్ఞలు అన్నింటినీ మీరు పాటించాలి.
18 సరైనవి, మంచివి, యెహోవాను సంతోషపెట్టేవి మాత్రమే మీరు చేయాలి. అప్పుడు మీకు అంతా మేలు జరిగి, యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు.
19 మరియు యెహోవా చెప్పినట్టు మీరు మీ శత్రువులందరినీ బలవంతంగా బయటకు వెళ్లగొడ్తారు.
20 “భవిష్యత్తులో ‘మన దేవుడైన యెహోవా మనకు ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు యిచ్చాడు గదా’ వాటి అర్థం ఏమిటి?’ అని నీ కుమారుడు నిన్ను అడగవచ్చును.
21 అప్పుడు నీవు నీ కుమారునితో ఇలా చెప్పాలి, ‘మనం ఈజిప్టులో ఫరోకు బానిసలం, అయితే యెహోవా మహా బలంతో ఈజిప్టునుండి మనలను బయటకు తీసుకొని వచ్చాడు.
22 మహాగొప్ప, ఆశ్చర్యకరమైన నిదర్శనాలు, అద్భుతాలు యెహోవా మనకు చూపించాడు. ఈజిప్టు ప్రజలకు, ఫరోకు, ఫరో ఇంటివాళ్లకు ఆయన సంగతులు జరిగించటం మనం చూశాము.
23 మరియు యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకు ఇచ్చేందుకు ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు.
24 ప్రబోధాలన్నీ పాటించాలని యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. అప్పుడు, మనం ఇప్పుడు ఉన్నట్టుగా ఎల్లప్పుడూక్షేమంగా సజీవులంగా ఉండేటట్లు మన దేవుడైన యెహోవా మనలను కాపాడతాడు.
25 మనం పాటించాలని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం మనం ఆజ్ఞలన్నింటికీ విధేయులం అవటం మనకు మంచిదిగా దేవుడైన యెహోవా చూస్తాడు.’
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×