Bible Versions
Bible Books

Ezekiel 8 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఒకరోజు నేను (యెహెజ్కేలు) నా ఇంటిలో కూర్చొని ఉన్నాను. యూదా పెద్దలు నా ముందు కూర్చున్నారు. ఇది చెరబట్టబడిన కాలంలో ఆరవ సంవత్సరం, ఆరవ నెల (సెప్టెంబరు) ఐదవ రోజున జరిగింది. నా ప్రభువైన యెహోవా శక్తి అకస్మాత్తుగా నామీదికి వచ్చింది.
2 అగ్నివంటి రూపాన్నొకటి నేను చూశాను. అది మానవ శరీరంలా ఉంది. నడుము నుండి కిందికి అది అగ్నిలా కన్పించింది. నడుము నుండి పైకి ఆకారం దేదీప్యమానంగా వెలు గొందుతూ, అగ్నిలో కరుగాలిన లోహంలా ఉంది.
3 పిమ్మట చెయ్యి వంటిదొకటి నేను చూశాను. చెయ్యి నా మీదికి వచ్చి నా తలపై జుట్టుపట్టుకుంది. పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపింది. దేవదర్శనంలో ఆయన నన్ను యెరూషలేముకు తీసుకొని వెళ్లాడు. ఆయన నన్ను లోపలి ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. అది నగరానికి ఉత్తర దిశన ఉంది. ద్వారం దగ్గరే దేవుడు అసూయపడేలా చేసిన విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది.
4 కాని ఇశ్రాయేలు దేవుని మహిమ అక్కడ ఉంది. మహిమ నేను కెబారు కాలువ వద్ద లోయలో చూసిన దర్శనంలా ఉంది.
5 దేవుడు నాతో మాట్లాడుతూ, “నరపుత్రుడా, ఉత్తర దిశవైపు చూడు!” అన్నాడు. నేను ఉత్తరానికి చూశాను. అక్కడ బలిపీఠం వద్దగల ద్వారానికి ఉత్తరంగా దేవుడు అసూయ పడునట్లు చేసిన విగ్రహం ఉంది.
6 మళ్లీ దేవుడు నాకు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి భయంకరమైన పనులు చేస్తున్నారో నీవు చూస్తున్నావా? వారు దానిని ఖచ్చితంగా నా ఆలయం పక్కనే నెలకొల్పారు! నీవు నాతో వస్తే, ఇంకా భయంకరమైన విషయాలు చూస్తావు!”
7 అందువల్ల నేను ఆవరణద్వారం వద్దకు వెళ్లాను. గోడలో ఒక రంధ్రాన్ని చూశాను.
8 దేవుడు నాతో, “నరపుత్రుడా, గోడలో ఒక రంధ్రం చెయ్యి” అని చెప్పాడు. కాబట్టి నేను తలుపులో ఒక రంధ్రాన్ని చేశాను. లోపల ఒక తలుపు కన్పించింది.
9 అప్పుడు దేవుడు నాతో, “లోనికి వెళ్లి ఇక్కడ ప్రజలు చేస్తున్న భయంకరమైన, దుష్టమైన పనులను చూడు” అని అన్నాడు.
10 నేను లోనికి వెళ్లి చూశాను. అక్కడ మీరు ఊహించటానికే అసహ్యకరమైన పాముల, బల్లుల, క్రిమీకీటకాదుల, ఇతర జంతువుల ప్రతిమలు, శిల్పాలు ఉన్నాయి. అవన్నీ ఇశ్రాయేలీయులు ఆరాధించే హేయమైన విగ్రహాలు. జంతువుల బొమ్మలు అన్ని గోడల మీదా చుట్టూ చెక్కబడి ఉన్నాయి!
11 అక్కడ షాఫాము కుమారుడైన యజన్యాయును, మరి డెబ్బయి మంది ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) ప్రజలతో కలసి స్థలంలో ఆరాధిస్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రజల ముందు నిలబడి ఉన్నారు! ప్రతీ పెద్ద మనిషి చేతిలో ఒక ధూప కలశం ఉంది. సాంబ్రాణి ధూపం గాలిలోకి లేస్తూ ఉంది.
12 అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో ఏమి చేస్తున్నారో నీవు చూశావా? ప్రతి ఒక్కడూ తన బూటకపు దేవునికి ఒక గది కలిగి ఉన్నాడు! ‘మనల్ని యెహోవా చూడలేడు. యెహోనా దేశాన్ని వదిలేశాడు’ అని వారిలో వారనుకుంటున్నారు.”
13 దేవుడు మళ్లీ, “నీవు నాతో వస్తే, మనుష్యులు మరీ భయంకరమైన పనులు చేయటం చూస్తావు!” అని అన్నాడు.
14 దేవుడు నన్ను ఆలయ ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. ద్వారం ఉత్తరపు దిక్కున ఉంది. అక్కడ స్త్రీలు కూర్చుని, ఏడ్వటం చూశాను. వారంతా బూటకపు దేవము తమ్మూజును గురించి దుఃఖిస్తున్నారు!
15 దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, భయంకరమైన విషయాలు గమనించావా? నా వెంట రమ్ము. నీవింతకంటే ఘోరమైన విషయాలు చూస్తావు!”
16 ఆయన నన్ను యెహోవా ఆలయం లోపలి ఆవరణలోనికి తీసుకొని వెళ్లాడు. ఆక్కడ ఇరవైఐదు మంది కిందికి వంగి ఆరాధించటం చూశాను. వారు ముందు మండపానికి, బలి పీఠానికి మధ్యలో ఉన్నారు. కాని వారు తప్పు దిశకు తిరిగి కూర్చున్నారు! వారి వీపులు పవిత్ర స్థలానికి వెనుతిరిగి ఉన్నాయి. వారు సూర్యుణ్ణి ఆరాధించటానికి వంగు తున్నారు!
17 అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు,”నరపుత్రుడా, ఇది చూశావు గదా! యూదా ప్రజలు నా ఆలయాన్ని అతి సామాన్యమైనదిగా భావిస్తూ, ఆలయంలోనే వారు చెడు పనులు కొనసాగిస్తున్నారు.! దేశమంతా దౌర్జన్యంతో నిండిపోయింది. వారు నిరంతరం చెడుకార్యాలు చేస్తూ నాకు పిచ్చి పట్టిస్తున్నారు. చూడు, ఒక బూటకపు దేవతలా చంద్రుని ఆరాధించటానికి వారు ముక్కులకు ఉంగరాలు పెట్టుకుంటున్నారు.
18 వారికి నా కోపం చూపిస్తాను! వారిపట్ల ఏమాత్రం కనికరం చూపించను! వారిని గురించి నేను విచారించను! వారు ప్రాధేయపడి నన్ను పిలుస్తారు. కాని వారి అభ్యర్థనను నేను వినను!”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×