Bible Versions
Bible Books

Ezra 3 (ERVTE) Easy to Read Version - Telugu

1 అలా ఏడవ నెల నాటికి ఇశ్రాయేలీయులు తమ తమ సొంత పట్టణాలకు చేరుకున్నారు. అప్పుడు వాళ్లందరూ యెరూషలేములో గుమికూడి ఒక ప్రజగా సమైక్యమయ్యారు.
2 యెజాదా కొడుకైన యేషూప, అతనితో వున్న యాజకులూ, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, అతని సహచరులు ఇశ్రాయేలు దేవునికి బలిపీఠం నిర్మించారు. ఇశ్రాయేలీయులు తాము బలులు సమర్పించ గలిగేందుకు వీలుగా బలిపీఠాన్ని నిర్మించారు. సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో పేర్కొన బడినట్లు వాళ్లు బలిపీఠాన్ని నిర్మించారు. మోషే యెహోవాకు ప్రత్యేక సేవకుడు.
3 తమకి సమీపంలో నివసిస్తున్న ఇతర ప్రజలంటే వాళ్లు భయపడ్డారు. అయినా, వాళ్లు ఆగకుండా, పాతపునాది మీదనే బలీపీఠాన్ని నిర్మించి, ఉదయంపూటా, సాయంత్రంపూటా దహనబలులు సమర్పిస్తూ వచ్చారు.
4 సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు వాళ్లు పర్ణశాలల పండుగ చేసుకున్నారు. పండుగ రోజులు పొడుగునా ప్రతిరోజూ సరైన సంఖ్యలో దహన బలులు సమర్పించారు.
5 అటు తర్వాత, ప్రతి రోజూ నిరంతర దహనబలులు, అమావాస్య రోజున జరిగే బలులు, మరి ఇతర పండుగల రోజులకూ, శెలవు రోజులకూ, స్వేచ్ఛార్ఫణలను యెహోవా ఆజ్ఞ ప్రకారం అర్పించారు. జనం కూడా యెహోవాకు తాము ఇవ్వాలనుకున్న కానుకలు ఇవ్వనారంభిచారు.
6 విధంగా, ఏడవ నెల మొదటి రోజున, ఆఇశ్రాయేలీయులు యెహోవాకు తిరిగి దహనబలులు ఇవ్వనారంభించారు. దేవాలయం అప్పటికి ఇంకా తిరిగి నిర్మించబడకపోయినా కూడా బలి అర్పణ సాగింది.
7 చెరనుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు రాళ్లు చెక్కేవాళ్లకు, వడ్రంగులకు డబ్బులిచ్చారు. వాళ్లు తూరు, సీదోను ప్రజలకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఒలీవనూనెను, లెబానోను నుండి దేవదారు చెట్లమొద్దులను తెచ్చేందుకు ఇచ్చారు. సోలొమోను మొదటిగా దేవాలయం నిర్మించినప్పుడు తెప్పించి నట్లే, వాళ్లు కూడా దేవదారు చెట్ల మొద్దులను ఓడల్లో సముద్రతీర పట్టణమైన యొప్పేకు తెప్పించాలనుకున్నారు. పారశీక చక్రవర్తి కోరెషు ఇందుకు వారికి అనుమతినిచ్చాడు.
8 యెరూషలేములోని దేవాలయం దగ్గరకు వాళ్లు చేరుకున్నమీదట రెండవ ఏడాది రెండవ నెలలో షయల్తీయేలు కొడుకైన జెరుబ్బాబెలూ, యెజాదా కొడుకైన యేషూవ పని ప్రారంభించారు. వాళ్ల సోదరులు, యాజకులు, లేవీయులు, నిర్బంధంనుంచి యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లందరూ వాళ్లతో కలిసి పనిచేయ ప్రారంభించారు. లేవీయుల్లో 20 ఏళ్లు నిండినవాళ్లనీ, అంతకు పైబడినవాళ్లనీ యెహోవా దేవాలయ నిర్మాణంలో నాయకులుగా నియమించారు.
9 దేవాలయ నిర్మాణ కార్యకలాపాలను కింది వారు అజమాయిషీ చేశారు: యేషూవ మరియు అతని కొడుకులు, మరియు అతని సహోదరులు, కద్మీయేలు మరియు అతని కొడుకులు (యూదా వంశస్థులు); హేనాదాదు, మరిము అతని కొడుకులు, లేవీయులందరు
10 పనివాళ్లు యెహోవా దేవాలయానికి పునాది నిర్మాణాన్ని పూర్తిచేశారు. పునాది పూర్తయ్యాక, యాజకులు యాజకదుస్తులు ధరించి, బూరలు చేతబూనారు. అసాపు కొడుకులు తాళాలు పట్టుకొని నిలబడ్డారు. వాళ్లందరూ యెహోవాను స్తుతించేందు కోసం తమతమ స్థానాల్లో నిలిచారు. ఇదంతా ఇశ్రాయేలు రాజైన దావీదు గతంలో ఆదేశించిన విధంగా జరిగింది.
11 వాళ్లు కృతజ్ఞతాస్తుతులు పాడారు. “యెహోవా మంచివాడు. ఆయన నిజమైన ప్రేమ ఇశ్రాయేలీయుల మీద ఎల్లప్పుడూ నిలిచివుంటుంది” అంటూ వాళ్లు స్తుతి కీర్తనలు పాడారు. చివరిగా అక్కడ ఉన్న మనుష్యులందరూ ఏకమై బిగ్గరగా గొంతెత్తి యెహోవాను కీర్తించారు. యెహోవా దేవాలయానికి పునాది వేయబడిన సందర్భంగా వాళ్లు గొప్పశబ్దంతో యెహోవాకు సోత్రాలు చెల్లించారు.
12 అయితే, చాలామంది వృద్ధ యాజకులు, లేవీయులు, వంశ పెద్దలు విలపించారు. ఎందుకంటే, వాళ్లు వెనకటి దేవాలయాన్ని చూసినవాళ్లు. వాళ్లు పూర్వవైభవాన్ని జ్ఞాపకం చేసుకొని, కొత్త దేవాలయాన్ని చూసినప్పుడు బిగ్గరగా ఏడ్చారు. జనంలో మిగిలిన చాలామంది సరదాగా సంతోషంగా కేరింతలు కొడుతూండగా వాళ్లు విలపించారు.
13 ధ్వనులు చాలాదూరం వరకూ వినబడ్డాయి. వాటిలో ఏవి సంతోషధ్వనులో, ఏవి విలాపాలో ఎవరూ చెప్పుకోలేక పోయారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×