Bible Versions
Bible Books

Hosea 12 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఎఫ్రాయిము వాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, “ఇశ్రాయేలీయులు రోజంతా “గాలిని తరుముతున్నారు.” వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.
2 యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకు గాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి.
3 యాకోబు ఇంకా తన తల్లి కడుపులో ఉండగానే తన సోదరుణ్ణి మోసగించ నారంభించాడు. యాకోబు బలిష్టడైన యువకుడు. అప్పట్లో అతను దేవునితో పోరాడాడు.
4 యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుణ్ణి ఒక సహాయం చేయుమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు.
5 ఔను, యెహోవాయే సర్వసేనాధిపతియైన దేవుడు. అయన పేరు యెహోవా (ప్రభువు).
6 అందుకని, మీరు మీ దేవుని వద్దకు తిరిగి రండి. ఆయనకు విధేయులుగా ఉండండి. దయగలవారిగా నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి.
7 “యాకోబు ఒక వ్యాపారస్థుడు. అతను తన మిత్రుణ్ణి కూడా మోసగిస్తాడు. అతని తక్కెడలు కూడా సరైననవి కావు.
8 ఎఫ్రాయిము ఇలా అనుకున్నాడు: ‘నేను ఐశ్వర్యవంతుణ్ణి! నాకు ధనరాశులు దొరికాయి. నా నేరాల సంగతి ఎవడూ తెలుసుకోడు. నా పాపాలు గురించి ఎవడూ తెలుకోడు.’
9 “మీరు ఈజిప్టు దేశంలో ఉన్ననాటినుంచి యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. గుడార సమావేశ కాలంలో మాదిరిగా నేను మిమ్మల్ని గుడారాల్లో నివసింపజేస్తాను.
10 నేను ప్రవక్తలతో మాట్లాడాను. నేను వాళ్లకి అనేక దర్శనాలు ఇచ్చాను. నేను పద్ధతులను సూచించాను.
11 కాని, గిల్గాదు ప్రజలు పాపులు. అక్కడ అనేక క్షుద్ర దేవతా విగ్రహాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు గిల్గాలువద్ద ఎడ్లను బలులుగా ఇస్తారు. వాళ్లకి బలిపీఠాలు అనేకం ఉన్నాయి. దున్నిన పొలంలో బురద చాళ్లు ఉన్నట్లే వాళ్లకి బారులు బారులుగా బలిపీఠాలు ఉన్నాయి.
12 “యాకోబు అరాము దేశంలోకి పారిపోయాడు. అక్కడ, ఇశ్రాయేలు ఒక భార్యకోసం శ్రమచేశాడు. మరో భార్యకోసం గొర్రెల్ని మేపాడు.
13 కాని, యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఈజిప్టునుంచి వెనక్కి రప్పించాడు. యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును భద్రంగా కాపాడాడు.
14 కాని, ఎఫ్రాయిము యెహోవాకి మిక్కిలి కోపం కలిగించాడు. ఎఫ్రాయిము చాలామందిని హతమార్చాడు. అందుకని, అతను తన నేరాలకిగాను శిక్షింపబడతాడు. అతని ప్రభువు అతన్ని తన సిగ్గును సహించేటట్లుగా చేశాడు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×