Bible Versions
Bible Books

Hosea 7 (ERVTE) Easy to Read Version - Telugu

1 “ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను! ఎఫ్రాయిము యొక్క పాపం గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. సమరయ అబద్ధాలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. పట్టణంలో వచ్చి పోయే దొంగలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
2 ప్రజల నేరాలను నేను జ్ఞాపకం ఉంచుకొంటానని వారు నమ్మరు. వారు చేసిన చెడ్డపనులు చుట్టూరా ఉన్నాయి. వారి పాపాలను నేను తేటగా చూడగలను.
3 ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను సంతోషపెడ్తాయి. వాళ్లు చెప్పే అబద్ధాలు వాళ్ల నాయకులను సంతోషపెడ్తాయి.
4 రొట్టెలు చేయువాడు రొట్టె చేయుటకు పిండి పిసుకుతాడు. అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు. రొట్టె పొంగుతున్నప్పుడు అతడు మంట ఎక్కువ చేయడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు రొట్టెలు చేసేవానిలాగ లేరు. ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు.
5 మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు. ద్రాక్షామద్యపు వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు. కనుక దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు కలుపుతారు.
6 ప్రజలు రహస్య పథకాలు వేస్తారు. వారి హృదయాలు పొయ్యివలె ఉద్రేకముతో మండుతాయి. వారి కోపం రాత్రి అంతా మండుతుంది. మర్నాడు ఉదయం అది బహు వేడిగల నిప్పువలె ఉంటుంది.
7 వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు. వారు వారి పాలకులను నాశనం చేశారు. వారి రాజులంతా పతనం అయ్యారు. వారిలో ఒక్కడు కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.”
8 “ఎఫ్రాయిము రాజ్యాలతో కలిసిమెలిసి ఉంటుంది. ఎఫ్రాయిము రెండు వైపులా కాలని రొట్టెలా ఉంది.
9 పరాయివాళ్లు ఎఫ్రాయిము బలాన్ని నాశనం చేస్తారు. కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు. ఎఫ్రాయిము తలమీద తెల్లవెంట్రుకలు ఉన్నాయి, కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు.
10 ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లాడుతుంది. ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు కలిగాయి. అయినప్పటికీ వారు తమ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లలేదు. ప్రజలు సహాయంకోసం ఆయనవైపు చూడలేదు.
11 కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు. ప్రజలు సహాయంకోసం ఈజీప్టును పిలిచారు. సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు.
12 సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు. కానీ నేను వారిని వలలో పడవేస్తాను. వారి మీద నేను నా వల విసిరి ఆకాశ పక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను. వారి ఒడంబడిక విషయంలో నేను వారిని శిక్షిస్తాను.
13 అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు. నాకు విధేయులగుటకు వారు నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడతారు. ప్రజలను నేను రక్షించాను. కానీ వారు నాకు విరోధంగా అబద్ధాలు చెబుతారు.
14 అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు. వారు ఇతరుల భూములలో ధాన్యం, కొత్త ద్రాక్షారసం కోసం తరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు. కానీ వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు.
15 నేను వారికి బుద్ధి వచ్చేటట్లు చేసి, వారు చేతులను బలపర్చాను. కానీ వారు నాకు విరోధంగా దుష్ట పన్నాగాలు పన్నారు.
16 దేవుళ్లుకాని వారివైపు (బయలు దేవత) వారు తిరిగారు. వారు అక్కరకు రాని (వంగని) విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ బలాన్ని గూర్చి అతిశయించారు. కానీ వారు కత్తులతో చంపబడతారు. అప్పుడు ఈజిప్టు ప్రజలు వారిని చూచి నవ్వుతారు. విగ్రహారాధన నాశనానికి దారి తీస్తుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×