Bible Versions
Bible Books

Isaiah 6 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరం నా ప్రభువును నేను చూశాను. మహా ఎత్తయిన సింహాసనంమీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంగీతో దేవాలయం నిండిపోయింది.
2 సెరాపులనే దేవదూతలు ఆయన పైగా నిలబడ్డారు. ఒక్కొక్క సెరాపు దేవదూతకు ఆరు రెక్కలు ఉన్నాయి. దేవదూతలు వారి ముఖాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు, పాదాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు మరియు ఎగిరేందుకు రెండేసి రెక్కలు ఉపయోగించారు.
3 దేవదూతలు ఒకరితో ఒకరు, “ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన మహిమ భూలోకమంతా నిండిపోయింది” అని ఘనంగా స్తుతిస్తున్నారు.
4 వారి స్వరాలు గడప కమ్ముల్ని కదలించి వేశాయి. అంతలో దేవాలయం ధూమంతో నిండిపోవటం మొదలయింది.
5 “అయ్యో! నాకు శ్రమ, నేను నాశనమయ్యాను. నేను అశుద్ధమైన పెదవులున్న వాడను, నేను అపరిశుద్ధమైన పెదవులున్న జనుల మధ్య నివసిస్తున్నాను. సైన్యములకధిపతియైన యెహోవాను నేను చూశాను.”
6 బలిపీఠం మీద అగ్ని ఉంది. సెరాపు దేవదూతల్లో ఒకరు అగ్నిలో నుండి మండుచున్న ఒక నిప్పుకణాన్ని తీయటానికి ఒక పట్టకారు ఉపయోగించారు. మండుతున్న నిప్పుకణం చేతపట్టుకొని దేవదూత నా దగ్గరకు ఎగిరి వచ్చాడు.
7 సెరాపు దేవదూత వేడి నిప్పుకణంతో నా నోటిని తాకాడు. అప్పుడు దూత, “చూడు, వేడి నిప్పుకణం నీ పెదాలను తాకింది గనుక నీవు చేసిన తప్పులన్నీనీలో నుండి పోయాయి. ఇప్పుడు నీ పాపాలు తుడిచివేయబడ్డాయి.” అని చెప్పాడు.
8 అప్పుడు నా ప్రభువు స్వరం నేను విన్నాను. “నేను ఎవర్ని పంపగలను? మా కోసం ఎవరు వెళ్తారు?” అన్నాడు యెహోవా. కనుక నేను “ఇదుగో నేను ఉన్నాను, నన్ను పంపించు” అన్నాను.
9 అప్పుడు యెహోవా చెప్పాడు, “వెళ్లి, ప్రజలతో ఇది చెప్పు: ‘మీరు దగ్గరగా వచ్చి వింటారు గాని గ్రహించరు! దగ్గరగా వచ్చి చూస్తారు గాని నేర్చుకోరు.
10 ప్రజల్ని గందరగోళం చేయి. ప్రజలు విని, చూచే విషయాలు వారు గ్రహించకుండా ఉండేటట్టు చేయి. నీవు ఇలా చేయకపోతే, ప్రజలు వారి చెవులతో వినే విషయాలను నిజంగానే గ్రహించవచ్చు. ప్రజలు వారి మనస్సుల్లో నిజంగానే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వారు అలా కనుక చేస్తే, ప్రజలు మళ్లీ నా దగ్గరకు తిరిగి వచ్చి, స్వస్థత పొందుతారేమో (క్షమాపణ)!”
11 అప్పుడు నేను “ప్రభూ, ఎన్నాళ్లు నేను ఇలా చేయాలి?” అని అడిగాను. యెహోవా జవాబిచ్చాడు, “పట్టణాలు నాశనం చేయబడి, ప్రజలు వెళ్లిపోయేంత వరకు ఇలా చేయి. ఇళ్లలో మనుష్యులు ఎవ్వరూ నివసించకుండా ఉండే అంతవరకు ఇలా చేయి. దేశం నాశనం చేయబడి, నిర్జనం అయ్యేంతవరకు ఇలా చేయుము.”
12 ప్రజలు దూరంగా వెళ్లిపోయేట్టు యెహోవా చేస్తాడు. దేశంలో విస్తారమైన ప్రదేశాలు నిర్జనంగా ఉంటాయి.
13 అయితే పదోవంతు ప్రజలు దేశంలో ఉండేందుకు అనుమతించబడతారు. ప్రజలు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు గనుక వీరు నాశనం చేయబడరు. ప్రజలు సింధూర వృక్షంలాంటి వారు. చెట్టు నరికి వేయబడినప్పుడు, దాని మొద్దు విడువబడుతుంది. మొద్దు (మిగిలిన ప్రజలు) చాలా ప్రత్యేకమైన విత్తనం.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×