Bible Versions
Bible Books

Job 10 (ERVTE) Easy to Read Version - Telugu

1 “నా స్వంత జీవితం నాకు అసహ్యం. అందు చేత నేను స్వేచ్ఛగా ఆరోపణలు చేస్తాను. నా ఆత్మ చాలా వేదనగా ఉంది కనుక ఇప్పుడు నేను మాట్లాడతాను.
2 నేను దేవునితో చెబుతాను, ‘నన్ను నిందించవద్దు. నేను ఏమి తప్పు చేశాను, నాకు చెప్పు. నా మీద నీకు ఎందుకు విరోధం?
3 దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడటం నీకు సంతోషమా? చూస్తుంటే, నీవు చేసిన దాని గూర్చి నీకు శ్రద్ధ లేనట్లుంది. దుర్మార్గులు వేసే పథకాలకు నీవు సంతోషిస్తున్నావా?
4 దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా? మనుష్యులు చూసినట్టుగా నీవు సంగతులు చూస్తున్నావా?
5 మా రోజుల్లాగ మీవి కొద్దిపాటి రోజులా? మా సంవత్సరాల్లా మీవి కొన్ని సంవత్సరాలేనా?
6 నీవు నా తప్పుకోసం చూస్తూ నాపాపం కోసం వెదకుతున్నావు.
7 కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు. అయితే నీ శక్తినుండి నన్ను ఎవ్వరూ రక్షించలేరు!
8 దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి. కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం చేస్తున్నావు.
9 దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం చేసుకో. కానీ, నీవు ఇప్పుడు నన్ను మరల మట్టిగా ఎందుకు మారుస్తున్నావు?
10 పాలు ఒలుకబోసినట్టుగా నీవు నన్ను సోస్తున్నావు. నన్ను వెన్న చిలకరించినట్లుగా చేస్తున్నావు.
11 ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు. తర్వాత చర్మంతో, మాంసంతో నీవు నన్ను కప్పివేశావు.
12 నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ చూపించావు. నా విషయమై నీవు శ్రద్ధ చూపించావు. నా ఆత్మను కాపాడావు.
13 కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది ఇదేనని నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది ఇదేనని నాకు తెలుసు.
14 ఒకవేళ నేను పాపం చేస్తే, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించవచ్చునని నీవు నన్ను గమనిస్తూ ఉంటావు.
15 నేను పాపం చేసినప్పుడు, నేను దోషిని. అది నాకు చాలా చెడు అవుతుంది. కానీ నేను నిర్దోషిని అయినా సరే, నేను నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే, నేను సిగ్గుతో, బాధతో నిండిపోయాను గనుక.
16 ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తోంటే ఒకడు సింహాన్ని వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతావు. నీవు మరోసారి నా మీద నీ శక్తి చూపిస్తావు.
17 నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు నీకు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. నామీద నీ కోపం ఎక్కువ అవుతుంది. నీవు నా మీదికి కొత్త సైన్యాలను పంపిస్తావు.
18 అందుచేత, దేవా అసలు నీవు నన్ను ఎందుకు పుట్టనిచ్చావు? నన్ను ఎవరూ చూడక ముందే నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది.
19 నేను ఎన్నడూ ఒక మనిషిని కాకుండా ఉంటే బాగుండును. నేను నా తల్లి గర్భం నుండి తిన్నగా సమాధికి మోసికొనిపోబడితే ఎంత బాగుండేది.?
20 నా జీవితం దాదాపు అయిపోయింది. కనుక నన్ను ఒంటరిగా వదిలెయ్యి. ఏదో కొద్దిపాటి వసతుల్ని అనుభవించనివ్వు.
21 చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగిరారో, అంధకారం, మరణం ఉండే చోటుకు నేను వెళ్లక ముందు, నాకు మిగిలి ఉన్న కొద్ది సమయం నన్ను అనుభవించనివ్వు.
22 ఎవ్వరూ చూడలేని, అంధకార ఛాయల, గందరగోళ స్థలానికి నేను వెళ్లకముందు నన్ను అనుభవించ నివ్వు. అక్కడ వెలుగు కూడా చీకటిగా ఉండి ఉంటుంది.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×