Bible Versions
Bible Books

Lamentations 2 (ERVTE) Easy to Read Version - Telugu

1 సీయోను కుమార్తెను (యెరూషలేము) యెహోవా మేఘముతో కప్పి ఎలా మరుగు పర్చినాడో చూడుము. ఇశ్రాయేలు వైభవాన్ని ఆయన ఆకాశాన్నుండి భూమికి త్రోసివేశాడు. యెహోవాకు కోపం వచ్చిన రోజున ఇశ్రాయేలు ఆయన కాలిపీట అని కూడా ఆయన గుర్తు పెట్టు కోలేదు.
2 యాకోబు (ఇశ్రాయేలు) ఇండ్లను యెహోవా మింగివేశాడు. కనికరం లేకుండా ఆయన వాటిని మింగివేశాడు. ఆయన తన కోపంలో యూదా కుమార్తె (యూదా రాజ్యం) కోటలను నాశనం చేశాడు. యూదా రాజ్యాన్ని, దాని పాలకులను యెహోవా నేలకు పడదోసినాడు. ఆయన రాజ్యాన్ని నాశనం చేశాడు.
3 యెహోవా తన కోపంతో ఇశ్రాయేలు బలాన్ని క్షయం చేశాడు. ఆయన తన కుడిచేతిని ఇశ్రాయేలు మీదినుండి తీసివేశాడు. శత్రువు వచ్చినప్పుడు ఆయన అలా చేశాడు. యాకోబు (ఇశ్రాయేలు) లో ఆయన అగ్నిశిలలా మండినాడు. ప్రళయాగ్నిలా ఆయన ఉన్నాడు.
4 ఒక శత్రువులా యెహోవా తన విల్లు వంచాడు. అయన కుడిచేయి తన ఖడ్గం ఒరమీద వుంది. బాగా కన్పించే యూదా మనుష్యులందరినీ ఆయన చంపివేశాడు. యెహోవా ఒక శత్రువులా వారిని హతమార్చినాడు. యెహోవా తన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన దానిని సీయోను గుడారాలపై కుమ్మరించాడు.
5 యెహోవా ఒక శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగేశాడు. ఆయన దాని స్థలాలన్నిటినీ మింగేశాడు. ఆయన దాని కోటలన్నిటినీ మింగేశాడు. మృతుల కొరకు యూదా కుమార్తెలో మిక్కిలి దుఃఖాన్ని, బాధను కలుగ జేశాడు.
6 యెహోవా తన స్వంత గుడారాన్నే ఒక తోట మాదిరి నాశనం చేసినాడు. ప్రజలు ఎక్కడ సమావేశమై తనను ఆరాధిస్తారో ప్రదేశాన్నే ఆయన పాడుజేశాడు. సీయోనులో ప్రత్యక సమావేశాలు, ప్రత్యేక విశ్రాంతి దినాలను ప్రజలు మర్చిపోయేలా యెహోవా చేశాడు. యెహోవా రాజును, యాజకుని తిరస్కరించాడు. తనకోపంలో ఆయన వారిని తిరస్కరించాడు.
7 యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు. ఆయన తన పవిత్ర ఆరాధనా స్థలాన్ని తిరస్కరించాడు. యెరూషలేము కోట గోడలను ఆయన శత్రువులకు అప్పజెప్పాడు. యెహోవా ఆలయంలో శత్రువు అల్లరి చేశాడు. అది ఒక సెలవు రోజు అన్నట్లు వారు అల్లరి చేశారు.
8 సీయోను కుమార్తె (ఇశ్రాయేలు) కోట గోడలను కూల దోయటానికి యెహోవా పథకం నిర్ణయించాడు. ఒక కొలబద్దతో అతడు గోడకు గుర్తులు పెట్టాడు. దానిని నాశనం చేయటంలో తనను తాను నిగ్రహించుకోలేదు. కావున బయటి ప్రాకారం, ఇతర గోడలు ధుఃఖ భారంతో కూలి పోయేలా చేశాడు. అవి ఒక్కుమ్మడిగా శిథి లమై పోయాయి.
9 యోరూషలేము ద్వారాలు భూమిలోకి క్రుంగి పోయాయి. ద్వారాల కడ్డీలను ఆయన నుగ్గు నుగ్గు చేశాడు. ఆమె యొక్క రాజు, యువరాజులు పరదేశాలకు పోయి ఉన్నారు. వారికి ఇక ఎంత మాత్రం ఉపదేశం లేదు. యెరూషలేము ప్రవక్తలకు కూడా యెహోవా నుండి దర్శనాలు ఏమీలేవు.
10 సీయోను పెద్దలు నేలపై కూర్చున్నారు. వారు కింద కూర్చుండి మౌనం వహించారు. వారు తమ తలలపై దుమ్ము జల్లుకున్నారు. వారు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము యువతులు దుఃఖంతో తమ తలలు కిందికి వంచుకున్నారు.
11 కన్నీళ్లతో నా కళ్లు నీరసించాయి! నా అంత రంగంలో గందరగోళం చెలరేగుతూవుంది! నా గుండె జారి కిందపడినట్లు భావన కలుగుతూ ఉంది! నా ప్రజల నాశనం చూసిన నాకు భావన కలుగుతూ ఉంది. పిల్లలు, పసికందులు నగర రహదారి స్థలాలలో మూర్ఛపోతున్నారు.
12 “రొట్టె, ద్రాక్షారసం ఏవి?” అని పిల్లలు తమ తల్లులను ఆగుడుతున్నారు. వారు చనిపోతూ ప్రశ్న అడుగుతున్నారు. వారు తమ తల్లుల ఒడిలో పడుకొని ఉండగా చనిపోతున్నారు.
13 సీయోను కుమారీ, నిన్ను దేనితో సరిపోల్చను? నిన్ను దేనితో పోల్చాలి? సీయోను కన్యాకుమారీ, నిన్ను దేనితో పోల్చను? నిన్నెలా ఓదార్చగలను? నీ వినాశనం సముద్రమంత పెద్దది! ఎవ్వరేగాని నిన్ను స్వస్థపర్చగలరని నేను అనుకోవటంలేదు.
14 నీ ప్రవక్తలు నీ కొరకు దర్శనాలు చూశారు. కాని వారి దర్శనాలన్నీ విలువలేని అబద్ధాలు. పాపం చేయవద్దని వారు నిన్ను హెచ్చరించలేదు. పరిస్థితి మెరుగుపర్చటానికి వారు ఎట్టి ప్రయత్నిమూ చేయలేదు. వారు నీకొరకు ఉపదేశాలు అందించారు. కాని, అవి కేవలం నిన్ను మోసగించటానికి ఉద్దేశించబడిన అబద్ధపు వర్తమానాలు.
15 మార్గమున పోవు వారు నిన్ను చూసి విస్మయంతో చేతులు చరుస్తారు. యెరూషలేము కుమార్తెను చూచి వారు ఈలవేసి తలలు ఆడిస్తారు. ‘అపురూప అందాల నగరం’ అనీ , ‘భూనివాసులకు ఆనంద దాయిని’ అని ప్రజలు పిలిచే నగరం ఇదేనా?” అని వారడుగుతారు.
16 నీ శత్రువులంతా నిన్ను చూసి నోళ్లు తెరుస్తారు. వారు ఈలవేసి, నిన్నుజూచి పండ్లు కొరుకుతారు. “మేము వారిని మింగేశాము! నిజంగా మేము రోజుకొరకే ఎదురుచూశాము. చివరకు ఇది జరగటం మేము చూశాము” అని వారంటారు.
17 యెహోవా తాను అనుకున్న ప్రకారమే చేశాడు. ఆయన ఏది చేస్తానని అన్నాడో అది చె సివేశాడు. పూర్వకాలం నుండి ఆయన ఎలా హెచ్చరిస్తూవచ్చాడో ఆయన ఇప్పుడు అలాగే చేశాడు. దయాదాక్షిణ్యం లేకుండా ఆయన నాశనం చేశాడు. నీ మూలంగానే నీ శత్రువులు సంతోషపడేలా ఆయన చేశాడు. ఆయన నీ శత్రువుల శక్తియుక్తులను పెంచాడు.
18 సీయోను కుమార్తె ప్రాకారమా, నీ గుండెలు పగిలేలా యెహోవాకు మొరపెట్టుకో! నీ కన్నీరు వాగులా పారనీ! నీ కన్నీరు మున్నీరై పారనీ! నీ కన్నీరు రాత్రింబవళ్లు కారనీ! వాటిని ఆపకు! నీ కండ్లకు విశ్రాంతి ని వ్వకు!
19 లెమ్ము! రాత్రిళ్లు రోదించు! రాత్రిళ్లు ప్రతి ఝామున దుఃఖించు! ఒక జలరాశిలా నీ గుండె కుమ్మరించు! యెహోవా ముందు నీ గుండె కుమ్మరించు! నీ చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేయుము. నీ పిల్లలు బతికేలా చేయుమని ఆయనను ప్రాధేయపడుము. ఆకలితో అలమటించి సొమ్మసిల్లే నీ పిల్లలను బతికించుమని ఆయనను అర్థించుము. ఆకలితో మాడి నగర వీధుల్లో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు.
20 యెహోవా, నావైపు చూడుము! నీవు రకంగా శిక్షించినది ఎవ్వరినో చూడు! నన్ను ప్రశ్న అడుగనిమ్ము: తాము కన్న బిడ్డలనే స్త్రీలు తిన వలెనా? తాము పెంచి పోషిర చిన బిడ్డలనే స్త్రీలు తినవలెనా? యాజకుడు, ప్రవక్త యెహోవా ఆలయంలో చంపబడాలా?
21 యువకులు, ముసలివారు నగర వీధుల్లో దుమ్ములో పడివున్నారు. నా యువతీ యువకులు కత్తి వేటుకు గురియైనారు. యెహోవా, నీవు కోపగించిన రోజున నీవు వారిని చంపేశావు! దయ లేకుండా నీవు వారిని చంపివేశావు!
22 నలుమూలల నుండి నా మీదికి భయాన్ని ఆహ్వానించావు. ఏదో విందుకు ఆహ్వానించినట్లు నీవు భయాన్ని ఆహ్వానించావు. యెహోవాకు కోపం వచ్చిన రోజున తప్పించుకున్నావాడుగాని, దానిని తట్టుకున్నవాడుగాని ఒక్కడూ లేడు. నేను పెంచిపోషించిన వారందరినీ నా శత్రువు చంపివేశాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×