Bible Versions
Bible Books

Psalms 104 (ERVTE) Easy to Read Version - Telugu

1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు. మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
2 ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు. ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.
3 దేవా వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు. దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు. గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.
4 దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు. నీ సేవకులను అగ్నిలా చేశావు.
5 దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు. కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.
6 దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు. నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.
7 కానీ నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి. దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.
8 పర్వతాలనుండి లోయల్లోనికి, తరువాత నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
9 సముద్రానికి నీవు హద్దులు నియమించావు. నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.
10 దేవా, నీటి ఊటలనుండి నీటి కాలవలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు. పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని కిందికి కాలువలా ప్రవహింపజేసావు.
11 నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి. అక్కడ నీళ్లు తాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి.
12 నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి. సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి.
13 దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు. దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి.
14 దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు. మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. మొక్కలే భూమి మీద నుండి మాకు లభించే ఆహారం.
15 దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు. మా చర్మాన్ని నునుపు చేసే తైలాన్ని నీవు మాకిస్తావు. మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు.
16 లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు. మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి.
17 పక్షులు వృక్షాలపై గూళ్లు పెడతాయి. పెద్దకొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.
18 పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం, పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు.
19 దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము. ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు.
20 చీకటిని నీవు రాత్రిగా చేశావు. సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి.
21 సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి. అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను ఆడుగుతున్నట్టు ఉంటుంది.
22 మరల సూర్యుడు ఉదయించినప్పుడు జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి.
23 అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు. సాయంత్రం వరకు వారు పని చేస్తారు.
24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు. భూమి నీ కార్యాలతో నిండిపోయింది. నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి కొన్ని చిన్నవి. మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి. నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం సముద్రంలో ఆడుకుంటుంది.
27 దేవా, ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారంయిస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు. మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు అవి భయపడిపోతాయి. వాటి ప్రాణం వాటిని విడిచి నప్పుడు అవి బలహీనమై చస్తాయి. మరియు అవి మరలమట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినపుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి. భూమి మరల కొత్తదిగా అవుతుంది.
31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక. యెహోవా చేసిన వాటిని ఆయన అనుభవించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు అది వణకుతుంది. ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.
33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను. నేను బతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక. దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! యెహోవాను స్తుతించు!
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×